GET MORE DETAILS

దాన గుణాన్ని పెంపొందించే రంజాన్

 దాన గుణాన్ని పెంపొందించే రంజాన్



వాస్తవానికి ‘రంజాన్ పండుగ’ అసలు పేరు “ఈదుల్ ఫిత్ర్”. “ఈద్” అన్న పదానికి అర్థం పండుగ అయితే “ఫిత్ర్” అనే పదానికి- “దానం” అని అర్థం. రంజాన్ నెలలో ఉపవాసాలు నిర్దేశించటలో లక్ష్యం మనిషి వ్యక్తిత్వంలో “భయభక్తులు” జనింపజేయటంతో పాటు దానగుణాన్ని పెంపొందించటం మరొక ప్రధాన లక్ష్యం.

అందుకే రంజాన్ నెలలో ఉపవాసం ఉండే ప్రతీ ఒక్కరినీ బీదలు, అగత్యపరులను ఆదుకోవటం కోసం ‘ఫిత్రా’ అంటే గోధుమలు లేదా కొంత ధనాన్ని దానం చెయ్యమని ఆదేశించటంతో పాటు, ఆస్తిపాస్తులు కలిగి ఉండే ముస్లిములకు తమ సంపదపై కొంత శాతాన్ని తీసి తమ రక్తసంబంధికులను, బీదలను, అనాధలను, అవసరార్ధులను ఆర్థికంగా ఆదుకోటానికి ‘జకాత్’ విధానాన్ని కూడా నిర్డేశించటం జరిగింది.

మొత్తానికి రంజాన్ అంటే కేవలం ముస్లిములు ఉపవాసాలు ఉండి సేమియాలు, బిర్యానీలు పంచుకుని తినే పండుగ కాదు..
ఒకప్రక్క భయభక్తులను నేర్పుతూనే, సమాజంలో అవసరార్ధులను ఆదుకోటానికి అత్యధికంగా దానాలను చెయ్యటం నేర్పే పండుగ.

దానాల పండుగ”  :

ఈ పదం వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! దానాలు చేస్తూ పండుగను సెలబ్రేట్ చేసుకునే రోజు కూడా ఒకటుంటుందా?

ఇది వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదు!  బీదసాదల హక్కును పటిష్టంగా నెరవేర్చటానికి, దానం విధిగా చెయ్యాలన్న ప్రక్రియను ఆచరణాత్మకం (Practical) గా ముస్లిం సమాజానికి నేర్పటానికి నిర్దేశించబడిన నెలే రంజాన్.

రంజాన్ నెల వచ్చిన తరువాత ప్రవక్త ముహమ్మద్(స) గతంలో కంటే ఎక్కువగా దాతగా మారిపోయేవారు” – సహీహ్ బుఖారి 1902.

దానం విషయంలో చివరకు ఒక ఖర్జూరమైనా దానం చేసి మీరు నరకాగ్ని నుండి రక్షించుకోమని ప్రవక్త ముహమ్మద్ (స) సెలవిచ్చారు. అలాగే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ (స) - పొరుగువాడు ఆకలిగా ఉండగా తాను మాత్రం కడుపునిండా తినేవాడు అసలు విశ్వాసే కాదన్నారు.

ఏదైనా దానం చెయ్యమని ప్రవక్త ముహమ్మద్ (స) ఇంటికి వస్తే ఇంట్లో ఏమీ లేనప్పటికీ ఇంట్లో ఒకటో రెండో ఖర్జూరాలు ఉంటే చివరకు వాటిని సైతం దానం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీనిని బట్టి ఇస్లాం దానానికి ఎంత గొప్ప ప్రాముఖ్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఖురాన్ లో నమాజ్ చెయ్యమనే ఆజ్ఞ ఇవ్వబడినప్పుడల్లా దానితో పాటే “జకాత్” సైతం ఇవ్వమనే ఆజ్ఞను కొన్ని వందల సార్లు చూడగలం. “జకాత్” అన్నది ఆస్తిపాస్తులు, భూములు, డబ్బు బంగారం కలిగి ఉన్నవారు వాటిపై కొంత శాతాన్ని తీసి ఆర్థికంగా బలహీనంగా ఉండే తమ రక్తసంబంధికులు, బీదసాదలు, అగత్యపరులకు ఇవ్వాల్సిన  దానం అని అర్థం.

