నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
వివిధ దానములు - వాని మహత్మ్యములు
నారదమహర్షి మాటలను వినిన అంబరీష మాహారాజు నారదమహర్షికి నమస్కరించి "మహర్షీ ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా ? మరి యింకనూ ఉన్నవా ? అవి యేవి ? వాని ఫలితములను గూడ దయయుంచి వివరింపుము" అని కోరెను.
అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండ జీవింతురు. ఆ సత్పురుషుడు ఆశయనముపై శయనించినను, దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును.
వైశాఖమాసమున కశిపును (పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై తమ వంశము వారితో బాటు శారీరక, మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. సద్బ్రాహ్మణునకు మంచముతోబాటు దిండును గూడ దానమిచ్చినచో ఏడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును.
గడ్డి, తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. శక్తియుండి పర్యంక దానము చేసిన వచ్చే పుణ్యమే, అశక్తులై కట (చాప) శయ్యాదానము చేసినవారికిని కలుగును. వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువు తొలగి చిరకాలము సుఖజీవనము కలుగును.
ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును, లోని తాపమును పోగొట్టు కర్పూరమును, ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములను దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై సుఖించును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున తాంబూల దానము, చందనము, కస్తూరి మున్నగు సుగంధద్రవ్యములు, మొగలి, మల్లెపువ్వులు దానమిచ్చినచో విష్ణు అనుగ్రహమున ముక్తి నందుదురు.
సద్బ్రాహ్మణుని యింటిలో విశ్రాంతి మండపమును కట్టించి యిచ్చినచో వాని పుణ్యము వర్ణనాతీతము. నీడనిచ్చు మండపము, చలివేంద్రము నిర్మించినవారు లోకాధిపతులగుదురు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము, పరులకుపయోగించు మంచి పనులు, పుత్రుడు - ఇవి ఏడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు.
వైశాఖమాసమున తాపహారకమైన మజ్జిగ (తక్రము) దానమిచ్చినవాడు విద్యావంతుడు, ధనవంతుడగును. పెరుగు కుండను దానమిచ్చినచో అనంత పుణ్యము కలుగును. శ్రేష్ఠమైన బియ్యము, ఆవునేయి, బెల్లము, దోసకాయ, చెరకు గడ దానము చేసినవారు సర్వపాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుదురు.
ముఖ్యముగా వైశాఖమాసమున సాయంకాలమున అలసిన బ్రాహ్మణునకు పానకమును, మామిడి పండ్లను దానమిచ్చినచో పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. చైత్ర అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు శ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగునని నారదుడు వివరించెను.
