GET MORE DETAILS

భక్త అంబరీషుని జీవిత చరిత్ర - నేడు జనవరి 13 గురువారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా.

భక్త అంబరీషుని జీవిత చరిత్ర - నేడు జనవరి 13 గురువారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా.



పరమభాగ్యశాలియగు అంబరీషుడు సప్తద్వీపసమన్వితమగు ప్రపంచముపై శాసనమును, అక్షయమగు అనంతమైన సంపదను, పృథ్వి యందు సమృద్ధిని సాధించెను. అట్టి స్థానము దుర్లభము అయినప్పటికిని దానినతడు పట్టించుకొనలేదు. ఏలయన అట్టి ఐశ్వర్యము భౌతికమైనదని అతడెరిగి యుండెను. స్వప్నమువలె అట్టి సంపద చివరకు నశించియే తీరును. భక్తుడు కానివాడు అట్టి ఐశ్వర్యమును బడసినపుడు అధికాధికముగా తమోగుణము నందు నిమగ్నుడగునని ఆ రాజు ఎరిగియుండెను.

అంబరీషుడు దేవదేవుడగు వాసుదేవునికి, ఆతని భక్తులగు సాధు పురుషులకు పరమభక్తుడై యుండెను. ఇట్టి భక్తి కారణమున అతడు సమస్త విశ్వమును గులకరాయివలె తుచ్ఛముగా భావించెను.

స వై మనః కృష్ణపదారవిన్దయో |

ర్వచాంసి వైకుంఠగుణానువర్ణనే ॥


కరౌ హరేర్మన్దిరమార్జనాదిషు

శ్రుతిం చకారాచ్యుతసత్కథోదయే ॥


ముకున్దలిజ్జాలయదర్శనే దృశా

తద్భృత్యగాత్రస్పర్శేకఙ్గసఙ్గమమ్ |


ఘ్రాణం చ తత్పాదసరోజసౌరభే

శ్రీమత్తులస్యా రసనాం తదర్పితే ॥


పాదౌ హరేః క్షేత్రపదానుసర్పణే

శిరో హృషీకేశపదాభివన్దనే ॥


కామం చ దాస్యే న తు కామకామ్యయా

యథోత్తమశ్లోకజనాశ్రయా రతిః ॥

అంబరీషుడు మనస్సును శ్రీకృష్ణపాదారవింద ధ్యానమునందు, వాక్కులను ఆ దేవదేవుని గుణకీర్తనమునందు, కరములను హరిమందిర మార్జనము నందు, కర్ణములను శ్రీకృష్ణుడు పలికిన పలుకులను లేదా శ్రీకృష్ణుని గూర్చి పలికిన వాక్కులను వినుట యందు నియోగించెను. ఆ భాగవతుడు నేత్రములను శ్రీకృష్ణుని అర్చామూర్తిని, శ్రీకృష్ణమందిరములను, మధుర బృందావనము వంటి శ్రీకృష్ణస్థానములను దర్శించుట యందు నెలకొల్పను. అతడు స్పర్శను కృష్ణభక్తులను స్పృశించుట యందు, ఘ్రాణమును భగవదర్పితమగు తులసీదళములను ఆఘ్రాణించుట యందు, రసనమును భగవత్ప్రసాదమును ఆస్వాదించుట యందు, పాదములను హరిమందిర క్షేత్ర పర్యటనమునందు, శిరమును శ్రీహరి చెంత మ్రొక్కుట యందు, కోరికలను హృషీకేశుని సేవ యందు ఇరువదినాలుగు గంటలు నిలిపెను. నిజమునకు ఇంద్రియభోగాలకు అతడేదియును కోరలేదు. సర్వేంద్రియములను అతడు భగవత్సంబంధమగు కార్యక్రమములో నిలిపి భక్తియోగమున నెలకొనెను. కృష్ణానురక్తిని పెంపొందించుకొని భౌతికవాంఛల నుండి పూర్తిగా బయటపడుటకు ఇదియే మార్గము.

