GET MORE DETAILS

దేవుడి గుడికి వచ్చిన తరువాత కాస్సేపు కూర్చుని వెళ్లాలని అంటారు. ఎందుకు ?

 దేవుడి గుడికి వచ్చిన తరువాత కాస్సేపు కూర్చుని వెళ్లాలని అంటారు. ఎందుకు ?

                  


దేవుడి గుడికి వచ్చిన తరువాత కాస్సేపు కూర్చుని వెళ్లాలని అంటారు. దాదాపు అందరూ పాటిస్తారు. కొందరు సమయం లేకుంటే, ఇలా కూర్చున్నట్లే కూర్చుని లేచి చక్కాపోతారు. దీని గురించి స్పష్టంగా చెబితేనన్నా కూర్చుంటారేమో ?

గుళ్లన్నీ చాలా వరకు కొండపై వుంటాయి. కాకుంటే కాసిన్ని అయినా మెట్లుంటాయి. పైగా లో​ప​లకు వచ్చా​క  గుడిచుట్టూ మూడో, అంతకు పైగానో ప్రదిక్షణలు. ఇవన్నీ అవగానే మళ్లీ వెంటనే మెట్లు దిగడం అంటే అంత మంచిది కాదు. పైగా కొండపైన అంటే ఆక్సిజన్ అంతగా అందదు. అందుకే గుడిపైకి వచ్చి, ప్రదక్షిణలు, దర్శనం చేసాక కాస్సేపు కూర్చోమన్నది. ఎందుకు? కాస్త సేద తీరడానికి. అలుపు తగ్గి గుండె స్పందించే వేగం మళ్లీ మామూలు స్థితికి రావడానికి. ఆపైన మళ్లీ మన ప్రయాణం మనదే. కానీ ఎందుకు కూర్చోవాలో చెప్పకుండా, కూర్చోవాలంతే, అంటూ లాజిక్ లేని కబుర్లు చెబితే కొంత కాలం కాకుంటే, మరికొంత కాలం తరువాత అయినా మటుమాయం అయిపోతాయి.

ఇటీవల గర్భగుడిలో కూడా కొన్ని చోట్ల ప్ర​దక్షిణలు చేయించేస్తున్నారు. పాపం అంతంత మాత్రం తెలిసిన పురోహితులు. నిజానికి గుడిచుట్టూ ప్రదక్షిణ చేసినా, మన వెనుక భాగం దేవుడి వైపు తిరగదు. కానీ గర్భగుడిలో అలా చేయడం సబబు కాదు. అందుకే గర్భగుడిలో ప్రదక్షిణ నిషేధం. 

అదే విధంగా గుడిలో భగవంతుడికి అభిముఖంగా సాష్టాంగం పడడం కూడా తప్పే. రాముడైనా, శివుడైనా, మరే దేవుడైనా వారి బంటు లేదా వాహనం దేముడికి ఎదురుగా కొలువుతీరి వుంటుంది. ఆంజనేయుడో, గరుడాళ్వారో, నందీశ్వరుడో. దేవుడి ఎదురుగా సాష్టాంగం పడితే మన కాళ్లు వారి వైపు వుంచాల్సి వస్తుంది. అందుకే ఓ పక్కగా సాష్టాంగం చేయాలి.

మహా నైవేద్యం పెట్టేటపుడు పెద్దగా గంట వాయిస్తారు. ఇప్పటికీ అదే వ్యవహారం. కానీ నిజానికి ఇప్పుడు అంత పెద్దగా అవసరం లేదు. పూర్వం గుళ్లో మహాభోగం అయిన తరువాత కానీ, ఊళ్లో జనాలు కావచ్చు. రాజ్యాన్నేలే మహరాజు కావచ్చు, జమిందారు కావచ్చు, భోజనానికి ఉపక్రమించేవారు కాదు. అందుకోసం, మహాభోగం సమయంలో పెద్దగా గంట వాయించేవారు. దాన్ని విని, దేవుడికి నివేదన జరిగింది అని తెలుసుకుని భోజనానికి ఉపక్రమించేవారు.

