రావణాసురుడిని ఓడించిన మాంధాత
రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు.. అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. అతడి పేరే మాంధాత. ఇతడు యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. చిన్నతనం నుంచే సాహసాలు చేయడం, యుద్ధాల్లో చేసే పోరాటాలను నేర్చుకునేవాడు. ఇతను ఎంతటి బలవంతుడటంటే.. 12వ ఏటలోనే రాజ్యాభిషిక్తుడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు.. అతనిని ఓడించాలని నిర్ణయించుకుంటాడు. తనకంటే మించిన బలవంతుడు మరొకరు లేరని నిరూపించడం కోసం మాంధాతో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధమవుతాడు.
రావణుడు అనుకున్నట్లుగానే అతనితో యుద్ధానికి దిగుతాడు. మాంధాత, ఇతనికి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. మాంధాతను ఎలాగైనా ఓడించాలనే కసితో తాను ముందుగానే ఏర్పరుచుకున్న పథకాలను ప్రయత్నించసాగాడు కానీ.. అతని బలం ముందు అవి ఏమాత్రం పనిచేయవు. ఎన్నిరకాలుగా ప్రయత్నించిన రావణుడు అతనిని ఓడించలేకపోయాడు. అయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండానే అతనితో అలాగే పోరాడుతాడు. చివరికి మాంధాత చేతిలో రావణుడు ఓడిపోతాడు. అప్పుడు అతని బలమెంతో తెలుసుకున్న రావణుడు.. తనని ఓడించడం కష్టమని తెలుసుకుంటాడు. అయితే.. ఇంతలోనే బ్రహ్మ, ఇంద్రుడు జోక్యంచేసుకుని… మంధాత, రావణునికీ మధ్య సంధి కుదుర్చుతారు. దాంతో ఇద్దరూ ఒక్కటవుతారు. చివరికి రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు.
0 Comments