GET MORE DETAILS

వెలుగు చూడని జ్ఞానసంపద - సంస్కృత విశ్వవిద్యాలయం అత్యావశ్యకం

 వెలుగు చూడని జ్ఞానసంపద - సంస్కృత విశ్వవిద్యాలయం అత్యావశ్యకంప్రాచీన ఆలయాలకు నెలవైన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సంస్కృత విశ్వవిద్యాలయమూ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతిలోని ‘కేంద్రీయ సంస్కృత విద్యా పీఠమే’ సంస్కృత విశ్వవిద్యాలయంగా పేరు గడించింది. రాష్ట్రం విడిపోయాక, ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతి విశ్వవిద్యాలయం ఉండిపోగా, తెలంగాణకు ఏదీ లేకుండా పోయింది.

సంస్కృత భాషలోని పలు గ్రంథాల్లో అపారమైన జ్ఞాన సంపద నిక్షిప్తమై ఉందని, దాన్ని సమాజానికి అందించాలని చాలా మంది మేధావులు, పండితులు కోరుతున్నారు. షడ్దర్శనాల(న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస)లో, భరద్వాజుని వైమానిక శాస్త్రంలో  ఎన్నో అంశాలు నేటికీ సమాజానికి ప్రయోజనకరమైనవే. ఆర్యభట్ట, వరాహ మిహిరుడు, భాస్కరాచార్యుడు వంటి ఖగోళ, గణిత శాస్త్రజ్ఞులు రాసిన బృహత్సంహిత, లీలావతీ గణితం, ఆర్యభటీయం వంటి శాస్త్ర గ్రంథాలలోనూ సమాజానికి అవసరమైన విజ్ఞానం ఉంది. ఆయా గ్రంథాలను పరిశోధించి, ఆ ఫలితాలను మానవాళి శ్రేయస్సుకు ఉపయోగించాలనేది పలువురి అభిమతం. జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే తమ విశ్వవిద్యాలయాల్లో సంస్కృత శాస్త్రాలపై విస్తృత పరిశోధనలు జరిపిస్తూ, సనాతన భారతీయ విజ్ఞాన వైభవాన్ని అందరికీ పరిచయంచేసే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మన దేశంలో అటువంటి పరిశోధనలు ఆశించిన స్థాయిలో జరగడంలేదు. మన పూర్వ మహర్షులు అందించిన అపార విజ్ఞానం గ్రంథాలను దాటి బయటికి రావడంలేదు. పూర్వ వారసత్వంగా వచ్చిన తాళపత్రాలను శోధించే కార్యక్రమం కొంత వరకు చేపట్టినప్పటికీ, సరైన నిధులు సమకూర్చకపోవడంతో పరిశోధన కృషి ముందుకు సాగడంలేదు. ప్రభుత్వాలు తాళపత్ర పరిశోధనకు తగినన్ని నిధులు సమకూర్చి ప్రాచీన శాస్త్ర పరిజ్ఞానాన్ని నేటి తరానికి అందించాలి. ఆ రంగంలో కృషి చేసే పరిశోధకులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వారికి అవసరమైన వనరులను సమకూర్చాలి. అవన్నీ జరగాలంటే తెలంగాణలో ఒక సంస్కృత విశ్వవిద్యాలయం ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది.

