GET MORE DETAILS

ఆచారం అంటే ఏమిటి ?

ఆచారం అంటే ఏమిటి ?



ఆచారం అంటే నడత. మనం ఎలా నడుచుకోవాలో తెలియజెప్పేది. ఆచార్యుడు అంటే ఆచరించి చెప్పేవాడు. పెద్దల నుంచి మనకు లభించింది సంప్రదాయం. ఈ ఆచార సాంప్రదాయకమైన జీవనం కొనసాగించిన వారికి ఇహ, పర సుఖాలు కలుగుతాయి. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అని ఆర్షవాక్కు. ధర్మబద్ధమైన జీవితం సాధించాలంటే ముందు శరీరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కట్టు, బొట్టు, స్నానం, ధ్యానం ఇవన్నీ మనల్ని శారీరకంగా శుచిగా ఉండటానికి దోహదం చేస్తాయి.

మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రధానం. సత్యాన్ని పలకడం, ధర్మాన్ని పాటించడం మనిషి తన సహజ లక్షణాలుగా చేసుకోవాలి. సత్య, ధర్మాలను పట్టుకున్నవాడిని విజయం తప్పకుండా వరిస్తుంది. శ్రీరాముడు, ధర్మరాజు వంటి పురాణ పురుషులు ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో స్వీకరించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ధర్మమార్గాన్ని వీడలేదు. అందుకే వాళ్లు భావితరాలకు ఆదర్శమూర్తులయ్యారు. ధర్మరాజు ఒకసారి భీష్ముడిని ‘ధర్మం అంటే ఏమిటి?’ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు ‘ఆచారం నుంచి ధర్మం అలవడుతుంది’ అని సమాధానమిస్తాడు. అవి సదాచారాలు అయి ఉండాలి. ఈ ఆచార, సంప్రదాయాలను పాటించడమే క్రమశిక్షణ. అటువంటి జీవన విధానం అలవర్చుకున్నప్పుడు మనసు కూడా నిష్కల్మషంగా మారుతుంది.

ఆచార, సంప్రదాయాలను పాటించడం ఎలా? మంచి నడవడిక నేర్పేది ముందుగా కుటుంబమే. అమ్మ, నాన్న, తోబుట్టువుల ప్రవర్తన మనిషిపై ప్రభావం చూపుతుంది. సమాజంలో మంచివ్యక్తిగా నిలబడాలంటే అందుకు ఇంట్లోనే చక్కటి పునాది నిర్మాణం కావాల్సి ఉంటుంది. ఒకప్పటి ఉమ్మడి కుటుంబ జీవన విధానానికి, నేటి వ్యష్టి కుటుంబ జీవన విధానానికి చాలా తేడా ఉంది. గతంలో పిల్లలకు బామ్మలు, తాతయ్యలు రామాయణ, మహాభారత కథలు చెబుతూ బాల్యంలోనే సత్యం, ధర్మం తదితర విషయాలను బోధించేవారు. నైతిక విలువలు నేర్పేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడం రానున్న తరాల వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

భారతావని అదృష్టం అద్భుతమైన పురాణ వాఙ్మయం కలిగి ఉండటం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవి మనకు కుటుంబ జీవన విధానాన్ని, సంప్రదాయాలను, సామాజిక కట్టుబాట్లను, ఆధ్యాత్మికత అవసరాన్ని తెలియజేస్తాయి. రాముడి చరిత్ర సత్యవాక్కు విశిష్ఠతను తెలియజేస్తుంది. సహనం ప్రాధాన్యాన్ని ధర్మరాజు జీవనం తెలుపుతుంది. దానగుణం గొప్పదనాన్ని శిబి కథ చెబుతుంది, సంకల్పబలం ఎంత గొప్పదో ఏకలవ్యుడి జీవితం చెబుతుంది. ఇలా మన పురాణాల్లోని అనేక గాథలు సామాజికంగా ఎలా మసలుకోవాలో చెబుతాయి. వాటిని తెలుసుకోగలిగితే విలువలతో కూడిన సమాజం తయారవుతుంది.

మనిషికి నిజంగా ఆనందాన్ని ఇచ్చేవి ఏవి? భోగభాగ్యాలు, కీర్తిప్రతిష్ఠలు, విలాసవంతమైన జీవితం ఎన్ని ఉన్నా ఇవన్నీ మనిషిని సంతోషపెడతాయా అంటే చెప్పలేం. కానీ, ఆత్మసంతృప్తిని మించిన సంతోషం మరొకటి లేదు. ఆ సంతృప్తి మన నడవడికతోనే లభిస్తుంది. విలాసాలు, సంపదే ఆనందానికి మూలం అనుకుంటే.. మనకంటే తక్కువ సౌకర్యాలు, తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ముందుతరాల మనకంటే ఎందుకు ఎక్కువ ఆనందంగా జీవించారో సమీక్షించుకుంటే సమాధానం తెలిసిపోతుంది. సదాచారాలు, సంప్రదాయాలు వారి జీవన విధానంలో భాగంగా ఉండేవి. అందుకే వాళ్లు సంతృప్తిగా బతకగలిగారు. మన ఆచారాలు మూఢ విశ్వాసాలు కావు. వాటిలో పారమార్థిక భక్తి, ఆరోగ్య, వైద్య, వైజ్ఞానిక అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గుర్తించి, ఆచరించగలిగితే మనిషి మంచి పౌరుడిగా మారుతాడు.

Post a Comment

0 Comments