ఇంటర్నెట్ లేకున్నా UPI Payments చేయవచ్చు. ఎలాగంటే...?
స్మార్ట్‌ఫోన్ ద్వారా ఒకరి బ్యాంకు ఖాతా నుండి వేరొకరికి నగదు ఏ సమయంలోనైనా సులువుగా యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ద్వారా పంపించుకోవచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) అభివృద్ధి చేసిన భీమ్ యాప్‌తో పాటు పేటిఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటి ప్రైవేట్ యాప్‌ల నుండి కూడా యుపిఐ చెల్లింపుల సదుపాయాన్ని అందిస్తోంది. ఈ సదుపాయాన్ని పొందేందుకు ఆయా యాప్‌లను మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం కావాలి. అయితే ఫీచర్డ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ రెండింటిలోనూ ఇంటర్నెట్ సదుపాయం లేకుండా యుపిఐ చెల్లింపులు చేయొచ్చు. కానీ *99 కి డయల్ చేయడం ద్వారా ఈ సర్వీస్ మీకు లభిస్తుంది. దీనిని ఖూూణ 2.0గా కూడా పిలుస్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం *99 కి సేవ ద్వారా నగదు బదిలీ చేయడంతో పాటు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, యుపిఐ పిన్ సెట్ చేయడం, మార్చడం వంటి ఇతర సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వీస్‌ను ప్రస్తుతం 41 ప్రముఖ బ్యాంకులు, అన్ని జిఎస్‌ఎమ్ సర్వీస్ ప్రొవైడర్లు హిందీ, ఇంగ్లీషుతో కలిపి 12 భాషల్లో అందిస్తున్నాయి. ఈ సేవలకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు లావాదేవీకి రూ.0.50 నుండి గరిష్ఠంగా రూ.1.50 నామమాత్రపు ఛార్జీలను వసూలు చేస్తాయి.
రిజిస్టర్ చేసుకోవడం ఎలా?
బ్యాంకులో నమోదైన రిజిస్టర్డ్ మొబైల్ నుంచి *99కి డయల్ చేసి బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి. మీ డెబిట్‌కార్డులోని చివరి 6 అంకెలను ఎంటర్ చేయాలి. ఎక్స్‌పైరీ తేదీ, యుపిఐ పిన్ ఎంటర్ చేసి ధ్రువీకరించాలి. దీని తర్వాత మీరు ఈ సేవలను ఉపయోగించకోవచ్చు. అయితే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి డయల్ చేసినప్పుడు కచ్చితంగా మీ బ్యాంకు ఖాతా నంబర్ సహా ఇతర వివరాలు కనిపించాలి. లేదంటే ముందుకు వెళ్లకూడదు.
నగదు బదిలీ చేయడం ఎలా...?
ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి *99కి డయల్ చేయాలి. స్క్రీన్‌పై కనిపించే ఆప్షన్లలో డబ్బు పంపించడం కోసం 'సెండ్ మనీ' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఇందుకోసం 1 పై క్లిక్ చేయాలి. అనంతరం ఏ ఆప్షన్ ద్వారా డబ్బు పంపించాలో సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ అయితే 1, యుపిఐ ఐడి అయితే 3, సేవ్ చేసిన లబ్ధిదారుని కోసం 4, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ కోసం 5 క్లిక్ చేయాలి. ఉదాహరణకు మీరు మొబైల్ నంబర్ ద్వారా పంపించాలి అనుకుంటే 1ని డయల్ చేయాలి.
తర్వాత ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వారి మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. వారి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని ధ్రువీకరించుకున్న తర్వాతే ముందుకు సాగాలి. వివరాలు సరైనవైతే మీరు పంపించాలనుకుంటున్న మొత్తాన్ని డయల్ ప్యాడ్‌తో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ లావాదేవీకి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వాటిని ధ్రువీకరించుకోవాలి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే.. యుపిఐ పిన్ ఎంటర్ చేయాలి. డబ్బు బదిలీ విజయవంతంగా పూర్తైన తరువాత మొబైల్ నెంబరుకి మెసేజ్ వస్తుంది. లావాదేవీ రిఫరెన్స్ నంబర్‌ను ముందు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవాలి.
0 Comments