మెదక్‌ జిల్లాలోని ‘కొల్చారం’ (ప్రాచీన నామం కొలిచెలమ) గ్రామంలో విశ్వవిఖ్యాత వ్యాఖ్యాత శిరోమణి మల్లినాథసూరి జన్మించాడు. ఆయన సంస్కృతంలోని రఘువంశం, కుమార సంభవం, మేఘసందేశం, కిరాతార్జునీయం, శిశుపాల వధ పంచమహాకావ్యాలకు అద్భుతంగా వ్యాఖ్యానాలు రాశాడు. అప్పటిదాకా మహాకావ్యాలకు చాలామంది వ్యాఖ్యానాలు రాసినా, అవన్నీ పాఠకులను పక్కదారి పట్టించేవిగా ఉండేవి. వాటిని క్షుణ్నంగా పరిశీలించిన మల్లినాథ సూరి మహాకవుల కావ్యాలకు ‘సంజీవనీ’ (పునరుజ్జీవింపచేసే) వ్యాఖ్యానాలను రాశాడు. పదాలకు, వాక్యాలకు ప్రామాణికమైన వ్యాఖ్యానాలను అందించడం ద్వారా ఆయన శబ్ద సాగరాల లోతులను చూసినవాడు అనే బిరుదును సంపాదించుకున్నాడు. నేటికీ మల్లినాథుడి వ్యాఖ్యానాలను చదవనిదే సంస్కృత మహాకావ్యాలు అర్థం కావు. మూలంలో కవులు ఏది చెప్పారో, దాన్నే తాను పాఠకులకు అందిస్తానని మల్లినాథ సూరి ప్రతిజ్ఞ చేశాడు. అవసరం ఉన్నచోట అవసరం ఉన్నంత మేరకే చెబుతానని, అవసరం లేని పొల్లు మాటలను అసలే చెప్పననీ అన్నాడు. అంతటి నిబద్ధతతో రాసినందువల్లనే ఆయన వ్యాఖ్యానాలను లోకమంతా ఆదరించింది. మల్లినాథ సూరి సకల శాస్త్రాలలో పారంగతుడు. వేదాలలోని రహస్యాలు తెలిసినవాడు. ఆయన వ్యాఖ్యానాలలో ఛందస్సు, వ్యాకరణం, అలంకారాలు, లోకోక్తులు, నిఘంటువులు, ఎన్నో ప్రసక్తానుప్రసక్తాలవుతాయి. ఏది చెప్పినా ప్రామాణికంగా చెప్పడం ఆయన విశిష్టత. మల్లినాథుడు తన జీవిత కాలంలో అనేక రాజాస్థానాలను దర్శించి, తన పాండిత్య ప్రతిభా పాటవాలతో ఎన్నో సత్కారాలను అందుకొన్నాడు. నేటి వరకూ సంస్కృత మహాకావ్యాలకు మల్లినాథుని వ్యాఖ్యలే శరణ్యాలుగా ఉన్నాయంటే ఆయన ప్రతిభ ఎంతటిదో గ్రహించవచ్చు. అందువల్ల సంస్కృత విశ్వవిద్యాలయానికి మల్లినాథుడి పేరు పెట్టడం ఎంతైనా సముచితం.

సంస్కృత భాషలో వేదాలు మొదలుకొని కావ్యాలదాకా విస్తరించిన అపార సాహిత్యంలో శాస్త్రీయాంశాలు కోకొల్లలు దాగిఉన్నాయి. వేదాల్లో నిక్షిప్తమైన విజ్ఞానాన్ని వెలికితీస్తే ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించవచ్చునని పలువురు పేర్కొంటున్నారు. మానవాళికి ఆరోగ్యప్రదాయకాలైన ఔషధ మొక్కలపై విస్తృతంగా పరిశోధనలు జరగాలి. వేద మంత్రాల్లో మానవ జీవనోపయోగ శాస్త్రాంశాలు పుష్కలంగా లభిస్తాయి. విజ్ఞానం, చరిత్ర, కళలు, సంస్కృతి అనే అమూల్య విషయాలకు ప్రాచీన సంస్కృత వాఙ్మయం నెలవు. అందులోని అనేక శాఖలపై విశేషంగా అధ్యయనం జరగాలి. నేటికీ నిష్ణాతులైన శాస్త్ర పండితులకు కొరత లేదు. వెలికి తీయాలనే తపనే పాలకుల్లో కొరవడుతోంది. సంస్కృతంలోని భూగర్భ, జలార్గళ, నక్షత్ర గ్రహ తారామండల, ఓషధ, ఆయుర్వేద విజ్ఞానాలపై విరివిగా పరిశోధనలు జరగాలి. అందుకోసం సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడం అత్యవసరం.

- తిగుళ్ల అరుణకుమారి

Post a Comment

0 Comments