🪷 కమలంపై కూర్చున్న లక్ష్మి అమ్మవారి చేతుల్లో కమలం ఎందుకు ఉందో ఎప్పుడైనా ఆలోచించారా...? 🪷

మహాలక్ష్మి అమ్మవారి రెండుచేతుల్లోను పద్మాలు ఎందుకు.........!!
మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి.
“పద్మాననే పద్మ ఊరు పద్మాక్షీ పద్మ సంభవే”
అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది.
పంకం నుండి పుట్టినది పద్మం కానీ ఆ చిక్లీతను (బురదను) అంటించుకోదు. సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది, అలాగే మనం కూడా పరమాత్మ వైపు మంచి విషయాలపై మాత్రమే నీకు అనురక్తి ఉండాలి అని మరొక సంకేతార్ధం.
నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలం. ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్నన్నాళ్ళే వారి దగ్గర ఉంటుంది.
విష్ణు నాభి కమలం నుండి ఉద్భవించాడు చతుర్ముఖ బ్రహ్మ, అటుపై అక్కడనుండి సృష్టి ఆవిర్భావం. ఆ బ్రహ్మతత్త్వాన్ని తెలిపే సంకేతంగా మరొక పద్మం.
అమ్మవారి రెండు కర కమలాలలో భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి. వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది. ఆవిడ రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యానతపస్సులో దర్శించి తరించారు. వాటినే మనకు అందించారు. ఆ విశేషాలు మరింత విపులంగా ఏ ఏ రూపంలో ఏమి ధరించిందో క్రింద వివరంగా ఉన్నాయి.
లక్ష్మీదేవి అనుగ్రహించే 16 రకాల సంపదలు
- 1. జ్ఞానం
- 2. తెలివి
- 3. బలం
- 4. శౌర్యం
- 5. వీరం
- 6. అందం
- 7. జయం
- 8. కీర్తి
- 9. ధృతి
- 10. నైతికత
- 11. ధనం
- 12. ధాన్యం
- 13. ఆనందం
- 14. ఆయుష్షు
- 15. ఆరోగ్యం
- 16. సంతానం
అష్టలక్ష్మి రూపాలు
ఆదినారాయణుని నిత్యానుపాయిని. ఆవిడ శ్రీమన్నారాయణునికి సేవ చేస్తున్నట్టు మహర్షులు దర్శించారు. పతికి సేవ చేస్తున్నట్టు కనబడే ఆవిడ సృష్టికి సేవ చేస్తున్నట్టు సంకేతార్ధం. ఈవిడ ఒక చేతితో పద్మం, ఒక చేతిలో తెల్లని ఝండాతో అభయ, వరద ముద్రలతో చతుర్భుజములతో అగుపిస్తుంది.
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || 1
ధనం అంటే భౌతికంగా బంగారం, డబ్బు అనిపించినా ధృతి, శౌర్యం, వ్యక్తిత్వం, ప్రతిభ, ధైర్యం ఇలా ఎన్నో అర్ధాలు వస్తాయి. ఎర్రటి వస్త్రంతో, శంఖచాక్రాలతో, కలశంతో, ధనుస్సు, పద్మాలతో, అభయ ముద్రతో షష్టభుజిగా దర్శించారు ఋషులు ఈవిడను.
అహికలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే |
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే ||
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి సదా పాలయ మామ్ || 2
ఆరోగ్యకరమైన శరీరం, మనస్సుకు కావలసిన గ్రాసం అనుగ్రహించే తల్లి. హరిత వర్ణ చీరలో, రెండు పద్మాలతో, ధాన్యంతో, చేరుకుగడతో, అరటి గెలతో, వరద అభయముద్రలతో అష్టభుజిగా దర్శించారు.
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || 3
పాలసముద్ర మధనంలో ఉద్భవించిన గజలక్ష్మి ఇంద్రుని కరుణించి, ఆర్తులకు ధనం, గౌరవం, స్థితి, అనుగ్రహం, ప్రతిష్టలను ఇచ్చి రక్షించే తల్లి. రెండు గజాలు ఈవిడకు అభిషేకం చేస్తుండగా ఎర్రటి వస్త్రంతో కమలంలో కూర్చుని రెండు కరములలో రెండు పద్మాలతో, వరద అభయ హస్తాలతో, అక్షయపాత్ర ద్వారా అక్షయమైన ధనాన్ని అనుగ్రహించే ముద్రలో దర్శించి తరించి మనకు ఆ రూపాన్ని అందించారు.
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |
రథగజతురగపదాదిసమావృత పరిజనమండిత లోకనుతే ||
హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారిణి పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || 4
ఈవిడ దయవలన మానవాళికి సత్సంతానభాగ్యం కలుగుతోంది. ఈవిడ రెండు చేతులలో కళాశాలతో, ఖడ్గం, డాలు ధరించి, అభయ ముద్రతో, ఒక చేతితో పద్మం ధరించిన ఒక పిల్లవాని ఒడిలో కూర్చోబెట్టుకుని కనబడుతుంది.
అహిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే |
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే ||
సకల సురాసుర దేవమునీశ్వర మానవవందిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి త్వం పాలయ మామ్ || 5
శౌర్యం, బలం ధైర్యం కేవలం బాహ్యంలోనే కాక కష్టాలను అధిగమించే शक्तिని అనుగ్రహించే ధైర్య లక్ష్మి తల్లి. శంఖ చక్రాలతో, ధనుస్సు, బాణం, ఖడ్గం, పాత్రలను ధరించి, అభయ వరద హస్తాలతో అష్టభుజిగా దర్శనం ఇస్తుంది ఈవిడ.