రికవరీ బాటలో ఆర్థిక వ్యవస్థ
కోవిడ్ 19 రెండో దశ ఉద్ధృతి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ మెల్లగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. లక్ష్యిత ఆర్థిక ఉపశమన చర్యలు, ద్రవ్య విధానం, వేగవంతమైన టీకాల కార్యక్రమం ఇందుకు దోహదం చేస్తున్నాయని పేర్కొంది. రూ.6.29 లక్షల కోట్లతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విస్తృత ఉద్దీపన చర్యలతో సహా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంటున్న చర్యలతో మార్కెట్ కుదుటపడుతోందని నెలవారీ ఆర్థిక సమీక్షలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్‌లతో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలో రూ.6.29 లక్షల కోట్లతో ప్రకటించిన 8 ఆర్థిక చర్యలతో, దేశ వ్యాప్తంగా వ్యక్తులు, వ్యాపారాలకు ఉపశమనం లభించిందని పేర్కొంది. ఆర్థిక చర్యలకు తోడు ఆరోగ్య రంగం, ఇతర ఎక్కువ ప్రభావితమైన రంగాలకు ప్రోత్సాహక ప్యాకేజీలు ప్రకటించడం కలిసొచ్చినట్లు వివరించింది.
0 Comments