GET MORE DETAILS

కమిషన్‌ పరీక్షలకు వేళాయే - షెడ్యూల్‌కు ఎపిపిఎస్‌సి కసరత్తు

 కమిషన్‌ పరీక్షలకు వేళాయే - షెడ్యూల్‌కు ఎపిపిఎస్‌సి కసరత్తు



వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ల పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌పై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్‌సి) దృష్టి సారించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 1148 పోస్టుల భర్తీ కోసం 15 నోటిఫికేషన్లను ఎపిపిఎస్‌సి విడుదల చేసింది. రెవెన్యూ జూనియర్‌ అసిస్టెంట్‌, దేవదాయ ఇవో పోస్టులకు ఈ నెల 19 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అన్ని పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తరువాత పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేయాలని కమిషన్‌ భావిస్తోంది. గతంలో పంచాయితీ కార్యదర్శి, గ్రూప్స్‌, ఇతర పోస్టులకు ఒకే సమయంలో పరీక్షలను కమిషన్‌ నిర్వహించింది. అన్నింటికీ 4 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ పోస్టులకు కూడా అంతే సంఖ్యలో దరఖాస్తు చేసుకునే వీలుంది. ఒకే రకమైన పోస్టులకు 50 వేలకు లోబడి దరఖాస్తులు వస్తేనే ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని, ఆ పైన వస్తే ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని తొలుత భావించిన కమిషన్‌ పలువురు అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ పట్ల సందేహాలు వ్యక్తం చేయడంతో దరఖాస్తులు ఎన్ని వచ్చినా పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని తాజాగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు కమిషన్‌ను సిబ్బంది సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం 165 మంది ఉద్యోగులే ఉన్నారని, దీంతో పనిభారం పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో సిబ్బంది కొరత సమస్య మరింత జఠిలంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానంలో రాష్ట్రంలో రోజుకు 50 వేల మందికి మాత్రమే నిర్వహించే సామర్థ్యం కమిషన్‌కు ఉంది. మరికొన్ని ఇంజనీరింగ్‌ కళాశాలలను తీసుకుంటే 65 వేల వరకు నిర్వహించగలదు. ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని పరీక్షల నిర్వహణకు ఉపయోగించుకుంటుంటే మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదవుతున్నాయనే ఫిర్యాదులు కమిషన్‌ దృష్టికి వచ్చాయి. క్షేత్రస్థాయిలోని ఈ ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని సిబ్బంది కొరత సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Post a Comment

0 Comments