తీర్థం అంటూ స్వీకరిస్తాం గుడిలో. ఇప్పడు అభిషేక జలమో, పంచామృతాలో తీర్థంగా ఇస్తుంటారు. కొన్ని గుళ్లలో తులసి వేసిన ఉదకం ఇస్తారు. తులసి మంచి చెడ్డలు తెలిసినవేగా. నిజానికి తీర్థం వెనుక వ్యవహారం ఒకటి వుంది. పూజా సమయంలో భగవంతుడికి సమర్పించే అర్ఘ్య పాద్యాలన్నీ ఆయనకు చూపించాక, వేరే పాత్రలో వేయడం పద్దతి. అలా చేరిన జలాన్ని తీర్థంగా స్వీకరించడం విధాయకం. అంటే భగవంతుడికి అర్పించిన జలం అన్నమాట అది. ఇక్కడ ఓ సంగతి చెప్పాలి. ఇళ్లలో పూజ చేసేటపుడు పంచపాత్ర కింద చిన్న పళ్లెం వుంచుతారు. కానీ పక్కన మరో పళ్లెం లేదా చిన్న గ్లాసు వుంచాలి. గుడిలో భగవంతుడికి అర్పించినవి ఓ పాత్రలోవేసినట్లు, ఇక్కడ కూడా ఆ పళ్లెం లేదా, పాత్రలో వేయాలి. ఇలా చేరిన నీటిని, పూజ అనంతంరం ఓ చిటెకడుసేవించడం, మిగిలినది తులసి మొక్కలో పోయడం శ్రేష్టం. ఎందుకంటే మనం భగవంతుడికి అర్పించేవి ఏవైనా నదీ మార్గంలో లేదా ఇలా భూ మార్గంలో ఇంటిలో నిత్యం చేసే వ్యవహారం కాబట్టి తులసి మొక్కలో పోయడం అన్నది మంచి పద్దతి. అలా పోసే ముందు చేయి అడ్డుపెట్టి పోయాలి. ఇది రెండు విధాల అవసరం. ఒకటి చేయి అడ్డుపెట్టి పోయడం వల్ల మొక్కవేళ్ల కు మంచిది. రెండవది ఆ చేతికి వున్న నైర్మల్య జలం తలపై జల్లుకునే అవకాశం.

నైర్మల్య జలమే కాదు, దేవుని విగ్రహాలు, ఫొటోలమీద నుంచి తీసిన నిన్నటి పూలు, పత్రి వగైరా కూడా తులసి లేదా ఇతర మొక్కల్లో వేయడం ఉభయతారకం. వాటిని ఎవరూ తొక్కకుండా వుంటుంది. అదే సమయంలో అవి కుళ్లి, మొక్కలకు ఎరువుగా మారుతుంది.

కుంకుమార్చన సదా చేసేవారి ఇంట బోలెడు పేరుకుంటుంది. ఏం చేయాలి. ఎంతకని ఎందరికని ఇస్తారు. దాన్ని విసర్జించాలన్నా తులసిలోనే వేయడం సులువైన పని. అయితే ఇలా వేసినపుడు కాసిన్ని నీళ్లు పోయాలి. అలా చేస్తే గాలికి ఎగరదు. అన్నట్లు కుంకుమ అంటే గుర్తుకు వచ్చింది. 

బజారులో అమ్మే పసుపు పూజకే కాదు, నిజానికి తినడానికి అంత మంచివి లభించడం లేదు. గమనించాలి. ముఖ్యంగా ఈ పసుపు పొడిబారి, ఫేస్ పౌడర్ మాదిరిగా ఎగురుతూ వుంటుంది. దానికి కారణం యంత్రాల సహాయంతో పసుపులోని తైలాన్ని వేరు చేయడమే. అలా వేరు చేసిన పసుపు మనకు ఏం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందువల్ల పసుపు కొమ్ములు చిన్న ముక్కలు చేసి, ఇంట్లో ఆడుకుని వాడుకోవడం అంత ఉత్తమం మరొకటి లేదు. అదే మాదిరిగా ఇప్పుడు దొరికే చందనపు పొడులు కూడా అంతే. వాటిని వాడినా వాడకున్నా ఒకటే.

  

Post a Comment

0 Comments