GET MORE DETAILS

నీట్ టాపర్ మృణాల్ కుటీర @ 720/720

 నీట్ టాపర్ మృణాల్ కుటీర @ 720/720




అత్యంత క్లిష్టతరమైన ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలన్న లక్ష్యంతో విద్యార్థులు చాలా శ్రద్ధగా సన్నద్ధమవుతుంటారు.


ఫోన్లు,టీవీలకు దూరంగా ఉంటూ ప్రతిరోజూ 8-12 గంటలపాటు చదువుకుంటారు. ఇప్పటివరకు ఆయా పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన వారందరూ తమ ధ్యాస చదువుపై తప్ప మరేఇతర విషయంపై లేదని చెప్పుకొచ్చారు. అయితే నీట్ 2021 ఫలితాల్లో టాపర్‌గా (Neet 2021 Topper) నిలిచిన మృణాల్‌ కుటోరి మాత్రం అందరికీ భిన్నం. తెలంగాణకు చెందిన మృణాల్‌.. నిన్న విడుదల చేసిన జాతీయ వైద్యవిద్య అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)-2021 ఫలితాల్లో నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. అయితే నూటికి నూరు శాతం మార్కులు సాధించడానికి రోజుకు 12-14 గంటలు చదివారా? అని అడిగితే.. అదేం లేదు, రోజుకు నాలుగు గంటలే చదివానంటున్నాడు మృణాల్‌.
తన రెండున్నర ఏళ్ల నీట్ ప్రిపరేషన్‌లో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లలో అదేపనిగా సిట్‌కామ్‌(sitcoms)లను చూశానని మృణాల్‌ చెబుతున్నాడు. నిరుత్సాహంగా అనిపించిన సమయాల్లో ఈ సిచువేషన్ కామెడీ షోలే తనని మోటివేట్ చేశాయని చెప్పాడు. అలాగే చదువుతున్న సమయంలో ప్రతి 45 నిమిషాలకు విరామం తెలిపాడు. ప్రిపరేషన్ టైమ్ లో నిర్ణీత దినచర్యను అనుసరించిందీ లేదని చెబుతూ మరిన్ని విషయాలను న్యూస్18తో పంచుకున్నాడు.


"రోజుకు కనీసం 12 గంటలు చదువుకుంటానని చెప్పుకునే టాపర్‌ల ఇంటర్వ్యూలను చదివి నేను తెగ భయపడిపోయేవాణ్ణి. కరోనా సమయంలో నేను ఇంట్లో ఉన్నప్పుడు.. నాకు ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ అందుబాటులో ఉండేవి. ఇవన్నీ నాకు పెద్ద డిస్ట్రాక్షన్లుగా మారేవి. ప్రిపరేషన్ తొలిదశలో నేను చదువుపై కాస్త ఓపికతో దృష్టి పెట్టాల్సి వచ్చింది. కాలక్రమేణా నేను ప్రతిరోజూ దాదాపు 4 గంటల పాటు ఏకాగ్రతతో చదువుకోగలిగాను" అని మృణాల్ చెప్పాడు.


పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడే కాదు.. నీట్‌ పరీక్ష రాసే సమయంలో కూడా మృణాల్‌ తన ప్రత్యేకత చాటుకున్నాడు. చాలా మంది టాపర్‌లు మొదట బయాలజీ సెక్షన్‌ పూర్తి చేశాక మిగతా సెక్షన్‌ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు. కానీ మృణాల్ బయాలజీని చివరిలో పూర్తి చేశాడట.


"నేను మొదట ఫిజిక్స్ సెక్షన్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం ద్వారా పరీక్షను ప్రారంభించాను. నాకు ఎక్కువ సమయం దొరికినప్పుడు ఈ సెక్షన్‌ను త్వరగా పూర్తి చేయగలనని అనుకున్నాను. నేను బయాలజీ సులభమని భావించాను. పరిమిత సమయంలో కూడా దానిలో మెరుగ్గా రాణించగలను" అని మృణాల్ చెప్పుకొచ్చాడు.
నీట్ రాయబోయే విద్యార్థులకు మీరేం సలహా ఇస్తారని అడిగినప్పుడు.. "అందరికీ ఒకటే విధానం వర్క్ కాకపోవచ్చు. నేను టాపర్ ఇంటర్వ్యూలను చదివేటప్పుడు.. వారు ఏ టైమ్‌టేబుల్‌ని అనుసరిస్తారో.. వారికి ఏ రొటీన్ పని చేస్తుందో నేను కనుక్కునేవాడిని. నా ప్రిపరేషన్ సమయంలో నేను కూడా చాలా రొటీన్‌లను అనుసరించాను. కానీ నిర్ణీత రొటీన్ నాకు పని చేయదని నేను గ్రహించాను. నా తల్లిదండ్రులు గానీ ఉపాధ్యాయులు గానీ నన్ను ఎన్నడూ బలవంతం చేయలేదు. నా సొంత స్టయిల్‌లో నేను చదువుకునే విధానాన్ని వారు నిరుత్సాహ పరచలేదు. అలాంటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దొరకడం నా అదృష్టం" అని మృణాల్ తెలిపాడు.


పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ధైర్యంగా, స్వేచ్ఛగా పరీక్షలకు హాజరు కావాలని.. వారికి ఏది అనుకూలంగా అనిపిస్తుందో తెలుసుకోవాలని సూచించాడు మృణాల్. 2020లో 11వ తరగతి చదువుతున్నప్పటి నుంచి అతడు నీట్‌కు సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలోనే అతనికి వైద్య వృత్తిపై ఆసక్తి పెరిగింది. "సంక్షోభ సమయంలో వైద్యుల ప్రాముఖ్యత గురించి తెలిసింది. వాళ్లు ఇలా పనిచేయడం చూసి నేను కూడా వాళ్లలా వైద్యుడిని కావాలనుకున్నాను. ఏదో ఒకరోజు నన్ను నేను వైద్యుడిగా చూసుకుంటాను" అని మృణాల్ వివరించాడు.
18 ఏళ్ల మృణాల్ తన కుటుంబంలో మొదటి డాక్టర్ కాబోతున్నాడు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ చదవాలని ఆకాంక్షిస్తున్నాడు. ఇంతకుముందు ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష భిన్నంగా ఉండేది. అయితే ఈ ఏడాది ఎయిమ్స్‌లో ప్రవేశాలు కూడా నీట్‌ ఆధారంగానే జరగనున్నాయి. మృణాల్ వైద్య ప్రవేశ పరీక్ష నీట్ 2021లో 720కి 720 సాధించిన ముగ్గురు విద్యార్థులలో ఒకరిగా ఉన్నాడు. మృణాల్ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో 88.6% సాధించాడు.

Post a Comment

0 Comments