GET MORE DETAILS

విజయదశమి

 విజయదశమి 



విజయదశమినాడు అందరూ రావణుని బొమ్మను తగులబెడతారు. రావణుడు అహంకారానికి ప్రతీక. అహంకారానికి కేవలం ఒక ముఖమే ఉండదు, రావణుని వలె పదిముఖాలతో ఉంటుంది. అహంకారంతో విర్రవీగేవాడు తానే అందరికంటే అధికుడనని 

భావిస్తుంటాడు. తన గురించి తాను అధికంగా ఆలోచించుకునేవాడు ఇతరుల గురించి తక్కువగా పట్టించుకుంటాడు. అటువంటి వ్యక్తి సున్నితత్వాన్ని, సునిశితత్వాన్ని కోల్పోయి బండలా తయారవుతాడు. ఎవరైనా సున్నితత్వాన్ని కోల్పోతే ఆ వ్యక్తివల్ల సమాజానికి 

నష్టం చేకూరుతుంది. సమాజంలో పొందిన పదవి, సంపద, విద్యలవల్ల ఒక వ్యక్తి అహంకారిగా మారవచ్చు. ఇవేవీ లేని వ్యక్తుల్లో కూడా వ్యతిరేక ధోరణుల వల్ల, దుష్టకామముల వల్ల అహంకారం ప్రేరేపితమవుతుంది. ప్రతికూల ఆలోచనా ధోరణి కలిగిన వ్యక్తులు 

ఆగ్రహావేశ పూరితులై ఉంటారు. వారికి అవగాహనా సామర్ధ్యం ఉండదు. దీనివల్లమానసిక అసమతౌల్యం ఏర్పడి అనేక రుగ్మతలు కలుగుతాయి. అటువంటి వ్యక్తులకు ఏర్పడిన దుఃఖం, కోపం వంటివి సమాజంలో కూడా విస్తరిస్తాయి. దసరాల్లో మొదటి 

తొమ్మిదిరోజుల్లోనూ మనం శక్తిమాతను అనేక రూపాలలో కొలుస్తుంటాం. చివరిరోజు అయిన విజయదశమినాడు ఆమెను విజయానికి సంకేతంగా ఆరాధిస్తుంటాం. మనలో ఎప్పటికప్పుడు విజృంభిస్తున్న రాక్షసశక్తులపై విజయమే అది. ఆరోజున జ్ఞానాగ్నిలో వ్యతిరేక 

భావనలన్నింటినీ దగ్ధం చేయాలి. లోపలి పొరల నుంచి జ్ఞానాన్ని ఉప్పొంగనివ్వాలి. గాఢమైన ఆనందానుభూతిని మనచుట్టూ ఉన్న సమాజంతో కలిసి పంచుకోవాలి. ప్రతివారూ ఏదో ఒక సేవాకార్యక్రమంలో నిమగ్నమవ్వాలి. మనసులలో జడత్వం ఉంటే మానవుడు 

పరిపూర్ణుడు కాలేడు. దీనిని ఎదిరించడానికి ప్రతి ఒక్కరూ తమ మనసులతో, బుద్ధితో నిరంతరాయమైన పోరాటం జరుపుతూనే ఉండాలి. చివరకు మంచి మాత్రమే జయిస్తుంది. ఆసురీ శక్తి ఓడిపోతుంది.

విజయదశమి నాడు అమ్మవారిని పూజించి, విజయోత్సవం చేస్తారు. విజయదశమినాటి సూర్యాస్తమయానికి గంటన్నర ముందుకాలాన్ని విజయముహూర్తంగా నిర్ణయించారు. ఆ సమయంలో శమీవృక్షం అంటే జమ్మిచెట్టును పూజిస్తారు. జమ్మికి ‘అగ్నిగర్భ’ అని 

పేరు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని వ్యుత్పత్తి. దీనికే ‘శివా’... అంటే సర్వశుభకరమైనదని మరోపేరు కూడా ఉంది. పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపైనే దాచి ఉంచారని భారతం చెప్పే కథ. సకలకార్య జయం 

కోరుకునే వారు విజయదశమి రోజున శమీవృక్షాన్ని పూజించే సంప్రదాయం యుగాలకు పూర్వమే ఉంది.

Post a Comment

0 Comments