GET MORE DETAILS

భగవంతుడికి మొక్కు చెల్లింపు..!

 భగవంతుడికి మొక్కు చెల్లింపు..!



    మానవుడు తన జీవన పయనంలో తరచూ ఏవో సమస్యల్లో చిక్కుకుంటాడు. ఆపదలు, ఆవాంతరాలు అనూహ్యంగా ఎదురవుతాయి. శక్తికి మించి తీర్చలేని సమస్యలు తిష్టవేసి కూర్చుంటాయి. అటువంటి విపత్కార పరిస్థితిలో ఆ వ్యక్తి ఏం చేయలేక కుమిలిపోతాడు. ఆ సమయంలో భగవంతుడిపైనే భారం వేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఆ ఆపద నుంచి గట్టెక్కితే దైవానికి హామీలు ఇస్తూ మొక్కుకుంటారు. నగదును గానీ, లేక ఆభరణాలుగానీ హుండీలో వేస్తామని భగవంతునికి చెప్పుకుంటారు.

నిజానికి తమ వారు ప్రాణాలతో బయటపడాలనే ఆందోళనలో.. లేదంటే ఏదైనా ఒక కఠిన సమస్యను అధిగమించాలనే కంగారులోనో కుటుంబ సభ్యుల్లో ఎవరికి తోచిన మొక్కులు వాళ్లు మొక్కేస్తుంటారు. ఇక సమస్యల నుంచి గట్టెక్కాక, వాళ్లకి అనుక్షణం మొక్కులు గుర్తుకు వస్తూనే ఉంటాయి. అయితే గండం గడిచిపోయింది కాబట్టి, మొక్కుబడులు తీరిగ్గా చెల్లించుకోవచ్చని అనుకుంటారు. ఇక తామే స్వయంగా వస్తామని అనుకున్న క్షేత్రానికి వెళ్లకుండా, అక్కడికి వెళుతోన్న బంధుమిత్రులతో ఆ మొక్కుబడులను పంపించేస్తుంటారు. తమకి వెళ్లడం కుదరడం లేదు కనుక, వారితో పంపించామని మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉంటారు.

అంతేకాదు కానుకలు హుండీలో వేయమని బంధుమిత్రులకు ఇచ్చినప్పుడు, ఒక్కోసారి వాళ్లు మరిచిపోతుంటారు. మరికొందరు ఆ సొమ్మును తమ సొంత ఖర్చులకు వాడేస్తుంటారు. ఇంకొందరమో వాటిలో ఖర్చులుపోను మిగిలినవి మాత్రమే హుండీలో సమర్పిస్తుంటారు. ఇంత జరుగుతున్నా భగవంతుడు ఎవరినీ పల్లెత్తు మాట అనడు.. శిక్షించడు. అయితే కొందరి భక్తుల అనుభవాలను పరిశీలిస్తే మాత్రం, మొక్కుబడుల విషయంలో మాట తప్పిన కారణంగా ఆ తరువాత వాళ్లు తగిన ఫలితాన్ని అనుభవించినట్టు మనకు స్పష్టమవుతోంది.

మొక్కుబడులు చెల్లించమని ఇస్తే.. ఆ సొమ్మును వాడుకుని ఆ దోష ఫలితాన్ని పొందిన వాళ్లు కూడా లేకపోలేదు. భగవంతుడు మనం మొక్కుల రూపంలో చెల్లించే సొమ్ముకు ఆశపడడు. ఆ మొక్కు చెల్లించలేదంటే తనపై విశ్వాసం లేనట్టుగా భావిస్తాడు. ఈ దోషమే మరిన్ని కష్టనష్టాలకు కారణమవుతూ ఉంటుంది. అందువలన ఏదైతే దైవానికి మొక్కుకుంటామో అది ఎలాంటి మార్పులు లేకుండా అనుకున్న సమయానికి భగవంతుడికి చెల్లించే ప్రయత్నం చేయాల్సిందే.

మొక్కుబడిగా చెల్లించమంటూ ఒకరిచ్చిన సొమ్మును సొంత ఖర్చులకు ఉపయోగించడంగానీ, ఆ సొమ్ముని హుండీలో సమర్పించకపోవడం గాని చేయకూడదు. మొక్కు చెల్లించడమంటే భగవంతుడి పట్ల భక్తిశ్రద్ధలను కనబరచడం.. ఆయన పట్ల అపారమైన విశ్వాసాన్ని ప్రకటించడమనే విషయాన్ని మరిచిపోకూడదు. అప్పుడు భగవంతుడి నుంచి మనకు శుభాలు, మన నుంచి ఆయనకు విశ్వాసం కలుగుతాయి...

Post a Comment

0 Comments