GET MORE DETAILS

పుస్తకాల పండగ వచ్చేసింది ౼ జనవరి 1 నుంచి 11 వరకూ నిర్వహణ : స్వరాజ్య మైదానంలోనే వేడుక

 పుస్తకాల పండగ వచ్చేసింది ౼ జనవరి 1 నుంచి 11 వరకూ నిర్వహణ : స్వరాజ్య మైదానంలోనే వేడుక



 విజయవాడలో ఏటా సంక్రాంతికి ముందే వచ్చే పెద్ద పండుగ పుస్తక మహోత్సవం. గత ఏడాది కొవిడ్‌ నేపథ్యంలో పుస్తకాల మహోత్సవాన్ని నిర్వహించలేకపోయారు. దాంతో పుస్తక ప్రియులంతా చాలా నిరాశకు గురయ్యారు. ఈ ఏడాది వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. జనవరి 1 నుంచి 11 వరకు పదకొండు రోజుల పాటు 32వ విజయవాడ పుస్తక మహోత్సవం జరగబోతోంది. గత మూడు దశాబ్దాలుగా పుస్తక మహోత్సవానికి వేదికగా ఉన్న స్వరాజ్యమైదానంలోనే ఈసారి కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నిత్యం వేల సంఖ్యలో పుస్తక ప్రియులు తరలివస్తుంటారు. వేడుక ప్రారంభోత్సవానికి గవర్నర్, పలువురు మంత్రులు హాజరుకానున్నారు. 

మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8.30 వరకు..: రోజూ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తారు. పది లక్షల మంది వరకు పుస్తకప్రియులు ఏటా వచ్చి సందర్శించి వెళుతుంటారు. చాలామంది ఏడాదంతా డబ్బులు దాచుకుని మరీ వచ్చి పుస్తక మహోత్సవంలో కొనుగోలు చేస్తుంటారు. గ్రంథాలయాలకు అవసరమైన పుస్తకాలను చాలా విద్యా సంస్థలు ఏడాదికోసారి ఇక్కడే కొనుగోలు చేస్తుంటాయి.

ఈ ఏడాది 200 స్టాళ్లు : స్వరాజ్య మైదానంలో ఎల్‌ ఆకారంలో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. లోపలికి ప్రవేశించేందుకు, బయటకొచ్చేందుకు రెండు మార్గాలను ఏర్పాటు చేశారు. స్టేట్‌గెస్ట్‌ హౌస్‌ వైపు ప్రధాన మార్గం ఏర్పాటు చేస్తున్నారు. రైతుబజార్‌ వైపు రెండో మార్గం ఉంటుంది. పుస్తక ప్రియులు ఏ మార్గం నుంచి ప్రవేశించినా మొత్తం స్టాల్స్‌ అన్నీ సందర్శించి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. పుస్తక మహోత్సవంలో ఈ ఏడాది 200 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. స్టాళ్లలో కెజీ నుంచి పీజీ వరకూ పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. పిల్లలకు సంబంధించిన పుస్తకాలు అధికంగా ఉండబోతున్నాయి. భారతం, రామాయణం, భగవద్గీత, కథల పుస్తకాలు, పంచతంత్రం సహా అన్నీ ఉండబోతున్నాయి. తెలుగు, ఇంగ్లీష్‌ నవలలు, ఇంజినీరింగ్, మెడికల్‌ పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు సహా అన్ని రకాలూ అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుస్తక విక్రేతలు, ప్రచురణ కర్తలు తరలివచ్చి స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. 

పది శాతం రాయితీపై విక్రయం :

పుస్తక ప్రదర్శనలో ఉండే ప్రతి స్టాల్‌లోనూ ప్రతి పుస్తకంపైనా తప్పనిసరిగా 10శాతం రాయితీ ఇస్తున్నారు. పుస్తక మహోత్సవం నిబంధన ప్రకారం ప్రతి పుస్తకంపైనా రాయితీ ఉంటుంది. ప్రదర్శనకు వచ్చే వారందరికీ ప్రవేశం ఉచితం. ఎలాంటి రుసుము ఉండదు.

Post a Comment

0 Comments