GET MORE DETAILS

రివిజన్‌ : అవే పాఠాలు... అలాగే మరోసారి...!

  రివిజన్‌ : అవే పాఠాలు... అలాగే మరోసారి...!



ప్రణాళికాయుక్తమైన సన్నద్ధత ఎంత ముఖ్యమో, చదివినదాన్ని పకడ్బందీగా పునశ్చరణ (రివిజన్‌) చేయడం కూడా అంతే ముఖ్యం. శాస్త్రీయమైన రివిజన్‌ వల్ల ఎన్నో మంచి ఫలితాలు సాధించవచ్చు!

మొత్తం అధ్యయన సమయంలో కనీసం 30 శాతం సమయాన్ని రివిజన్‌కు కేటాయించాలి. నామమాత్రపు పునశ్చరణ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు; కేవలం సమయపు వృథా తప్ప!

* ఒక సబ్జెక్టులో ఉండే అన్ని పాఠ్యాంశాల ప్రాథమిక అధ్యయనం ముగిసిన తరువాత అదే రీతిలో మళ్లీ అన్ని పాఠ్యాంశాల గంపగుత్త రివిజన్‌ ఒక పద్ధతి. ఈ తరహా విధానం చదవాల్సిన పాఠ్యాంశాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఉపయోగం.

* రివిజన్‌ వెనువెంటనే జరగాలా? ‘కాల అంతరాల (టైమ్‌ ఇంటర్వెల్స్‌) రివిజన్‌’ జరగాలా? ఇది చాలా మంది అభ్యర్థుల్లో మెదిలే ప్రశ్న.

ఒక్కసారి ప్రాథమికంగా చదివిన తర్వాత అదే విషయాన్ని రెండు మూడు సార్లు ఆలస్యం లేకుండా మళ్లీ మళ్లీ చదవటం ‘వెనువెంట రివిజన్‌’గా వ్యవహరిస్తారు. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఈ తరహా పునశ్చరణ మంచి ఫలితాలను ఇవ్వడం లేదు.

‘కాల అంతరాల రివిజన్‌’ అనేది కనీసం రెండు నుంచి మూడుసార్లు జరగాల్సి ఉంటుంది. అంటే ప్రాథమికంగా ఒకసారి చదివి కొంత కాలం గడిచాక రెండోసారీ; మరి కొంతకాలం గడిచాక మూడోసారీ మననం చేసుకోవాలి. అవసరమైతే మరి కొంతకాలం గడిచాక నాలుగో రివిజన్‌ జరగాలి. అంటే పునశ్చరణల మధ్య మరో సబ్జెక్టు గానీ, మరో చాప్టర్‌ గానీ చదవాల్సి ఉంటుంది. కొంతకాలం తరువాత రివిజన్‌ చేసినప్పుడు స్మృతి ప్రక్రియల్లో ఒకటైన జ్ఞాపకం చేసుకోవడం (రీకాల్‌) అనే ప్రక్రియ అనుసరించినట్టవుతుంది. ఫలితంగా స్మృతి, విస్మృతి శాతం (ఎంత గుర్తు ఉంది? ఎంత మర్చిపోయాం) తెలుస్తుంది. ఇలా అభ్యర్థుల్లో ఉండే లోపాలు వారికి అర్థమవుతాయి. ఫలితంగా లోప పరిష్కారం అనేది బలంగా జరుగుతుంది.

* చదవాల్సిన పాఠ్యాంశాలు/ చాప్టర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వాటన్నిటినీ పూర్తిగా చదివాక గుంపగుత్తగా రివిజన్‌ చేయటం శాస్త్రీయం కాదు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక పాఠ్యాంశం చదవటం పూర్తవగానే ఒకసారి రివిజన్‌ చేయాలి. తరువాతి చాప్టర్‌ను కూడా పాఠ్యాంశాల వారీగా చదవటం, రివిజన్‌ చేయడం అనే విధంగా పూర్తి చేయాలి. ఈ విధంగా ఒక సబ్జెక్టులోని మొత్తం చాప్టర్‌లన్నీ ఒక్కసారి రివిజన్‌ చేశాక రెండో రివిజన్‌ కూడా పాఠ్యాంశాల వారీగా పునశ్చరణ చేయటం మంచి ఫలితాలనిస్తుంది.

