జలదానానికున్న ప్రాముఖ్యత ఏమిటి...?
సనాతనధర్మంలో జలదానానికి విశేషమైన ప్రాముఖ్యం ఉంది. ఉగాది నుంచి వర్షఋతువు వచ్చేవరకు ప్రతి హిందువు తనకు తోచినంతలో జలదానం చేయాలని శాస్త్రవచనం. అదే సంప్రదాయంలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అసలు జలదానానికున్న ప్రాముఖ్యత ఏమిటి? జలదానం చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి? దీని గురించి పురాణం ఏం చెప్తోంది.
హేమాంగ అనే ఒక మంచి మహారాజు ఉండేవాడు. ఆయన దానశీలుడు. ఎన్నో దానాలు చేశారు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అన్ని ఉన్నాయో, సాగరంలో నీటిబిందువులు ఎన్ని ఉన్నాయో అన్ని ఆవులను దానం చేశాడు. వీటితో పాటు బ్రాహ్మణులకు, పేదలకు, వికలాంగులకు కావల్సినంత బంగారం, వజ్రాలు, భూములు, ఇళ్ళు విపరీతంగా దానం చేశాడు.
ఇవి మంచివే అయినా దీనితో పాటు అతనికి ఇంకోక దోషం కూడా ఉంది. అన్ని దానాలు చేశాడు కానీ ఎవరికీ జల దానం మాత్రం చేయలేదు. దూరం నుండి వచ్చినవారికి, ఎండలో వచ్చినవారికి, దాహార్తులైనవారికి నీరు దానం చేయలేదు.
నీరు దానంగా ఇచ్చేదేమిటి? నీరు ఎవరైనా ఇస్తారు. ఎక్కడైనా దోరుకుతుంది. నేను మహారాజును, నా హోదాకు తగ్గట్లు గో, భూ, సువర్ణ దానాలు చేయాలి అనుకున్నాడు. ఇది మనకు తప్పుగా అనిపించదు కానీ, శాస్త్రం మాత్రం దీన్ని దోషంగా పరిగణిస్తుంది. దాహార్తులకు నీరు ఇవ్వకపోవడం వలన 'జాతక పక్షి' జన్మ 3 సార్లు వస్తుందని శాస్త్రం.
దానం ఇచ్చేసమయంలో అందరినీ సమానంగా చూసేవాడు. ఇక్కడ సమానంగా అంటే పాత్రులా, అపాత్రులా అన్నది పట్టించుకునేవాడు కాదు (అందరికి అన్ని దానం చేయకూడదు. ఎవరికి ఏది, ఎంత అవసరమో, అది అంత మాత్రంలోనే దానం చేయాలి). పండితులకు, మూర్ఖులకు, పేదవారికి, వికలాంగులకు అందరికి సమాన సత్కారం. మంచి పండితులకు ప్రాముఖ్యం లేదు. నిజమైన పాండిత్యం లేనివారికి, డాంబికాలు, దర్పాలు, దుష్టమైన బ్రాహ్మణులని కూడా విచారించకుండా దానం చేసేవాడు.
మహారాజు చేసే ప్రతిపని ప్రజలు గమనిస్తారు, అనుసరిస్తారు. అయోగ్యులకు సత్కారం చేస్తే ప్రజలు అతన్ని పండితుడని అనుకుంటారు. అతని తప్పుడు మాటలకు ప్రభావితం అవుతారు. అందువల్ల హేమాంగుడికి అయోగ్యులకు దానం చేయడం చేత దోషం అంటుకుంది. దుర్మార్గులకు తెలిసి దానం చేసినా, తెలియకచేసినా అది మహాపాపం.
