GET MORE DETAILS

హోలీ పండుగ - మీకు తెలియని ఆసక్తికర విషయాలు

హోలీ పండుగ - మీకు తెలియని ఆసక్తికర విషయాలు



కార్తీకంలో దీపారాధనకు, మాఘ మాసంలో పుణ్యస్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. ఇక, విష్ణువుకు ప్రీతికరమైన ఫాల్గుణంలో శ్రీమన్నారాయణను ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి.

● ఫాల్గుణ పౌర్ణమిని మహా ఫాల్గుని, డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. 

● ఈ రోజున లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని ఊయలలో ఉంచి జోలపడతారు. 

● కాబట్టి దీనీని డోలికా పూర్ణిమ అంటారు. కృష్ణ భగవానున్ని ఊయల్లో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్‌లో డోలికోత్సవాన్ని జరుపుకుంటారు.

● ఉత్తర భారతదేశంలో రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాధిస్తారు.

● ఆ మర్నాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు.

● పాల్గుణ పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు చందనంతో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు.

● ఇక, తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోలీ పర్వదినం ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

● చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం పాల్గుణ పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారత్‌లోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు.

 ● వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు.

 ● దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. 

● ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం.

● హిరణ్య కశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తాను దహనమవుతుంది. 

● ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుని హోలీ పండుగను నిర్వహిస్తారని కొందరంటారు.

 ● ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. 

● సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు.

 ● దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. 

● తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. 

● అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.

● శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. 

● దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. 

● కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.

● తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది.

● కారణాలు ఏవైనా రంగుల పండుగ హోలీ అంటే అందరికి ఎంతో ఉత్సాహం. 

● చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందరంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు.

Post a Comment

0 Comments