GET MORE DETAILS

మంచి లక్షణాలు

 మంచి లక్షణాలు

   


✒ ఈ సృష్టి మొత్తం మనిషికి ఓ పాఠశాల. ఈ ప్రకృతిలో ప్రతి చెట్టు, ప్రతీ జీవి. ఏదైనా తన సహజ జీవన విధానంతోనే మనిషికి ఎన్నో విషయాలు బోధిస్తాయి.

 ✒ ఐకమత్యం, ప్రేమ, త్యాగం వంటి సుగుణాలన్నీ మనిషి ప్రకృతినుంచే నేర్చుకోవాలి. మనిషి ప్రకృతిలో అందాలను ఆస్వాదించడం మాత్రమే కాదు- వాటిని అధ్యయనం చేయాలి. ఆ ప్రకృతి ధర్మాలను ఆచరించాలి.

✒ పచ్చని ఆకులతో కళకళలాడే వృక్షం శిశిరంలో ఆకులు రాలుస్తుంది. వేసవిలో ఎండి మోడైపోతుంది. వసంతకాలం రాగానే ప్రతి కొమ్మా చిగురిస్తుంది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదని మంచిరోజు తప్పక వస్తుందని మానవాళికి మంచి సందేశమిస్తుంది.

✒ అంతేకాదు - వృక్షం ఎంత ఎత్తుకు ఎదిగినా ఉన్నచోటునే ఉంటూ అందరికీ ఆశ్రయం ఇస్తుంది. తన పళ్లను అందరికీ ఇచ్చి అలసిన జీవులను తన కొమ్మల నీడల్లో సేదతీరుస్తుంది.

✒ పరోపకారం, త్యాగగుణం కలిగి ఎన్నో జీవిత సత్యాలను బోధిస్తుంది వృక్షం.ఆ సత్యాలు మనిషి గ్రహించి వాటిని తన జీవితానికి అన్వయించుకోవాలి.

✒ సాగరం ఎల్లలు లేని అనంత జలరాశి. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ చూపరులకు ప్రశాంతంగా కనిపిస్తుంది. విశ్రమించని అలలు పట్టుదలతో ఒడ్డును తాకి సంకల్పబలం ఎంత గొప్పదో లోకానికి చాటిచెబుతాయి. అలాంటి స్థితప్రజ్ఞతను, సంకల్పబలాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి.

✒ రామాయణం, భారతం, భాగవతం. మన సంస్కృతిని కథల రూపంలో వివరించే ఉత్తమ గ్రంథాలు. జ్ఞానాన్ని, స్ఫూర్తిని కలిగించే ఆ గ్రంథాలను ప్రతి మనిషీ అధ్యయనం చేయాలి. వాటిలోని ధర్మాలను ఆచరించాలి.

✒ రామాయణంలో రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఆయన పావన చరిత్ర కోట్లమందికి ప్రేరణనిచ్చింది. కుమారుడిగా, సోదరుడిగా, భర్తగా. ఆదర్శవంతమైన జీవితం గడిపినందుకే రాముడు ఆదర్శపురుషుడిగా పూజనీయుడయ్యాడు.

✒ ఎవరైనా, ఎప్పుడైనా దీనుడై రక్షించమని కోరితే అతడికి శరణిచ్చి రక్షించడమే తన వ్రతమంటాడు రాముడు. ప్రతి మనిషీ ఇలాంటి ఉత్తమ లక్షణాలు అలవరచుకుంటే సర్వత్రా శాంతి వర్ధిల్లుతుంది.

✒ ఆ మనిషే అసలైన రామభక్తుడు. అసలైన భక్తికి నిలువెత్తు ప్రతీక ఆంజనేయుడు. ఆయన-సంకల్పానికి సజీవ రూపం, శక్తిసామర్థ్యాలకు నిలువెత్తు సాక్ష్యం. ఈశ్వరుడి అంశతో పుట్టిన ఆంజనేయుడు. మహావీరుడైనప్పటికీ సూర్యుడి వద్దకు వెళ్ళి విద్య నేర్పమని వినయంగా అర్థించాడు.ఏకాగ్రతతో విద్యను అభ్యసించి విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయుడయ్యాడు.

✒ ఓ యజమానిని ఎలా సేవించాలో సోదాహరణంగా చూపించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తలపెట్టిన కార్యాన్ని ఎలా సాధించాలో చేసి చూపించాడు. ఉత్తమ భక్తుడిగా, ఉత్తమ సేవకుడిగా ముల్లోకాల్లోనూ నిలిచిపోయిన ఆంజనేయుడు అందరికీ చిరస్మరణీయుడు.

✒ ఆయన ఆచరించిన సేవాధర్మాలను ప్రతి ఒక్కరూ పాటించాలి. వారే అసలైన ఆంజనేయ భక్తులు.‘ కృష్ణస్తు భగవాన్‌ స్వయం’ అని భాగవతం బోధించింది.

✒ బృందావనంలో ఆటపాటల్లో మునిగి ఉన్నప్పుడు, కురుక్షేత్రంలో రణరంగం మధ్యలో ఉన్నా, చూస్తుండగానే యదువంశం నాశనం అయిపోతున్నా- అపూర్వమైన ప్రశాంతతను, నిశ్చలత్వాన్ని ప్రదర్శించాడు శ్రీకృష్ణుడు. అలాంటి నిశ్చలత్వాన్ని ప్రతి ఒక్కరూ సాధించాలి.

✒ అనుగ్రహం కోసం భగవంతుడిని ఆరాధించడం, జ్ఞానం, ధర్మం తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించడం మాత్రమే కాదు - భగవంతుడు మెచ్చే మంచి లక్షణాలు అలవరచుకోవాలి.

  ✒ ఆయన ధర్మాన్ని అవగాహన చేసుకోవాలి. ఆయన నడిచే బాటలో నడిచే ప్రయత్నం చేయాలి. వారే నిజమైన భక్తులు.

Post a Comment

0 Comments