GET MORE DETAILS

కొవిడ్‌పై ఉదాసీనత వద్దే వద్దు. ప్రపంచంలో నాలుగో ఉద్ధృతి : అప్రమత్తం చేసిన కేంద్రం

 కొవిడ్‌పై ఉదాసీనత వద్దే వద్దు. ప్రపంచంలో నాలుగో ఉద్ధృతి : అప్రమత్తం చేసిన కేంద్రం



ప్రపంచం కొవిడ్‌ నాలుగో ఉద్ధృతిని ఎదుర్కొంటోందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రధానంగా నూతన సంవత్సర వేడుకల వేళ.. అందరూ తప్పక జాగ్రత్తలు పాటించాలని, ఏ విషయంలోనూ ఉదాసీనతకు చోటివ్వొద్దని స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌లు శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు 6.1% ఉందని, ఈ దశలో ఉదాసీనత పనికిరాదని రాజేశ్‌ భూషణ్‌ స్పష్టం చేశారు. గత 4 వారాలుగా భారత్‌తో రోజువారీ కేసులు 10వేల లోపే నమోదవుతున్నాయని, అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, మిజోరంలలో ఇప్పటికీ ఎక్కువ కేసులు నమోదవుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేరళ, మిజోరంలలోని 20 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 5-10% మధ్య, 2 రాష్ట్రాల్లో 10% మించి ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ఒమిక్రాన్‌ బాధితులపై విశ్లేషణ :

దేశంలో ఒమిక్రాన్‌ బారినపడిన వారిలో 183 మందిని విశ్లేషించగా.. వారిలో 87 మంది పూర్తిస్థాయిలో టీకాలు పొందారని, ముగ్గురు బూస్టర్‌ డోసు కూడా తీసుకున్నారని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. ఇద్దరు ఒక డోసు మాత్రమే తీసుకోగా, ఏడుగురు టీకా తీసుకోలేదని, 16 మంది నిబంధనల ప్రకారం వ్యాక్సిన్‌కు అనర్హులుగా తేలినట్లు చెప్పారు. మొత్తంగా 70% మందిలో ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. 121 మంది విదేశాల్లో ప్రయాణించినవారు ఉన్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments