GET MORE DETAILS

రాష్ట్రం చేతికి చిక్కని రూ.3,470 కోట్లు - ఓవర్‌డ్రాఫ్ట్‌లోకి జమ చేసుకున్న ఆర్బీఐ

 రాష్ట్రం చేతికి చిక్కని రూ.3,470 కోట్లు - ఓవర్‌డ్రాఫ్ట్‌లోకి జమ చేసుకున్న ఆర్బీఐ




అధిక వడ్డీతో తెచ్చిన అప్పు రూ.2 వేల కోట్లు


రెవెన్యూ లోటు మొత్తం రూ.1,470 కోట్లు


జీతాలు, అవసరాలు గడుస్తాయని ఆశ


పైసా ఇవ్వకుండా నీళ్లు చల్లిన రిజర్వు బ్యాంకు


ఇంకా రూ.800 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్‌లో రాష్ట్రం


అమరావతి - ఆంధ్రజ్యోతి)


బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటే... గడువులోపు కట్టేయాలి. లేదంటే... మనకు రావాల్సిన మొత్తం నుంచి పట్టేసుకుంటారు. సాధారణ వ్యక్తులకే కాదండోయ్‌... సర్కారు వారికీ ఇదే వర్తిస్తుంది. ఈ అసాధారణ పరిణామం ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు ఎదురైంది. వచ్చిన సొమ్ము వచ్చినట్లే... ఆగిపోయింది. దీంతో... వేతనాలకోసం ఉద్యోగులు, పెన్షన్ల కోసం రిటైర్డ్‌ ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడంలేదు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలకు ఇతర ఏ రాష్ట్రమూ ఇవ్వనంత వడ్డీని ఆఫర్‌ చేసి... రూ.2వేల కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు... గురువారం కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.1470 కోట్లు ఇచ్చింది. దీంతో... జీతాలు, పింఛన్ల కష్టం తీరినట్లేనని అందరూ భావించారు. కానీ... ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ) రూపంలో అసలుకే మోసం వచ్చి పడింది. ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలో తెచ్చుకున్న సొమ్మును నిర్దిష్ట గడువులోపు చెల్లించాల్సిందే. డబ్బుల కోసం ఆవురావురుమని ఎదురుచూసే సర్కారు ఓడీ చెల్లింపుల సంగతి మరిచిపోయింది. మరి... ఆర్బీఐ ఊరుకోదు కదా! సెక్యూరిటీల వేలంలో వచ్చిన రూ.2వేల కోట్లు, రెవెన్యూలోటు భర్తీకి కేంద్రం ఇచ్చిన రూ.1470 కోట్లను... అంటే మొత్తం రూ.3470 కోట్లను ఆర్బీఐ ఓడీ ఖాతాలోకి జమ చేసేసుకుంది. 

 మరి జీతాలు, పెన్షన్లు ఎలా? 

జూలైలో తొమ్మిదో తేదీ వచ్చింది! కానీ, ఇప్పటికీ పూర్తిగా ఉద్యోగులకు వేతనాలు అందలేదు. రిటైర్డ్‌ ఉద్యోగులకు గురువారం రాత్రి నుంచి  మెల్లగా పెన్షన్లు పడటం మొదలైంది. సెక్యూరిటీల వేలం ద్వారా వచ్చిన మొత్తంతో జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారని ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ఎదురు చూశారు. కానీ... ఆ 2వేల కోట్లతోపాటు కొత్తగా ఇచ్చిన రూ.1470 కోట్లనూ ఆర్బీఐ తన ఖాతాలోకి జమ చేసుకుంది. మరి... జీతాలు, పెన్షన్లకు డబ్బులు ఎలా? అంటే... మళ్లీ అప్పు తేవడం, లేదా ఓడీకి వెళ్లడమే మార్గం. అయితే... రూ.3470 కోట్లను ఓడీ కింద జమ చేసుకున్నప్పటికీ... ఇంకా రూ.800 కోట్లు చెల్లిస్తేగానీ ఓడీ నుంచి రాష్ట్రం బయటపడదు. ఏది ఏమై నా... ఓవర్‌ డ్రాఫ్ట్‌ బకాయి 80 శాతం జమ అయినందున, వేతనాలు, పెన్షన్లకు మరోసారి ఓడీకి వెళ్లవచ్చునని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కానీ, ఆర్థిక శాఖ ఆ ధైర్యం చేయలేకపోతోంది. ఓడీ రూ.1400కోట్లకు పైన తీసుకుంటే నాలుగు రోజుల్లో, అంతకంటే తక్కువ తీసుకుంటే 14 రోజుల్లో తిరిగి చెల్లించాలి. అయితే, ఇప్పటికే రూ.800 కోట్ల ఓడీలో ఉన్నారు. వేతనాలు, పెన్షన్లకు ఓడీకి వెళ్తే ఆ పరిమితి రూ.1400 కోట్లు దాటే అవకాశాలున్నాయి. అలా జరిగితే ఆ మొత్తాన్ని 4 రోజుల్లోగా చెల్లించాలి. కానీ, ఈ స్వల్పకాలం లో అంత సొమ్ము వచ్చే అవకాశం లేదని... ఓడీకి కావాల్సినన్ని డబ్బులు ఖజానాలో జమ కాకుంటే చిక్కుల్లో పడతామని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments