GET MORE DETAILS

ఒమిక్రాన్‌ - తేలికపాటివ్యాధి అని చెప్పడం ప్రమాదకరం

ఒమిక్రాన్‌ - తేలికపాటివ్యాధి అని చెప్పడం ప్రమాదకరం



కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ యావత్‌ ప్రపంచానికి వణుకు పుట్టిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, ఒమిక్రాన్‌ వ్యాప్తి అత్యంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. డెల్టాతో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటం కాస్త సానుకూలాంశమే. అలా అని.. ఈ వేరియంట్‌ను తేలికపాటి వ్యాధిలా పరిగణించడం ప్రమాదకరమే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 

ఒమిక్రాన్‌ తేలికపాటి వ్యాధిలాంటిదే అంటూ వస్తోన్న కథనాలపై డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్‌ లీడ్‌ మరియా వాన్‌ కేర్ఖోవ్‌ స్పందించారు. ‘‘నిజమే.. ఒమిక్రాన్‌ వ్యాధి తీవ్రత తక్కువే. ఆసుపత్రి ముప్పు తక్కువగానే ఉంటోంది. కానీ, ఒమిక్రాన్‌ తేలికపాటి వ్యాధి కాదు. సాధారణ జలుబు లాంటిది అని చెప్పలేం. అలా చెప్పడం చాలా ప్రమాదకరం. ఒమిక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వృద్ధులు ఈ వేరియంట్‌ బారిన పడితే పరిస్థితి తీవ్రంగా ఉండొచ్చు. ఆసుపత్రులు నిండిపోవచ్చు. కేవలం మరణాల రేటు తక్కువగా ఉందని ఒమిక్రాన్‌ను సాధారణంగా పరిగణిస్తూ కథనాలు చెప్పడం అత్యంత ప్రమాదకరం’’ అని మరియా అభిప్రాయపడ్డారు. 

ఒమిక్రాన్‌ వేరియంట్‌ సహజ సిద్ధ టీకాగా పనిచేస్తోందంటూ వచ్చిన వార్తలను కూడా డబ్ల్యూహెచ్‌వో కొట్టిపారేసిన విషయం తెలిసిందే. అలాంటి ఆలోచన చాలా ప్రమాదకరమని, కొందరు బాధ్యతారహితమైన ప్రజలు ఇటువంటి వాటిని వ్యాప్తి చేస్తున్నారని డబ్ల్యూహెచ్‌వో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి ప్రజల్లో ఆత్మసంతృప్తిని పెంపొందించడమే కాకుండా వైరస్‌ కట్టడిలో నిర్లక్ష్యాన్ని మరింత పెంచుతాయని హెచ్చరించారు.

ఒమిక్రాన్‌ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. దీంతో ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలను డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం చేస్తోంది. కొవిడ్‌ సునామీ వస్తోందని హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో.. వైరస్‌ వ్యాప్తిని కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచిస్తోంది. సమూహాలు, సమావేశాల వంటి కార్యక్రమాలపై నిషేధం విధించాలని పేర్కొంది.

Post a Comment

0 Comments