అంబరీషుని ఏకాంతభక్తికి మిగుల ప్రసన్నుడైన భగవానుడు శత్రు భీకరమైనది. శత్రువుల నుండి విపత్తుల నుండి భక్తుని రక్షించునది యగు సుదర్శనచక్రమును అతనికి ఒసగెను. శ్రీకృష్ణుని అర్చించుటకు అంబరీషుడు తనతో సమానముగా యోగ్యురాలు అగు రాణితో గూడి సంవత్సరకాలము ఏకాదశీ ద్వాదశీ వ్రతమును ఆచరించెను. సంవత్సరకాలము ఆ వ్రతమును ఆచరించిన పిమ్మట కార్తీకమాసము నందు అతడు మూడురాత్రులు ఉపవాసముండి యమునానదిలో స్నానము చేసినవాడై మధువనమున దేవదేవుడగు హరిని అర్చించెను.

మహాభిషేకవిధిని అనుసరించి అంబరీషుడు సర్వోపచారములతో శ్రీకృష్ణభగవానుని అర్చామూర్తికి అభిషేకకార్యక్రమము నొనరించెను. పిమ్మట ఉత్తమ వస్త్రములతోను, ఆభరణములతోను, సుగంధపుష్పమాలలతోను, ఇతర పూజాద్రవ్యములతోను ఆ భగవంతుని అలంకరించెను. ఆ విధముగా భక్తిశ్రద్ధలతో అతడు శ్రీకృష్ణుని, భౌతికవాంఛారహితులైన మహాభాగులగు. బ్రాహ్మణులను అర్చించెను. పిమ్మట అంబరీషుడు ఇంటికి వచ్చిన అతిథులను, ముఖ్యముగా బ్రాహ్మణులను సంతుష్టి పరచెను. బంగారు తొడుగు కలిగిన శృంగములు, రజితమండితమగు గిట్టలు కలిగిన అరువదికోట్ల గోవులను అతడు దాన మిచ్చెను. ఆ గోవులు చక్కని వస్త్రశోభితములై క్షీరభరితమగు పొదుగులను కలిగి యుండెను. సాధుస్వభావము కలిగినవి, వయస్సులో ఉన్నవి, సుందరములైనవి యగు అవి వత్సములను కలిగినవి, వయస్సులో ఉన్నవి, సుందరములైనవి యగు అవి వత్సములను గూడియుండెను. గోవులను దానమిచ్చిన పిమ్మట ఆ రాజు బ్రాహ్మణులకు తృప్తిదీరగా భోజనమిడి వారు సంతుష్టులైనంతట వారి అనుమతితో ద్వాదశి పారణమునకు ఉపక్రమించెను. కాని ఇంతలో మహాయోగి యగు దుర్వాసముని అతిథి పరంగప్రవేశము చేసెను.

అంబరీషుడు లేచి దుర్వాసమునిని ఆహ్వానించి ఆసనమును సమర్పించి పహారములచే పూజించెను. పిదప ఆ మునిపాదముల చెంత కూర్చొని అతడు భోజనము చేయుమని అర్థించెను. అంబరీషుని అభ్యర్థనను దుర్వాసుడు మహదానందముతో అంగీకరించినను నిత్యానుష్టానమును నిర్వహించుటకు యమునానదికి వెడలెను. అచట పవిత్రజలములలో మునిగినవాడై అతడు నిరాకార బ్రహ్మమును ధ్యానించెను. ఇంతలో పారణమునకు ద్వాదశీదినమున ఒక్క ముహూర్తకాలమే మిగిలెను. అందువలన వెంటనే పారణము కావించుట తప్పనిసరియయ్యెను. అట్టి సంకట పరిస్థితిలో రాజు బ్రాహ్మణులను సంప్రదించెను.