* మౌలికంగా చదివిన జ్ఞానాన్ని రివిజన్‌ చేయాలా? కొత్త జ్ఞానాన్ని కలుపుకుంటూ రివిజన్‌ చేయవచ్చా అనే సందేహం ఉంటుంది. నిజానికి రివిజన్‌ సమయంలో ఒకసారి చదివిన అంశాన్ని మాత్రమే మళ్లీ మళ్లీ చదవాలి. అయితే కొత్త జ్ఞానాన్ని లేదా సందర్భోచితంగా గ్రహించిన జ్ఞానాన్ని తప్పనిసరిగా అనుసంధానించడం వల్ల సమయం చాలా సద్వినియోగమవుతుంది. పరీక్షా శైలిని బట్టీ, స్థాయిని బట్టీ కొత్త జ్ఞానాన్ని కలుపుకోవాలా? లేదా అనేది

అభ్యర్థులు నిర్ణయించుకోవాలి :

* మైండ్‌ మ్యాపింగ్‌ మెలకువలు, సంకేతాలు వినియోగించటం, షార్ట్‌ కట్‌ లు మొదలైనవాటి ద్వారా పునశ్చరణ చేయడం వల్ల మెరుగైన జ్ఞాపకశక్తి సాధ్యమవుతుంది.

* వివిధ పరీక్షల్లో ఉండే అంకగణితం, లాజికల్‌ రీజనింగ్‌ లాంటి వాటిపై ఎంత పట్టు సాధించినప్పటికీ ఎప్పటికప్పుడు పేపర్‌ మీద పెట్టి సాధన చేసే పునశ్చరణ వల్ల మాత్రమే మెరుగైన ఫలితాలు వస్తాయి.

‘ఒక సబ్జెక్టులోని చాప్టర్‌కీ, చాప్టర్‌కీ మధ్య మరో సబ్జెక్టులోని చాప్టర్‌ అమర్చుకుని రివిజన్‌ చేయవచ్చా?’ అనే సందేహం చాలామందిలో కనిపిస్తుంది. అభ్యర్థుల గ్రహణ సామర్థ్యం, జ్ఞాపకశక్తి అనే అంశాల ఆధారంగా ఈ తరహా రివిజన్‌ చేయవచ్చు. సామర్థ్యాలున్న అభ్యర్థులు ఈ తరహా రివిజన్‌ చేయటంలో మానసిక ఉత్సాహం పొందుతారు. ఆటవిడుపుగానూ ఉంటుంది. సమగ్ర అవగాహన మెరుగవుతుంది. సామర్థ్యాలు తక్కువున్నవారు జ్ఞాపకశక్తిని ఏర్పరచుకోలేకపోగా, తికమకకు గురవుతారు. అందువల్ల అభ్యర్థులు తన సామర్థ్యాలను సరిగా పరిగణనలోకి తీసుకుని ఏ తరహా పునశ్చరణ మేలైనదో నిర్ణయానికి రావాలి.

‘వల్లె వేయటం’ (రిసైటేషన్‌) అనే ప్రకియ భాషా సంబంధిత విషయాలు, నిర్వచనాలు, సూత్రాలు, సంకేతాలు, ప్రాథమిక పరిజ్ఞాన అంశాలు మొదలైన వాటిలో ఉపయోగకరం. పరీక్షల నిమిత్తం ఆయా విషయాల్ని యథాతథంగా గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ టెక్నిక్‌ ప్రయోజనకరంగా ఉంటుంది.

Post a Comment

0 Comments