GET MORE DETAILS

మన ఇతిహాసాలు - ఎవరు గొప్ప దాత ?

మన ఇతిహాసాలు - ఎవరు గొప్ప దాత ?



మహాభారతంలో ఎన్నో కథలు, ఉపకథలు వుంటాయి. ప్రతీ కథ మన జీవితానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన అంశాలని మనకి నేర్పిస్తుంది. అలాంటి ఓ కథ ఇది. కురుక్షేత్ర యుద్ధం విజయవంతంగా ముగిసిన తరువాత యుద్ధంలో జరిగిన బంధు వధకు పరిహారంగా యాగం చేయాలనుకుంటాడు ధర్మరాజు. ఎంతో వైభవంగా రాజసూయ యాగం చేస్తాడు. అందరికీ సంతృప్తి కలిగే విధంగా విశేషంగా దానాలు చేస్తాడు. వచ్చినవారంతా ధర్మరాజు దానగుణాన్ని ఎంతో పొగుడుతారు. ఇలా అందరూ ధర్మరాజు దానగుణాన్ని పొగుడుతున్న సమయంలో అక్కడకి ఎక్కడి నుంచో ఒక ముంగీస వస్తుంది. దాని శరీరం సగం బంగారు వర్ణంతో మెరిసిపోతుంటుంది. వీళ్ళందరి మాటలు విన్న ఆ ముంగీస ఎగతాళిగా నవ్వుతుంది. అది చూసిన అక్కడ వున్న పెద్దలు ఆ నవ్వుకు కారణం ఏమిటని అడుగుతారు.

అప్పుడు ఆ ముంగీస తన నవ్వుకి కారణం చెబుతూ ఇలా అంటుంది. మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడంటున్నారు. ఇతని దానగుణాన్ని పొగుడుతున్నారు. కానీ, ఓ పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో ఈ ధర్మరాజు చేసిన దానధర్మాలు సరిరావు అంటుంది. అలా అంటూ తన అనుభవంలో తాను చూసిన ఓ బ్రాహ్మణుడి గురించి చెప్పడం మొదలుపెడుతుంది. ‘‘ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు వున్నాడు. అతని పేరు ‘సక్తుప్రస్తుడు’. భార్య, కొడుకు, కోడలు అతని కుటుంబ సభ్యులు. పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజులపాటు బిక్ష దొరకదు. ఐదు రోజులపాటు పస్తులున్నాక ఒకరోజున ఒక శేరు జొన్న పిండి బిక్షగా దొరుకుతుంది. ఆ శేరు జొన్నపిండిని కుటుంబ సభ్యులు నలుగురికీ పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు. వారు తినబోతుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలంటూ వస్తాడు.

సక్తుప్రస్తుడు భక్తిశ్రద్ధలతో అతనిని గౌరవించి, తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు. ఐనా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు. దాంతో మిగిలిన ముగ్గురూ ఒకరొకరుగా తమ భాగాలని అతనికి ఇస్తారు. అప్పుడు ఆ అతిథి కడుపు నిండిందంటూ ఆనందంతో క‌ృతజ్ఞతలు చెబుతాడు. ఆ తర్వాత తన నిజరూపాన్ని చూపిస్తాడు. ఆ అతిథి మరెవరో కాదు... సక్తు్ప్రస్తుని దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ‘ధర్మదేవత’. అతని అతిథి మర్యాదలకి, దానగుణానికి మహదానందాన్ని పొందిన ధర్మదేవత జీవించినంతకాలం సకల ఐశ్వర్యాలు కలగాలని, జీవితానంతరం స్వర్గలోక ప్రాప్తి కలగాలని వరమిస్తాడు’’ అంటూ చెప్పడం ముగించింది ముంగీస.

ఇప్పుడు చెప్పండి ఆ పేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా? ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా అని అడుగుతుంది. తనకి ఎంతో వుండగా అందులోంచి కొంత భాగాన్ని అందరికీ దానమిచ్చిన వ్యక్తినే గొప్ప దానవంతుడని అంటే, ఆకలితో అలమటించిన క్షణంలో కూడా దానగుణాన్ని విడనాడని ఆ బ్రాహ్మణుడిని ఏమనాలి? అని ప్రశ్నిస్తుంది.ఆ ముంగీస. ఆ పేద బ్రాహ్మణుడు జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది. ఆ పిండిలో దొర్లిన నా సగం శరీరభాగమంతా స్వర్ణమయమైపోయింది. అప్పటి నుంచి మరో సగ భాగం స్వర్ణమయమయ్యేంత గొప్ప దానం చేసే వ్యక్తి కోసం చూస్తున్నాను. ఎవరూ కనిపించలేదు అంటుంది ఆ ముంగీస. ఇదంతా విన్న ధర్మరాజు ‘‘నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు తన దానగుణం ఏపాటిదని, ప్రేమతో, ఆర్తితో ఒక వ్యక్తి దానం చేయాలికాని, అహంకారంతో కాదు’’ అని ఒప్పుకుంటాడు. మనం దానం చేసిన దాని విలువ అందుకునే వారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలే కాని, ఇచ్చేవారి స్తోమతపై ఆధారపడి కాదు అని చెబుతుందీ కథ మనకి.

Post a Comment

0 Comments