GET MORE DETAILS

అహోబిలమంటేనే నవనారసింహుల దివ్యక్షేత్రం. ఆ తొమిదిమంది నరసింహులెవరంటే...

అహోబిలమంటేనే నవనారసింహుల దివ్యక్షేత్రం. ఆ తొమిదిమంది నరసింహులెవరంటే...




(1) ఛత్రవట నరసింహుడు

(2) యోగ నరసింహుడు

(3) కరంజ నరసింహుడు

(4) ఊహా నరసింహుడు

(5) క్రోధ నరసింహుడు (వరహనరసింహుడు)

(6) మాలోల (నరసింహుడు)

(7)  జ్వాలా నరసింహుడు

(8) పావన నరసింహుడు 

(9) ఉగ్ర నరసింహుడు

మాలోల పేరు మొదటిసారిగా నాకు విన్నప్పుడు కొత్తగా వింతగా అనిపించింది. మాలోల, మాలకొండయ్య లాంటి పేర్లు విన్నప్పుడు ఇవో కులానికి సంబంధించిన పేర్లేమోనని అనుకొనేవాడిని. నా మిత్రుడు సహోద్యోగి ఇప్పుడు కడప డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారిగా నున్న మాలోలతో సాన్నిహిత్యం పెరిగిన తరువాత అలవాటైపోయిందనుకోండి.

మాలోల అనే పేరు నృసింహుడికి ఎలా కలిగిందో తెలుసుకొందాం.

ఒకసారి శ్రీహరి (నృసింహుడు) లక్ష్మిదేవి అనుమతితో ఒకసారి అరణ్యపర్యటనకు వెళ్ళడం జరిగింది. అడవిలో చెట్టుపుట్ట వాగువంక కొండకోనల్లో తిరుగుతున్న శ్రీవారికి అడవిపిల్ల చెంచిత ఎదురుపడుతుంది. ఒకరినొకరు ఇష్టపడటం పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొవడం జరుగుతుంది. నారదుడు పెండ్లి పెద్దగా చెంచుల ఆనందామోగ్యాలతో ఇరువురి వివాహం జరుగుతుంది. నరసింహుడు చెంచులక్ష్మి (చెంచిత) ని అహోబిలక్షేత్రానికి తీసుకువచ్చి అక్కడే కాపురం పెట్టి సుఖసంసారం చేసుకోవడం జరుగుతుంది.

అహోబిలంలో చెంచితపై  అమితఅనురాగం కురిపించి తనను విస్మరిస్తున్నాడని లక్ష్మిదేవి భావించడం జరుగుతుంది. ఈ భావనలు అసూయలు ప్రతి స్త్రీకి సహజం కదా ! దాంతో అలిగిన లక్ష్మిదేవి స్వామివారిని వదలి మారుకొండకు వెళ్ళిపోతుంది. శ్రీపతి లక్ష్మిదేవి లేని లోటును తెలుసుకొని మారుకొండకు వెళ్ళడం జరిగింది. ఆలుమగల మధ్య పొరపొచ్చాలు వరిగడ్డి మంటలాంటివి కదా! నరసింహుడు శ్రీదేవిని బుజ్జగించడం జరిగింది. అలకమానిన లక్ష్మిదేవి నరసింహునితో క్షమాపణ కోరుతుంది. దాంతో లక్ష్మిపతి లక్ష్మిదేవిని ప్రేమతో లాలించి అక్కున చేర్చుకోని తొడపై కూర్చోబెట్టుకోవడం జరిగింది.

' మా ' అంటే లక్ష్మి అని అర్థమని శబ్దరత్నాకరం చెబుతోంది. " మా భాగాయె " అని క్షేత్రయ్య తన పదకవితలలో ప్రయోగించడం జరిగింది. లోల అంటే ప్రియం, ప్రేమ, అనురాగమనే అర్థాలున్నాయి. మారుకొండలో జనార్థనడు లక్ష్మిపట్ల అమితప్రేమను కురిపించినాడు కనుకనే  మాధవుడు నాటినుండి మాలోలుడైనాడు.

ఇప్పటి అర్థంలో మాలోల అంటే అలవాటుపడ్డవాడనే అర్థముంది. ఉదా॥ వ్యసనాలకులోలుడైనాడు, వేశ్యాలోలుడు అనే మాటలు మనకు తెలుసు.  మొదట్లోవున్న అర్థానికి కాలగమన ప్రయోగంలో మరో అర్థం స్ఫూరించేలా మార్పు సంభవిస్తే దానిని అర్థవిపరిణామం అంటారు.

ఉదా॥ కంపు.కంపు అంటే వాసననేది నిజమైన అర్థం. కాని ఇప్పటి ప్రయోగంలో కంపు అంటే చెడువాసన.

అలాగే చీర, కోక.ఒకప్పుడు స్త్రీ పురుషులిద్దరు చీరలుకట్టేవారు.ఉదా॥  సీతారాములు నారచీరలు ధరించి  అడవులకు వెళ్ళారు. కుల్లాయుంచితి కోకచుట్టుతిననే శ్రీనాథుడి చాటువు కూడా విన్నాం కదా !

అలాగే స్వాహ.స్వాహ అంటే సేవించడం.కైంకర్యమంటే శిథిలదేవాలయాన్ని బాగు పరచడం.భజన చేయడం.

కాని నేటి ప్రయోగంలో స్వాహ, కైంకర్యమంటే నిధులు దుర్వినియోగం చేయడం.భజన చేయడమంటే అతిగా పొగిడి కాకా పట్టడం.

ఇక స్వామివారు చెంచితను వివాహం చేసుకోవడమనేది వైష్ణవాభివృద్ధిలో భాగమే. ఇదో కల్పన. అయితేనేమి ఆటవికులతో నాగరికులు వియ్యమందడం సంస్కరణలో భాగమే కదా! వారిని మనలో కలుపుకొని సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవడమే కదా!

ఓబులేసు, ఓబన్న అనే పేర్లు  కూడా అహోబిలశ్వరుడి నుండి ఉత్పన్నమైనవే.


ఈ వ్యాసం మాలోలకు అంకితం.

జిబి.విశ్వనాథ.గోరంట్ల. అనంతపురంజిల్లా.9441245857.

Post a Comment

0 Comments