GET MORE DETAILS

కార్తీక పురాణం - 3 : : అథ తృతీయోధ్యాయ ప్రారంభః

కార్తీక పురాణం - 3 : : అథ తృతీయోధ్యాయ ప్రారంభః
శ్లో!! కార్తీకేమాసి రాజేంద్ర స్నానదాన జపాదికం!

లేశంవాకురుతేమర్త్యః తదక్షయ్య ఫలం స్మృతమ్!!


ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు స్నానము దానము జపము మొదలయిన పుణ్యములలో ఏదయినను స్వల్పమైనా చేసినయెడల ఆస్వల్పమే అనంతఫలప్రదమగును. స్త్రీలుగాని, పురుషులుగాని, అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీరకష్టమునకు భయపడి కార్తీకవ్రతమును జేయని యెడల నూరుమారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పున్నమిరోజున స్నానదానములు ఉపవాసమును జేయని మనుష్యుడు కోటిమారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివకు బ్రహ్మ రాక్షసుడైయుండును. ఈవిషయమందొక పూర్వకథ గలదు. చెప్పెదను వినుము.


ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదైయున్నది. గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రిఅయములను జయించివాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందాసక్తి గలవాడు. రాజా! ఆబ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకుబోవుచు గోదావరీ తీరమందు ఆకాశమునంటియున్నట్లుండు ఒక మర్రిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులనుజూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తలవెంట్రుకలు పైకి నిక్కియున్నవి. నోరు వికటముగానున్నది. శరీరము నల్లగానున్నది. ఉదరము కృశించియున్నది. నేత్రములు, గడ్డము, ముఖము ఎర్రగానున్నవి. దంతములు పొడుగుగానున్నవి. చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆరాక్షసుల భయముచేత ఆవటవృక్షమునకు ఆరుక్రోశముల దూరము లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు. ఆవట సమీపమందు పర్వతసమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలయిన జంతుజాలములయొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను జేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్త్వనిష్ఠుడు దైవవశముచేత మార్గమున పోవుచు మర్రిచెట్టుమీదనున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను జూచెను.


తత్త్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించుచు దేవేశా౧ నన్ను రక్షించుము. లోకేశా!నారాయణా!అవ్యయా!నామొర ఆలకించుము. సమస్త భయముల నశింపజేయు దేవా! నాభయమును పోగొట్టుము. నాకు నీవే దిక్కు. నీవు తప్ప నన్ను రక్షింపసమర్థులెవ్వరును లేరు. ఈప్రకారము హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరుగెత్తుచున్న బ్రాహ్మణుని జూచి బ్రహ్మ రాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతనివెంబడి పరుగెత్తసాగిరి. ఇట్లు కొంతదూరము పోగానే వెనుకకు తిరిగిన ఆబ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మ రాక్షసులకు జాతి స్మృతిగలిగినది.


ఓరాజా! తరువాత వారు ఆ బ్రహ్మణునిముందు భూమియందు దండప్రణామములాచరించి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లనిస్తుతించిరి. బ్రాహ్మణోత్తమా! మీదర్శనమువలన మేము పాపరహితులమైతిమి. మీరాక మాకు ఉపకారము కొరకయినది. అది న్యాయమే, మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుటకొరకే ఉపకారము కొరకే అగునుగదా. బ్రాహ్మణుడీమాటలను విని భయమును వదలి మంచి మనస్సుతో ఇట్లనియెను. మీరెవ్వరు. ఏకర్మచేత మీకిట్టి వికృతరూపములు గలిగినవి. లోకనిందితమైన ఏకర్మను మీరు పూర్వమందు చేసినారు. భయమును వదలి సర్వమును నాకు జెప్పుడు. తరువాత రాక్షులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలంచుకొని ఆబ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పల్కెను. అయ్యా నేను పూర్వజన్మమందు ద్రావిడదేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడను. కఠినముగా మాటలాడువాడను. ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నాకుటుంబలాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడయినను అన్నమును బెట్టియెరుగను. బ్రాహ్మణులసొమ్ము స్నేహముచేత హరించుటచేత ఏడుతరములు కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనమపహరించిన యెడల సూర్యచంద్ర నక్షత్రములుండువరకు కుటుంబము నశించును. తరువాత మృతినొంది యమ బాధలను అనేకములనొందితిని. ఆదోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమా! ఈ దోషము నశించు ఉపాయమును విచారించి క్చెప్పుము.


అందులో రెండవవాడిట్లు చెప్పెను. అయ్యా నేను ఆంధ్రదేశమందుండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేనును, నా భార్యాపిల్లలును, షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నాతల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండువాడను, బంధువులకుగాని, బ్రాహ్మణులకుగాని, ఒకనాడయినను అన్నమును పెట్టినవాడనుకాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు యెనిమిదియుగముల వకు యమబాధలనుబొంది బ్రహ్మరాక్షసుడనై భూమియందు జన్మించితిని. ఓబ్రాహ్మణోత్తమా! నాకీపాపము తొలగు ఉపాయము జెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవవాడు నమస్కరించి తనస్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా! నేను ఆంధ్రదేశ నివాసిని. బ్రాహ్మణుడను. విష్ణ్వాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలను జేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయాశూన్


యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆనేతిని వేశ్యకు యిచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి క్దానితో సంభోగించుచుండువాడను. ఆ దోషముచేత నరకములందు అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మ రాక్షసుడనై బుట్టి ఈ మర్రిమీద ఉంటిని కనుక సమస్త భూతదయాపరా బ్రాహ్మణోత్తమా! నన్ను రక్షించుపు. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము.


తత్త్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునొంది మీకు కొంచెమైనను భయములేదు. మీదుఃఖము పోగొట్టెను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను. నాతో మీరుకూడా రండి అని వారిని తీసుకొనిపోయి కావేరి నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే గూడ స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను. "అముకానాం బ్రహ్మరాక్షసత్త్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్స్నానమహం కరిష్యే" ఇట్లు సంకల్పము చేసి ఆబ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆముగ్గురు దోషవిముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు బోయిరి. ఓ జనకమహారాజా! వినుము. మోహము చేతగాని, అజ్ఞానముచేత గాని కార్తీకమాసంబున శుక్ర నక్షత్రముదయించినప్పుడు (తెల్లవారుఝామున) సూర్యోదయకాలమందు కావేరీనది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణుపూజను జేసిన వానికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీకమాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నామును తప్పక చేయవలయును. కార్తీకమాసమందు దామోదరప్రీతిగా ప్రాతస్స్నానముజేయని వాడు పదిజన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీగాని, పురుషుడుగాని కార్తీకమాసమందు ప్రాతస్స్నానము తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయపనిలేదు.


ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే తృతీయోధ్యాయస్సమాప్తః


ఓం నమః శివాయ

Post a Comment

0 Comments