రాజు : "బ్రాహ్మణుని యెడ మర్యాదాతిక్రమము నిజంగా గొప్ప అపరాధమే. ఇంకొక ప్రక్క ద్వాదశీసమయములో పారణము చేయనిచో వ్రతపాలనమునకు భంగము వాటిల్లును. కనుక ఓ బ్రాహ్మణులారా! పారణము ఎలా చేయగలను." ఈ ప్రకారము బ్రాహ్మణులతో సంప్రదించిన పిమ్మట అంబరీషుడు తీర్థస్వీకారం పారణచేయని దోషం కలగక, అతిథిని విడవకుండా పారణచేస్తే పుణ్యం కలుగుతుందని నిశ్చయించుకొన్నాడు. ఓ కురుశ్రేష్ఠా! అంబరీషుడు మనస్సులో అచ్యుతుని ధ్యానించుచు తీర్థాన్ని స్వీకరించిన పిమ్మట దుర్వాసముని రాకకై ఎదురు చూసెను.మధ్యాహ్న సమయ అనుష్ఠానమును పూర్తి కావించుకొని దుర్వాసముని యమునానది నుండి తిరిగిరాగా రాజు అతనిని సకలోపచారములతో ఆహ్వానించెను. కాని తన అనుమతి లేకుండగనే అతడు జలపానము చేసెనని దుర్వాసుడు యోగబలముచే తెలిసికొనెను.

దుర్వాసుడు ఆకలిగొనినవాడై దేహము కంపించుచుండగా ముఖము చిట్లించుచు భృకుటి ముడివడగా, చెంతనే చేతులు జోడించి నిలిచియున్నట్టి అంబరీషునితో క్రుద్ధుడై ఇట్లు పలికెను.అహో! ఈ క్రూరుని వ్యవహారమును చూడుడు. ఇతడు విష్ణుభక్తుడు. కాడు. ఐశ్వర్యముచే, తన పదముచే ఇతడు గర్వితుడై తానే ఈశ్వరుడనని భావించుచున్నాడు. ఇతడెట్లు ధర్మమును అతిక్రమించెనో గమనింపుడు. అంబరీషా! నన్ను ఆతిథ్యమునకు పిలిచిన నీవు నాకు భోజనము పెట్టకయే తొలుత భుజించితివి. ఇట్టి నీ దుర్వ్యవహారమునకు శిక్షగా ఇప్పుడే ఫలమును చూపెదను.

దుర్వాసముని ఇట్లు పలుకుచుండగా అతని ముఖము కోపముతో ఎర్రబడెను. శిరస్సు నుండి జటను పెరికి అతడు అంబరీషుని శిక్షించుటకై కాలాగ్నిని బోలిన కృత్యను సృష్టించెను.జ్వలించుచున్న కృత్య త్రిశూలమును చేపట్టి అడుగులతో భూమిని కంపింపజేయుచు అంబరీషుని చెంతకు వెడలెను. కాని ఆ రాజు దానిని చలించక తన స్థానము నుండి కొంచెమైనను కదలలేదు. దావాగ్ని దూదిపింజను భస్మంచేసినట్లు భగవంతుని పూర్వాదేశముచే సుదర్శనచక్రము భక్తుని రక్షించుటకై వెంటనే కృత్యను దగ్ధమొనర్చెను.

తన యత్నము విఫలమగుటయు, ఆ సుదర్శనచక్రము తనవైపు వచ్చుటయు గాంచిన దుర్వాసముని మిక్కిలి భీతిల్లినవాడై ప్రాణరక్షణార్థము అన్ని దిశలలో పరుగిడసాగెను. ప్రజ్వరిల్లెడి దావాగ్నిశిఖలు సర్పమును వెంబడించునట్లుగా, భగవానుని సుదర్శనచక్రము దుర్వాసమునిని అనుసరించెను. ఆ చక్రము దాదాపుగా తన వెన్నంటి యుండుటను గాంచి అతడు సుమేరుపర్వత గుహలో ప్రవేశింపగోరి వేగముగా పరుగుదీసెను.ఆత్మరక్షణార్ధము దుర్వాసముని సర్వత్ర అన్ని దిక్కులలో పరుగిడెను. ఆకాశము, ధరిత్రి, గుహలు, సముద్రములు, ముల్లోకములు, స్వర్గము మున్నగు ప్రదేశములలో ఎచ్చటికేగినను సుదర్శన చక్రము యొక్క దుస్సహమగు తేజమే తనను వెంబడించుచున్నట్లు అతడు గాంచెను.

