పిల్లలకు టీకా పంపిణీలో ఆంధ్రప్రదేశ్ టాప్.
దిల్లీ: దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. దీంతో రాష్ట్రాలన్నీ చిన్నారుల వ్యాక్సిన్ పంపిణీని ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే 39.8శాతం మంది అర్హులకు వ్యాక్సిన్ అందించిన ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 37శాతం పంపిణీతో హిమాచల్ ప్రదేశ్, 30.9శాతంతో గుజరాత్ రెండు, మూడు స్థానాల్లో నిలిచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దాద్రానగర్ హవేలీలో 28.3శాతం, కర్ణాటకలో 25.3శాతం, ఉత్తరాఖండ్‌లో 22.5శాతం, మధ్యప్రదేశ్‌లో 20.6శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 20.5శాతం మంది (15 నుంచి 18ఏళ్ల) అర్హులకు కరోనా వ్యాక్సిన్ అందించాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 85లక్షల మంది పిల్లలు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.
పిల్లలకు కొవిడ్ పంపిణీలో భాగంగా ఈ వయసు వారందరికీ కొవాగ్జిన్ తొలి డోసును అందిస్తున్నారు. మరో 28 రోజుల వ్యవధి తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల వ్యాక్సినేషన్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల ఒకటో తేదీన మొదలయ్యింది. వ్యాక్సిన్ కోసం గతంలో పెద్దల కోసం కొవిన్ (CoWIN) యాప్‌లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారో.. పిల్లలకు కూడా అలాగే చేసుకోవాలి. అయితే కుటుంబ సభ్యుల ఫోన్ నంబరుతో లాగిన్ అయి నమోదు చేసుకోవచ్చు లేదా సెపరేట్‌గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉంది. లేదంటే సమీప వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు ప్రత్యేక డ్రైవ్‌ను కూడా చేపట్టాయి. అయితే వాక్-ఇన్ రిజిస్ట్రేషన్ మాత్రం ఆయా రాష్ట్రాల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 96లక్షల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 147.71 కోట్ల డోసులను అందించినట్లు తెలిపింది. వీటిలో 90శాతానికి పైగా అర్హులకు తొలిడోసు పంపిణీ చేయగా.. 65శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
0 Comments