GET MORE DETAILS

తెలంగాణ - ఏడు పోస్టుల్లో ఒకే ఒక్కరు _ సహాయ నుంచి అదనపు కమిషనర్‌ దాకా ఒక్కరే : ఎక్సైజ్‌ శాఖలో వైచిత్రి

తెలంగాణ - ఏడు పోస్టుల్లో ఒకే ఒక్కరు _ సహాయ నుంచి అదనపు కమిషనర్‌ దాకా ఒక్కరే : ఎక్సైజ్‌ శాఖలో వైచిత్రి




రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖలో ఏకంగా ఏడు పోస్టులు ఒకే అధికారి చేతిలో ఉన్నాయి. ఈ శాఖలో కమిషనర్‌ లేదా డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి ఉంటారు. ఆ తర్వాతి స్థానం అదనపు కమిషనర్‌దే. ఆ పోస్టులో ప్రస్తుతం అజయ్‌రావు ఉన్నారు. సహాయ నుంచి అదనపు కమిషనర్‌ దాకా ఆయన ఏడు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఇటీవల అదనపు కమిషనర్‌గా పదోన్నతి పొందారు. అంతకుముందు ఆయా స్థానాల్లో పనిచేసిన అధికారులు బదిలీ అయిన లేదా ఉద్యోగ విరమణ పొందిన సందర్భంలో జాయింట్‌ కమిషనర్‌గా ఉన్న అజయ్‌రావుకే అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆ పోస్టులన్నీ ఆయన వద్దే ఉండిపోయాయి. వాస్తవానికి ప్రధాన కార్యాలయంలో వేతనం తీసుకునే హోదాలో అజయ్‌రావుతోపాటు ఉప కమిషనర్‌ హరికిషన్‌ మాత్రమే ఉన్నారు. ఇతరులకు బాధ్యతలు అప్పగించడానికి ఇదే ప్రధాన అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్‌ శాఖలో కీలకమైన అదనపు కమిషనర్‌కు ఇతర బాధ్యతలు అప్పగించడం వల్ల శాఖాపరమైన కార్యకలాపాల్లో జాప్యానికి కారణమవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇటీవల పదోన్నతులు పొందినవారితోపాటు మరికొందరు అధికారులు ఏళ్ల తరబడిగా ఖాళీగా ఉన్నా వారికి బాధ్యతలు అప్పగించకపోవడం విడ్డూరంగా మారింది. కాగా.. అదనపు బాధ్యతల అంశంపై అజయ్‌రావును ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.

అజయ్‌రావు పోస్టులివే...

* అదనపు కమిషనర్‌

* సంయుక్త కమిషనర్‌

* ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సంచాలకుడు

* అకాడమీ సంచాలకుడు

* అకాడమీ అదనపు సంచాలకుడు

* హైదరాబాద్‌ ఉప కమిషనర్‌

* హైదరాబాద్‌ సహాయ కమిషనర్‌

Post a Comment

0 Comments