భీతహృదయుడగు దుర్వాసుడు ఆశ్రయమును గోరి ఎల్లెడల పరుగు దీసినను ఆశ్రయమును పొందజాలక చివరకు బ్రహ్మదేవుని జేరి అతనితో "ప్రభూ! బ్రహ్మదేవా! దేవదేవుడు ప్రయోగించిన తేజోమయమగు సుదర్శన చక్రము నుండి నన్ను రక్షింపుము" అని పలికెను. బ్రహ్మదేవుడు : ద్విపరార్ధము చివరన లీలలు ముగిసినంతట తన భ్రుకుటి కదలిక చేతనే విష్ణుభగవానుడు మా లోకములతో పాటు సమస్త విశ్వమును లయమొనర్చును, నేను, శివుడు, దక్షుడు, భృగువు మున్నగు వారము, భూతనాథులు, ప్రజాపాలకులు, సురేశ్వరులు అందరును ఆ విష్ణువునకు శరణుజొచ్చినవారమై లోకహితము కొరకు అతని ఆజ్ఞలను శిరసావహించుచున్నాము.

సుదర్శనచక్రతాపముచే మిగుల పీడితుడైన దుర్వాసుడు ఆ విధముగా బ్రహ్మచే తిరస్మృతుడై కైలాసవాసి యగు శివుని ఆశ్రయింప యత్నించెను. 

శివుడు : వత్సా! గొప్పవారమనెడి మిధ్యాభావనలో ఈ విశ్వమందే పరిభ్రమించుచుండెడి వారమగు నేను, బ్రహ్మ, ఇతర దేవతలు దేవదేవునిపై ఎట్టి పరాక్రమమును చూపజాలము. ఏలయనగా అనంతమగు విశ్వములు, వాని యందలి జీవులు ఆ దేవదేవుని నిర్దేశమాత్రమున ఉత్పన్నములు, వినష్టములు అగుచుండును. నేను (శివుడు), సనత్కుమారుడు, నారదుడు, మహనీయుడగు బ్రహ్మ, (దేవహూతి తనయుడగు) కపిలుడు, అపాంతరతముడు (వ్యాసుడు), దేవలుడు, యమరాజు, ఆనురి, మరీచి మున్నగు ఋషులు, ఇతర సిద్ధపురుషులు భూత భవిష్యత్వర్తమానముల నెరిగినవారమేయైనను భగవన్మాయచే ఆవరింపబడిన వారమై ఆ మాయ ఎంత విస్తారమైనదో ఎరుగుకున్నాము. ఈ సుదర్శన చక్రము మాకును దుస్సహమే. కనుక నీవు కేవలము విష్ణువునే ఆశ్రయింపుము. ఆ దేవదేవుని చెంతకే వెడలుము. దయామయుడగు అతడు నిశ్చయముగా నీకు శుభమును కలుగజేయును.

శివాశ్రయమును పొందుట యందును నిరాశకు లోనైన దుర్వాసముని పిమ్మట నారాయణుడు లక్ష్మీసమేతుడై వసించునట్టి వైకుంఠమునకు పోయెను. సుదర్శనచక్ర తాపముచే సంతప్తుడైన దుర్వాసముని నారాయణుని పాదపద్మముల చెంత మోకరిల్లి శరీరము కంపించుచుండగా ఆ దేవదేవునితో "ఓ అచ్యుతా! అనంతా! జగద్రక్షకా! భక్తజనాభీష్టా! ప్రభూ! నేను మహాపరాధిని, దయచేసి నన్ను రక్షింపుము" అని పలికెను.

దేవా! విధాతా! నీ అనంతశక్తిని ఎరుగక నేను నీ ప్రియతమభక్తుని యెడ అపరాధమొనర్చితిని. దయచేసి నన్ను ఈ ఘోర అపరాధము నుండి రక్షించుము. నీవు ఏదైనను చేయగల సమర్థుడవు. ఏలయనగా ఒక వ్యక్తి నరకమునకు పోవలసియున్నను హృదయములో కేవలము నీ పవిత్ర నామమును ఉద్దీపితము చేయుట ద్వారా నీవు అతనిని ఉద్ధరించగలవు. భగవానుడు "నేను పూర్తిగా నా భక్తులకు వశుడనై యున్నాను. నిజమునకు నేను అస్వతంత్రుడను. నా భక్తులు పూర్తిగా భౌతికవాంఛా రహితులు కనుక నేను వారి హృదయములలో వసింతును. నా భక్తుని మాటయేల, నా భక్తునికి భక్తులును నాకు అత్యంతప్రియమైనవారు.

