GET MORE DETAILS

తొలి అడుగుల్లో తెలుసుకోండివి : : ఇంజినీరింగ్‌ నూతన విద్యార్థులకు మెలకువలు

తొలి అడుగుల్లో తెలుసుకోండివి : : ఇంజినీరింగ్‌ నూతన విద్యార్థులకు మెలకువలు  ప్రతి విద్యార్థికీ ఇంజినీరింగ్‌ ప్రవేశం అనేది కీలక ఘట్టం. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి ఈ కోర్సులో చేరేటప్పుడు పూర్తి పరిపక్వతతో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. జీవితంలో ఎదుర్కొనబోయే అనేక సవాళ్లను పరిచయం చేసే ఈ దశ భవిష్యత్తుకు దిక్సూచి! దీనికి తగ్గ మైండ్‌సెట్‌ ఏర్పరుచుకోవాలి. స్పష్టమైన ప్రణాళికతో, వ్యూహంతో ఈ కోర్సులో అడుగులు వేస్తే అద్భుతమైన కెరియర్‌ సొంతమవుతుంది.

ఐఐటీలోనో, ఎన్‌ఐటీలోనే లేదా తను కోరుకున్న మరో కళాశాలలోనో సీటు రాలేదనే భావన చాలామందిలో ఉండొచ్చు. దానినుంచి బయటకు రావాలి. మారిన పరిస్థితుల్లో, ఇప్పటి శాస్త్ర సాంకేతిక యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. ప్రఖ్యాత విద్యాసంస్థల్లో లభించే శాస్త్రజ్ఞానం అంతా ఉచితంగా అంతర్జాలంలో లభిస్తోంది. కోరిక, పట్టుదల, క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు అనేది అప్రస్తుతం. శోధించి... సాధించాలి. ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్న వనరులు, అధ్యాపకుల బృందం మా కళాశాలలో లేరు కదా, ప్రాంగణ నియామకాలు లేవు కదా అనిపించవచ్చు.

గురువును విగ్రహంగా మలుచుకుని విలువిద్యను సాధన చేసి అసమాన ప్రావీణ్యం సంపాదించిన ఏకలవ్యుడి గాథ నుంచి ప్రేరణ పొందాలి. ప్రముఖ కంపెనీలైన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ లాంటివి అందరికీ సమాన అవకాశాలను అందిస్తున్నాయి. ఐఐటీల్లో చేరి సాధారణ ఉద్యోగం, జీవితం గడుపుతున్నవారున్నారు. సాధారణ కళాశాలలో చదివి అత్యున్నత స్థాయికి చేరి, పదిమందికి ఉపాధి కల్పించినవారూ ఉన్నారు. ప్రస్తుతం కావలసినది డిగ్రీ మాత్రమే కాదు.. పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సమస్యా పరిష్కార వ్యక్తిత్వం.

కోరుకున్న బ్రాంచిలో సీటు రాలేదా...?

అయినా నిరాశతో మథనపడాల్సిన అవసరం లేదు. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాంను గుర్తుచేసుకోండి. ఆయన తొలి ప్రాధాన్యం పైలట్‌ కావడం. కానీ, చివరికి ఆయన ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగారు! వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అంతిమంగా ఏది సాధించాలనుకుంటున్నారో దాని కోసం పోరాడాలి. కంప్యూటర్‌ సైన్స్‌ కావాలనుకున్నారు.. కానీ మెకానికల్‌లో సీటు వచ్చింది. ఎలాంటి నష్టం లేదు. గూగుల్‌ సీఈవో సుందర్‌ సిచాయ్‌ మెటలర్జికల్‌ ఇంజినీర్‌ అని తెలుసుకోవాలి. ఎక్కడలేని ధైర్యం వస్తుంది. ప్రతి బ్రాంచి విద్యార్థీ మేజర్‌గా తన సబ్జెక్టునూ, మైనర్‌గా తనకు ఇష్టమయ్యే మరో సబ్జెక్టునూ ఐచ్ఛికాల ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. ఐచ్ఛికాల ద్వారా కూడా అత్యున్నత స్థానాన్ని అందుకోవచ్చు.

లక్ష్యానికి అనుగుణంగా...