ఈ దోషాల వలన ఇన్ని దానాలు చేసిన హేమాంగుడు పాపం అనుభవించడం కోసం కుక్క, గాడిద, పంది లాంటి ఎన్నో నీచమైన జన్మలు వచ్చి, తరువాత బల్లి జన్మ వస్తుంది. చేసిన పుణ్యం కూడా ఊరికే పోదు. అందుకే ధర్మిష్టి, నియమనిష్టలు, భగవత్భక్తి, మహాత్ములకు సేవ చేయడం వంటి సద్గుణాలు కలిగిన శ్రుతికీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుడతాడు. ఒకసారి శ్రుతికీర్తి ఇంటికి మహాజ్ఞాని, మంచి సాధకుడైన 'శత్రుదేవ' అనే బ్రాహ్మణుడు వస్తాడు.
సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించిసపర్యలు చేసి, శ్రుతికీర్తి దంపతులు శత్రుదేవ పాదాలను శ్రద్దగా కడిగి, పాదపూజ చేస్తారు. దక్షిణతాంబూలాలు ఇస్తారు. ఆ బ్రాహ్మణుని పాదాలను కడిగి, జ్ఞాన పాదోదకం రాజు తలపై చల్లుకుంటున్న సమయంలో పైన గోడమీద ఉన్న బల్లిపై కొన్ని చుక్కలు పడతాయి. ఆ జ్ఞానోదక స్పర్శతో బల్లకి పూర్వజన్మ స్మృతి వస్తుంది.
తాను హేమాంగ రాజునన్న స్పృహ వచ్చిన బల్లి శత్రుదేవను " నేను చేసిన తప్పేమిటి? అంత దానధర్మాలు చేసిన నాకు ఈ నికృష్టపు జన్మలేంటి? కారణం చెప్పమని అడుగుతాడు.
దానికి శత్రుదేవ తన తపోశక్తితో పరిశీలించి రెండు పెద్ద దోషాలు చేసినట్టు చెప్తాడు. అన్ని దానాలు చేసినా జల దానం చేయలేదని......తెలియక కాదు, శాస్త్రం తెలిసినా, నీరు దానం చేయడమేంటన్న భావంతో అవసరమున్నవారికి కూడా జలదానం చేయకపోవడం దోషమని, పాపమని చెప్తాడు.
యోగ్యతను విచారించకుండా, దుష్టులకు, దుర్మార్గులకు దానాలు చేయడం వల్ల పుణ్యం రాకపోగా, పాపం వస్తుందని అందుకే నీకు ఇలాంటి జన్మలు వచ్చాయని వివరిస్తాడు.
అప్పుడు బల్లి రూపంలో ఉన్న హేమాంగుడు పశ్చాత్తాపపడి "మరి నాకు ఉద్దారమయ్యే మార్గం, పాప పరిహారమయ్యే మార్గం ఏమిటి?" అని శత్రుదేవను అడుగుతాడు.
కరుణించిన శత్రుదేవ తన పుణ్యంలో ఒక రోజు వేంకటాచల యాత్ర, స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీ వరహాస్వామి దర్శనం, శ్రీ శ్రీనివాస దర్శనఫలం హేమంగుడికి దానం చేయగా దానితో అతని పాపప్రక్షాళన జరిగి అతనికి బల్లిశరీరం నుండి విముక్తి లభించి, సాధానశరీరం పొంది ఉద్దరింపబడ్డాడు. (ఈ కధ పి.వి.ఆర్.కే. ప్రసాదుగారి తిరుమల లీలామృతం నుంచి సేకరించడమైనది. )
మనుష్యులే కాదు, మన చుట్టూ జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు అనేకం ఉంటాయి. వాటికి ఒక్క వేసవి లోనే కాదు నిత్యం నీటి అవసరముంటుంది. కాకపోతే అవి మనలాగా నోరు తెరిచి అడగలేవు. మనమే కాస్త ఆలోచించాలి. మన ఇంటికి వచ్చినవారికి కాసిన్ని నీరైనా తప్పక ఇవ్వాలి. మన చుట్టూ ఉండే జంతువులకు, పక్షులకు, మొక్కలకు నీరు పెట్టాలి. కధలో సారాంశం అర్దం చేసుకోండి. జలదానం చేయండి, అభివృద్ధికి నోచుకోండి.*
0 Comments