బ్రాహ్మణోత్తమా! ఏ సాధకమహాత్ములకు నేనే గతియై యున్నానో అట్టి భక్తులు లేనిదే దివ్యానందమును గాని, పరమైశ్వర్యమును గాని నేను అనుభవింపగోరను. విశుద్ధభక్తులు ఇహపరముల యందును భౌతికోన్నతిని కోరక నా సేవ కొరకు తమ గృహమును, దారాపుత్రులను, బంధువులను, విత్తమును, చివరకు ప్రాణమునైనను త్యజింతురు కనుక ఎన్నడైనను వారిని నేనెట్లు విడువగలను?

పతివ్రతయగు స్త్రీ సేవద్వారా మంచివాడగు భర్తను వరము . చేసికొనినట్లుగా నమదర్శులు, హృదయమున నా యందే పూర్తిగా అనురక్తులైనవారు నగు విశుద్ధభక్తులు నన్ను వశము చేసికొందురు. నా ప్రేమభక్తిలో నెలకొని సదా సంతుష్టులై యుండెడి నా భక్తులు తాము చేసెడి సేవకు నాలుగు విధములైన ముక్తులు (సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యం) సహజముగానే లభ్యమైయున్నను వా యెడ అనురక్తులు కారు. అయినచో నశ్వరమగు స్వర్గసౌఖ్యమును. గూర్చి వేరుగా చెప్పనేల?

విశుద్ధభక్తుడు సదా నా హృదయము నందుండును, నేను సదా విశుద్ధ భక్తుని హృదయమున ఉండును. నా భక్తులు నన్ను తప్ప వేరేదియు నెరుగరు, నేను వారిని తప్ప మరియెవ్వరిని ఎరుగను.ఓ బ్రాహ్మణా! నీ రక్షణమునకై ఇప్పుడొక ఉపాయమును చెప్పుచున్నాను. వినుము. అంబరీషుని యెడ అపరాధమొనర్చి నీవు ఆత్మవైరత్వముగా వర్తించితివి. కనుక క్షణమాలస్యము చేయక వెంటనే అతని కడకు వెడలుము. నామమాత్రమగు శక్తిని భక్తునిపై ప్రయోగించినపుడు నిక్కముగా అది ప్రయోగించినవాని పైననే ప్రభావమును చూపును. ఆ విధముగా కర్తకే హాని కలుగును గాని లక్ష్యమునకు కాదు.

బ్రాహ్మణోత్తమా! కనుక నీవు శీఘ్రమే నాభాగసుతుడగు అంబరీషుని చెంతకు వెడలుము. నీకు శుభమగుగాక! ఆ మహాభాగుని ప్రసన్నుని జేసికొనినచో నీకు శాంతి కలుగుతుంది.శుకమహర్షి సుదర్శనచక్రముచే మిగుల పీడితుడైన దుర్వాసముని ఆ విధముగా విష్ణుభగవానునిచే ఆదేశితుడై వెంటనే అంబరీషుని చెంతకు వెడలి దుఃఖముతో అతని పాదపద్మములను పట్టుకొనెను.

దుర్వాసుడు పాదములపై పడినంతట అంబరీషుడు మిగుల లజ్జితుడు. అయ్యెను. ఆ ముని స్తుతింప నుద్యక్తుడగుటను గాంచినవాడై కరుణతో ఆ రాజు అతని కన్నను ఎక్కువ వ్యథచెంది వెంటనే సుదర్శనచక్రమును స్తుతింప నారంభించెను.ఓ అచ్యుతప్రియా! నీవు సహస్రారములు కలిగినవాడవు. జగత్పతీ! సర్వాస్త విధ్వంసకా! దేవదేవుని ఆదివీక్షణమా! నీకు వందనములు. దయచేసి ఈ బ్రాహ్మణునికి ఆశ్రయమొసగి శుభమును కలుగజేయుము. 

