వచ్చే ఏడాది ప్రారంభంలో థర్డ్ వేవ్ - రోజువారీ కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం : జాతీయ కొవిడ్ -19 సూపర్‌మోడల్ అంచనా
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో వచ్చే ఏడాది ప్రారంభంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని జాతీయ కొవిడ్ -19 సూపర్‌మోడల్ కమి టీ తెలిపింది. థర్డ్ వేవ్ కారణంగా దేశంలో రోజువారీ కరో నా కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతుందని చెప్పింది. దేశంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని అం చనా వేసింది. దేశంలో ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు సగటున 7,500 చొప్పున నమోదవుతున్నాయని, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పింది. వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలో థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేసింది.
💥 సెకండ్ వేవ్ కంటే స్వల్పమే :
దేశంలో ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా.. అది సెకండ్ వేవ్ కంటే స్వల్పంగానే ఉంటుందని జాతీయ కొవిడ్-19 సూపర్‌మోడల్ కమిటీ అధిపతి విద్యాసాగర్ తెలిపారు. దేశంలో చాలామంది టీకా కారణంగా రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలంగా మారిన తర్వాత దేశంలో కరోనా కేసులు పెరుగుతాయని అన్నారు. సెకండ్ వేవ్ కంటే థర్డ్‌వేవ్‌లో రోజువారీ కేసులు అత్యధిక స్థాయిలో నమోదవుతాయని చెప్పారు. సాధారణ పౌరులకు టీకాలను వేయడాన్ని ప్రభుత్వం మార్చి 1 నుంచి ప్రారంభించింది. అది డెల్టా వేరియంట్ విజృంభణ ప్రారంభమైన సమయమని అన్నారు. ఆ సమయంలో ఫ్రంట్ లైన్ కార్మికులు కాకుండా వ్యాక్సిన్ తీసుకోనివారే… కరోనా కారణంగా ఎక్కువగా ప్రభావితమయ్యారని విద్యాసాగర్ పేర్కొన్నారు. గత అనుభవం దృష్ట్యా.. వైరస్‌ను ఎదుర్కోవడానికి కావాల్సిన సామర్థ్యాలను పెంచుకున్నామని తెలిపారు.
💥 రెండు లక్షలు దాటవు :
దేశంలో కేసుల పెరుగుదల రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని విద్యాసాగర్ తెలిపారు. అందులో మొదటిది.. డెల్టా ద్వారా అందిన రోగ నిరోధక శక్తి, రెండోది.. వ్యాక్సినేషన్ ద్వారా అందిన రోగ నిరోధక శక్తి అని చెప్పారు. అయితే… ఒమిక్రాన్‌పై టీకాల ప్రభావం గురించి సరైన సమాచారం లేదని అన్నారు. థర్డ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ.. రోజువారీ కేసుల సంఖ్య 2 లక్షలను దాటదని తెలిపారు. థర్డ్‌వేవ్‌లో దేశంలో లక్ష నుంచి రెండు లక్షల రోజువారీ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్యానెల్‌లోని మరో సభ్యుడు మనీంద్ర అగర్వాల్ తెలిపారు. ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ఇప్పటికే ప్రారంభమైందని కమిటీ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించడమే అత్యంత ముఖ్యమని చెప్పింది. చికిత్స కంటే నివారణే మేలు అని పేర్కొంది.
0 Comments