ప్రభుత్వ ఉద్యోగి కావాలంటే తను ఏమి నేర్చుకోవాలో ముందుగా తెలుసుకోవాలి. సాధన చేయాలి. ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌, జెన్‌కో, టీఎస్‌పీఎస్‌సీ/ ఏపీపీఎస్సీ లాంటి నియామకాల్లో సాంకేతికపరమైన విషయాలతోపాటు జనరల్‌ స్టడీస్‌ ప్రశ్నలు కూడా ఉంటాయి. సాంకేతిక విషయాలను ఎలాగూ చదువుకుంటారు. జనరల్‌ స్టడీస్‌లో చరిత్ర, భౌగోళిక శాస్త్రం, ఆర్థికాంశాలు, పౌరశాస్త్రం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వర్తమాన అంశాలపై ప్రశ్నలుంటాయి. వీటికి వారానికో గంట కేటాయించి, రోజూ వార్తాపత్రిక చదివితే చాలు.

సాధారణ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదివే విద్యార్థులు కొందరు తాము ఎలాగైనా ఐఐటీల్లో విద్యాభ్యాసం చేయాలని కోరుకుంటారు. వారు గేట్‌ పరీక్షలో మంచి స్కోరు సాధించి ఐఐటీల్లో పీజీ చేయొచ్చు. మంచి ఉద్యోగావకాశాలు సాధించవచ్చు.

ప్రపంచంలోని గొప్ప సీఈవోలు ఇంజినీరింగ్‌ తర్వాత అత్యున్నత బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ చేశారు. ఇలాంటి ఆలోచన ఉన్నవారు క్యాట్‌ పరీక్ష ద్వారా ఐఐఎం లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయొచ్చు.

బహుళజాతిసంస్థల్లో ఆకర్షణీయ ఉద్యోగం: గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌ లాంటి అనేక సంస్థల్లో అవకాశాలు పొందాలంటే కొన్ని సబ్జెక్టుల్లో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నిర్దేశించిన సిలబస్‌కు కొంత అదనంగా, లోతుగా సాధన చేయాల్సి ఉంటుంది. సీ, సీ++, జావా, డేటా స్ట్రక్చర్స్‌ అండ్‌ అల్గారిదమ్స్‌లో ప్రాథమిక స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి (బేసిక్‌ టు అడ్వాన్స్‌డ్‌) ప్రావీణ్యం సాధించాలి. మొదటి సంవత్సరం నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. కోడ్‌ షెఫ్‌, కోడ్‌ ఫోర్సెస్‌, లీట్‌కోడ్‌, హ్యాకర్‌ ర్యాంక్‌ లాంటి వేదికలను ఉపయోగించుకోవాలి. రోజూ కనీసం ఓ ప్రోగ్రామ్‌ని ఛేదించకుండా ఉండకూడదు. జీఎస్‌ఓసీ, ఏసీఎంఐసీపీసీ లాంటి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలి. మహిళా సాధికారత కోణంలో కొన్ని కంపెనీలు అమ్మాయిలకు మంచి ఉన్నత స్థాయి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. వీటిని అమ్మాయిలు గుర్తించి తగిన సాధన చేయాలి.

విదేశాల్లో విద్య: కొంతమంది అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి స్థిరపడాలని కోరుకుంటారు. వారు జీఆర్‌ఈ, ఐటీఎల్‌టీఎస్‌, టోఫెల్‌ లాంటి పరీక్షలు రాయటం అవసరం.

స్వయం ఉపాధి, ఆంత్రప్రెన్యూర్స్‌గా: ఇంజినీరింగ్‌ నాలుగు సంవత్సరాల్లో విద్యార్థి తన ఆలోచనలకు అనుగుణంగా ఉన్న సంస్థల్లో ఇంటర్న్‌షిప్పులు, ప్రాజెక్టులు, నాయకత్వానికి సంబంధించిన వివిధ మెలకువలను తెలుసుకోవాలి.

వ్యక్తిగత అభిరుచులు: కొంతమంది విద్యార్థులకు వివిధ కళలపై ఆసక్తి, ఉత్సుకత ఉంటాయి. కొంత శిక్షణ పొందితే వాటిలో రాణించవచ్చు.