ఈ విధముగా ఆ రాజు సుదర్శనచక్రమును, విష్ణుభగవానుని స్తుతించగా. దానిచే ఆ చక్రము శాంతించి దుర్వాసుని దగ్ధము చేయుటను ఆపెను. మహాయోగియగు దుర్వాసుడు సుదర్శన చక్రాగ్నితాపము నుండి ముక్తుడై ప్రసన్నతను పొందినంతట అంబరీషుని సద్గుణములను ప్రశంసించుచు ప్రశంసించుచు గొప్పగా ఆశీర్వదించెను.

దుర్వాసముని : రాజా! భగవద్భక్తుల మాహాత్మ్యమును నేడు దర్శించితిని. ఏలయన నేను అపరాధమొనర్చినను నీవు నా శుభము కొరకే ప్రార్థించితివి.

భగవానుని పొందినవారికి అసాధ్యమైనది, త్యజింప అసంభవమైనది ఏమి యుండును?

భగవంతుని పవిత్రనామమును శ్రవణము చేసినంత మాత్రముననే మనుజుడు పవిత్రుడగుచున్నాడు.

రాజా! నా అపరాధములను ఉపేక్షించినవాడవై నీవు నా ప్రాణమును కాపాడితివి. ఈ విధముగా నీవు కరుణామయుడవగుటచే నేను మిగుల అనుగ్రహింపబడితిని.

దుర్వాసముని వెనుకకు దిరిగివచ్చునని ఎదురు చూచుచు అంబరీషుడు భోజనము చేయలేదు. అందువలన ఆ ముని అరుదెంచినంతట అతడు పాదములపై బడి ప్రసన్నునిగా జేసి భోజనమొసంగెను.

ఈ విధముగా రాజు దుర్వాసమునిని సాదరముగా ఆహ్వానించినంతట ఆ ముని ఆతిథ్యమును స్వీకరించినవాడై మిక్కిలి సంతుష్టి చెంద "నీవు కూడ భుజింపుము" అని ఆదరముతో పలికి అంబరీషుని భోజనము చేయుమని అర్థించెను.

దుర్వాసముని : రాజా! నేను నీ యెడ మిగుల ప్రసన్నుడనైతిని. తొలుత నిన్ను సాధారణ వ్యక్తిగా భావించి ఆతిథ్యమును అంగీకరించినను తరువాత నా బుద్ధిబలముచే నీవు పరమభాగవతుడవని ఎరుగగలిగితిని. అందువలన నీ దర్శనస్పర్శసంభాషణలచే మిగుల ప్రీతిచెంది అనుగృహీతుడను అయితిని.

మొదట దుర్వాసుడు వెడలినంతట అతడు తిరిగివచ్చునంతవరకు ఒక సంవత్సరకాలము అంబరీషుడు ఉపవసించి కేవలము జలమును స్వీకరించి యుండెను.

సంవత్సరము పిమ్మట దుర్వాసముని తిరిగి వచ్చినంతట అంబరీషుడు అతనికి తృప్తిగా భోజనమొసంగి పిదప తాను కూడ భుజించెను. దుర్వాసుడు దగ్ధమయ్యెడి ఘోరప్రమాదము నుండి బయటపడుటను గాంచినంతట భగవదనుగ్రహమువలన తాను కూడ శక్తిమంతుడనని అతడు తెలిసి కొనగలిగెను. కాని సర్వము భగవంతుని చేతనే చేయబడినందున ఆ మహనీయుడెట్టి ప్రతిష్టను స్వీకరింపలేదు.

ఈ ప్రకారము దివ్యగుణ శోభితుడగు అంబరీషుడు భక్తియోగము వలన బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడనెడి తత్త్వములను పూర్తిగా నెరిగి చక్కగా భక్తియుతసేవలో నెలకొనెను. తన భక్తి కారణమున అతడు ఈ భౌతికజగత్తు నందలి అత్యున్నత లోకమునైనను నరకతుల్యముగా భావించెను.

Post a Comment

0 Comments