GET MORE DETAILS

ఆ ఉద్యోగులను చేర్చుకొని కాలాన్ని సర్వీసులో చేర్చాలి : సుప్రీం

 ఆ ఉద్యోగులను చేర్చుకొని కాలాన్ని సర్వీసులో చేర్చాలి : సుప్రీం




ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖల నుంచి రిలీవ్‌ అయినా, తెలంగాణ చేర్చుకోకుండా ఉన్న సమయాన్ని ఉద్యోగుల సర్వీసు కాలంగానే పరిగణనలోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 10/99 నోటిఫికేషన్‌ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో నియమితులైన వివిధ శాఖల ఉద్యోగులు పదోన్నతులు, ఇతర అంశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారిలో 12 మందిని తెలంగాణకు కేటాయిస్తూ జులై 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆగస్టు 22న ఏపీ ప్రభుత్వం వారిని రిలీవ్‌ చేసింది. వారంతా ఆగస్టు 23న తెలంగాణలో వివిధ శాఖల్లో రిపోర్ట్‌ చేశారు. మూడు నెలలు గడిచినా వారికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో ఆ 12 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను గతంలో విచారించిన సుప్రీంకోర్టు ఈ అంశంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం తెలంగాణ ప్రభుత్వం వారికి పోస్టింగ్‌లు ఇచ్చింది. ఏపీ నుంచి రిలీవ్‌ అయిన తర్వాత తెలంగాణలో చేర్చుకోని సమయం, వారి జీతభత్యాల బకాయిలపై జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ రవీంద్రభట్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిల త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టి శనివారం తీర్పునిచ్చింది. ‘‘తెలంగాణ ప్రభుత్వం వారిని సర్వీసుల్లో కొనసాగించాలి. వారిని చేర్చుకోని కాలాన్ని సర్వీస్‌ బ్రేక్‌గా చూపకూడదు. ఉద్యోగ విరమణ, పింఛను ప్రయోజనాల విషయంలో దానిని సర్వీసు కాలంగానే పరిగణనలోకి తీసుకోవాలి. వారు ఏపీ నుంచి రిలీవ్‌ అయిన సమయం నుంచి తెలంగాణలో చేరే వరకు ఉన్న కాలానికి వారికి ఆగిపోయిన జీతభత్యాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ సమానంగా చెల్లించాలి. ప్రతి ఉద్యోగికి రూ.10 వేల చొప్పున చెల్లించాలి’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Post a Comment

0 Comments