చేయకూడని పొరపాట్లు :

1. తక్కువ మార్కులు (బ్యాడ్‌ గ్రేడ్స్‌) : 

ఈ మధ్యన కొందరు విద్యార్థులకు రెండు మూడు పేరున్న కంపెనీల్లో మంచి జీతభత్యాలతో ఉద్యోగాలు వచ్చాయి. కానీ బ్యాక్‌లాగ్స్‌ ఉండటం వల్ల వారు వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోవాల్సివచ్చింది. ఇదెంత బాధాకరం! అందుకే బ్యాక్‌లాగ్స్‌ లేకుండా ముందు నుంచీ జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కంపెనీలు బ్యాక్‌లాగ్స్‌ ఉన్నవారికి ప్లేస్‌మెంట్స్‌లో అవకాశమే కల్పించడం లేదు. భారతదేశ ఉద్యోగ కల్పన సంస్థల్లో (ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా) కనీసం 60 శాతం మార్కులు ఉండాలని నిర్దేశిస్తున్నారు. కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు 70-80 శాతం మార్కులు (7-8 సీజీపీఏ) ఉండాలంటున్నాయి. మీకు ఎన్ని నైపుణ్యాలు ఉన్నా ఈ కంపెనీలు ప్లేస్‌మెంట్‌ కోసం అవకాశాన్నివ్వవు. ఇది గుర్తుంచుకోండి. (డిగ్రీ అయిన తర్వాత సొంత కంపెనీ పెట్టుకునేవారికి ఇది అవసరం కాకపోవచ్చు. కానీ విద్యార్థికి గ్రేడ్‌ను బట్టి సమాజంలో ఎంతో కొంత విలువ ఉంటుంది). ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం నుంచే గ్రేడ్స్‌పై కొంతలో కొంత అవగాహన ఉండాలి. అంటే ‘100% మార్కులు రావాలి, పుస్తకాల పురుగులు కావాలీ’ అని కాదు. కంపెనీలకు కావలసిన నైపుణ్యాలతో పాటు కనీస అర్హతలు సాధించాలి.

2. భవిష్య లక్ష్యం లేకపోవడం :

‘ఎలాంటి లక్ష్యం లేనివాడు దమ్మిడీకి కొరగాడు’ అనేది తెలుగునాట నానుడి. ఓ విద్యార్థి ఇంజినీరింగ్‌ తర్వాత మంచి ప్రభుత్వ ఉద్యోగి ¦వాలనుకోవచ్చు. మరో విద్యార్థి భారతదేశ అత్యున్నత విద్యాసంస్థల్లో ఎంటెక్‌/ ఎంబీఏ చేయాలనుకోవచ్చు. ఇంకొకరు ప్రముఖ మల్టీ నేషనల్‌ కంపెనీల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలనుకోవచ్చు. మరొకరు విదేశాల్లో అత్యున్నత విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చేయాలనుకోవచ్చు. తన కాళ్లపై తాను నిలబడి పదిమందికీ నీడనిచ్చే సంస్థను నెలకొల్పాలని మరో విద్యార్థి కలలు కనవచ్చు. లేదా ఏదైనా ఓ కళలో నిష్ణాతుడై దానిలో తన జీవితాన్ని ఊహించుకోవచ్చు. వీటన్నిటిలో ఏదో ఒకటి విద్యార్థి లక్ష్యం కానపుడు ఈ చదువే అనవసరం.

3. చెడు సహవాసం : 

మొదట్లో ఎవరు ఏంటో ఏమీ తెలీదు. కానీ సమయం గడిచేకొద్దీ ఇతరులను అంచనా వేయొచ్చు. స్నేహితులు అని అనుకునేవారు మీ ఆలోచనలూ ఆశయాలకు గండికొట్టేలా అనిపిస్తే అలాంటివారికి వీలైనంత దూరంగా ఉండాలి. 17-18 సంవత్సరాల వయసులో విడుదలయ్యే హార్మోన్లు ప్రతికూల ఆలోచనలకూ, అలవాట్లకూ దారితీయకుండా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు తమకూ, తల్లిదండ్రులకూ, దేశానికీ అప్రతిష్ఠ కలిగించే అలవాట్ల నుంచి దూరంగా ఉండాలి. ప్రతి తోటి విద్యార్థి నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి.

Post a Comment

0 Comments