GET MORE DETAILS

మరో గ్రంథాలయోద్యమం రావాలి _ యువతను పుస్తక పఠనంవైపు మళ్లించాలి - సంక్షిప్త సందేశాలతో భాషకు అనర్థం : హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ముగింపు సభలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

 మరో గ్రంథాలయోద్యమం రావాలి _ యువతను పుస్తక పఠనంవైపు మళ్లించాలి - సంక్షిప్త సందేశాలతో భాషకు అనర్థం : హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ముగింపు సభలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ‘‘ప్రస్తుతం పాఠశాల ఏర్పాటు చేయాలంటే గ్రంథాలయం, క్రీడా మైదానం ఉండాలనే నిబంధనను ఎవరూ పాటిస్తున్నట్లుగా లేదు. ఇది తీవ్రమైనది. రాష్ట్ర ప్రభుత్వాలే పూనుకుని ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి. గ్రామాల్లో గ్రంథాలయాలను పునరుద్ధరింపజేయాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన 34వ జాతీయ పుస్తక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘పుస్తకం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని భావిస్తున్న తరుణంలో.. ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయం. యువతీయువకులు పెద్దసంఖ్యలో వచ్చి పుస్తకాలు కొనుగోలు చేస్తుండటంతో పుస్తకం పది కాలాలపాటు సజీవంగా ఉంటుందన్న నమ్మకం కలుగుతోంది. మాక్సిమ్‌ గోర్కీ రాసిన ‘అమ్మ’, వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ పుస్తకాలను ఎన్నోసార్లు చదివా. అలాంటి పుస్తకాలు చదువుతుంటే.. ఆ కాలంలో ఉన్నామన్న అనుభూతి కలుగుతుంది. ఇటీవల హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు ప్రచురించిన మేరీటైలర్‌   ‘భారతదేశంలో నా జైలు జీవితం’ పుస్తకం కూడా అదే అనుభూతిని కలిగించింది’’ అని సీజేఐ అన్నారు.

ఉత్తరాలు రాసే సంస్కృతి రావాలి :

‘‘నేను చదువుకునే రోజుల్లో నా తండ్రి నుంచి వారానికి ఒకసారి కార్డు వచ్చేది. ఇంట్లో ఉండే సమస్యలను ఎంతో విపులంగా రాసేవారు. అది చదివితే ఆర్థిక ఇబ్బందులు అర్థమయ్యేవి. అలా లేఖలు రాసే సంస్కృతి దాదాపుగా నాశనం అయిపోయింది. ఇప్పుడు దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. సంక్షిప్త సందేశాల కారణంగా భాష, భావం అర్థం కాకుండా పోతున్నాయి. యువతరాన్ని పుస్తక పఠనం వైపు మళ్లించేందుకు తెలుగు నాట మరోమారు గ్రంథాలయ ఉద్యమం తీసుకురావాలి. నేను ఎక్కడికెళ్లినా పుస్తకాల దుకాణం కోసం చూస్తా. ఇప్పటికే వేల పుస్తకాలు సేకరించా. పదవీ విరమణ తర్వాత పుస్తకాలు చదువుకుంటూ గడుపుతాను. జనం చదువుతారన్న నమ్మకం కలిగినప్పుడు నేనూ పుస్తకం రాస్తా’’ అన్నారు.

పైరసీ కేసులపై కఠిన శిక్షలు :

‘‘ప్రస్తుతం డిజిటల్‌ పైరసీ కారణంగా పుస్తకం ముద్రణకు నోచుకోకుండానే బయటకు వెళ్లిపోతోంది. అందుకే పైరసీ కేసులు వస్తే కఠినంగా శిక్షించాలని న్యాయమూర్తులకు చెబుతున్నా..’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు వికీపీడియా స్టాల్‌ను సందర్శించి ఓ వ్యాసాన్ని ఎడిట్‌ చేశారు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి వికీపీడియన్లు చేస్తున్న కృషిని కొనియాడారు.

కోర్టు తీర్పులు తెలుగు, హిందీ భాషల్లో : 

హైకోర్టు ఇచ్చే మంచి తీర్పులను తెలుగు, హిందీ వంటి భాషల్లో అనువదించి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు సీజేను జస్టిస్‌ ఎన్‌వీ రమణ కోరారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌, జ్యుడిషియల్‌ అకాడమీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తెలుగులో తీర్పులు ఇవ్వాలని ప్రోత్సహించినట్లు గుర్తు చేశారు.రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు తీర్పులను తెలుగు సహా దేశంలోని వివిధ భాషల్లోకి అనువదించి వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామన్నారు

Post a Comment

0 Comments