ఈ విధంగా దానం ప్రాముఖ్యత గురించి కేవలం మాటల్లో చెప్పటమే కాక, దానం చెయ్యటాన్ని ఆచరణాత్మకం (Practical) గా నేర్పుతూ, బీదసాదలను ఆదరించటానికి, వారి అవసరాలను తీర్చటానికి నిర్దేశించబడిన పండుగే ఈ “ఈదుల్ ఫీతర్ (దానాల పండుగ)”. “ఈదుల్ ఫితర్” రోజు ప్రతీ ముస్లిం చెయ్యాల్సింది తన సంతోషంలో బీదసాదలను, తన ఇరుగుపొరుగువారికి కూడా తన సంతోషంలో భాగస్వాములు చెయ్యటమే. 

మరీ ముఖ్యంగా రంజాన్ నెలలో ముస్లిములు చెయ్యాల్సింది- ఇఫ్తార్ విందుల్లో తమ ఇరుగుపొరుగువారిని ఆహ్వానించి రంజాన్ ప్రాముఖ్యతను, దాని లక్ష్యాన్ని వివరించాలి. వారికి ధార్మిక సందేశం అందజేయాలి.

మీరిచ్చే ‘జకాత్’ను ఇలా ఎందుకు వినియోగించకూడదు?   

జకాత్ ధనాన్ని చాలామంది నిత్యావసర వస్తువులు, వస్త్రాల రూపంలో ఇంకా మదర్శాలకు, మసీదులకు దానమిస్తుంటారు. మంచిదే. కానీ, అంతకంటే ముఖ్యంగా జకాత్ కు ప్రాథమిక హక్కుదారులు బీదరికంలో ఉంటూ ఆర్థికంగా బలహీనంగా ఉండే మీ రక్తసంబంధికులే అవుతారు.

వారు తమ ఆత్మగౌరవం కొద్ది ఇతరులను చెయ్యిచాచి సహాయం అడగలేరు. వారిని కనిపెట్టి ముందు ఆర్థికంగా ఆదుకోవాలి. వీలైతే వారు ఏదైనా వ్యాపారం చేసుకుని జీవనోపాధి సంపాదించుకొటానికి ఆర్థికంగా సహాయపడాలి. అలా చెయ్యటం వలన మీ దానం విలువే మారిపోతుంది. మరీ ముఖ్యంగా ముస్లిం సమాజం ఆర్థికంగా బలపడటానికి దోహదపడుతుంది.  

అలాగే ప్రతీ ముస్లిం తన జీవితంలో హజ్, ఉమ్రాలను ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ప్రతీ సంవత్సరం మక్కాకు వెళ్లొచ్చే ముస్లిములు కూడా కొందరుంటారు. అది కేవలం వృధా ఖర్చు మాత్రమే! ఆ ప్రయాణాలకు వెచ్చించే డబ్బును తమ రక్తసంబంధీకులను, అవసరార్ధులను ఆదుకోవటం కోసం, ముస్లిం సమాజాభివృద్ధి కోసం ఖర్చుపెట్టటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. వారికి ఎన్నో రెట్లు పుణ్యం లభిస్తుంది.    

మొత్తానికి ఒక ముస్లిం మంచి ఉద్దేశంతో ఇచ్చే ఏ దానం వల్లనైనా అతని సంపదలో శుభం కలుగుతుంది. పైగా అతని సంపద తగ్గిపోదు కూడా. ఇదే విషయం ప్రవక్త ముహమ్మద్ (స) ఈ క్రింది విధంగా తెలియజేశారు. 

దానం వలన మీ సంపద ఏ మాత్రం తగ్గిపోదు” – (సహీహ్ ముస్లిం 2588)

Post a Comment

0 Comments