GET MORE DETAILS

అగ్నిపథ్‌‌ ఆగదు.. పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు

అగ్నిపథ్‌‌ ఆగదు.. పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు ➤పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : రక్షణశాఖ

 ➤విధ్వంసాలకు పాల్పడిన వారికి సైన్యంలో చోటు లేదు

 ➤నిరసనల్లో పాల్గొనలేదని అభ్యర్థులు అఫిడవిట్​ ఇవ్వాలి

 ➤100 శాతం పోలీస్ వెరిఫికేషన్ జరుగుతది

 ➤ఎఫ్‌‌ఐఆర్ నమోదై ఉంటే.. ఇక జాయిన్ కాలేరు

 ➤త్రివిధ ద‌‌ళాల ఆఫీసర్ల ప్రెస్‌‌మీట్

 ➤ఆర్మీలో ఈ నెల 22 నుంచి.. ఎయిర్ ఫోర్స్‌‌లో

 ➤24 నుంచి అగ్నివీర్ల రిక్రూట్‌‌మెంట్ ప్రాసెస్

 ➤నేవీలో రిక్రూట్‌‌మెంట్‌‌పై 25 లోపు ప్రకటన

ఇక‌‌పై త్రివిధ ద‌‌ళాల్లో అగ్నిప‌‌థ్ పథకం ద్వారా అగ్నివీరుల రిక్రూట్‌‌మెంట్ జరుగుతుందని రక్షణ శాఖ స్పష్టం చేసింది. అగ్నిపథ్ స్కీమ్‌‌ను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది. విధ్వంసాల‌‌కు పాల్పడిన వారికి సైన్యంలో చోటే లేద‌‌ని చెప్పింది. సైన్యంలో క్రమ‌‌శిక్షణ త‌‌ప్పనిసరి అని తెలిపింది. అగ్నివీరుల విషయంలో ఒక అండర్ టేకింగ్ ఉంటుందని, ఎలాంటి అరాచ‌‌కాలు, విధ్వంసాల్లో పాల్గొనలేదని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంద‌‌ని వివరించింది. అగ్నిప‌‌థ్‌‌పై దేశవ్యాప్తంగా ఆందోళ‌‌న‌‌లు జరుగుతున్న నేప‌‌థ్యంలో ఆదివారం ఢిల్లీలో  సైనిక వ్యవహారాల విభాగం అడిషనల్ సెక్రటరీ, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీతోపాటు వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి, లెఫ్టినెంట్ జనరల్ పోనప్ప, ఎయిర్ మార్షల్ ఎస్‌‌కే ఝా తదితరులు మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్ సంస్కరణలు చాలా కాలం నుంచి పెండింగ్‌‌లో ఉన్నాయ‌‌ని చెప్పారు. 1989 నుంచి ఈ సంస్కరణల అంశం చర్చల్లో ఉందని తెలిపారు.

ఆర్మీకి యువరక్తంతో కూడిన సైనికులు కావాలని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ చెప్పారు. ‘‘ఆర్మీలో సగటు వయసు తగ్గించేందుకే సంస్కరణలు తీసుకొచ్చాం. అగ్నిప‌‌థ్‌‌పై రెండేండ్లు అధ్యయనం చేసిన తర్వాతే ఈ  నిర్ణయం తీసుకున్నాం. చాలా దేశాల్లో సగటు వయస్సు 24, 26, 28గా ఉంది. మన దేశంలో సగటు సైనికుడి వయస్సు 32 ఏళ్లుగా ఉంది. యువరక్తం, అనుభవం రెండింటినీ సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది” అని ఆయన అభిప్రాయ‌‌ప‌‌డ్డారు. సైన్యంలో చాలా మంది 35 ఏళ్లకే రిటైర్‌మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం త్రివిధ‌‌ దళాల్లో ఉన్నవారి సగటు వయసు 30 ఏళ్లకు పైగా ఉందని, ఇది ఇలా కొనసాగడం ఆందోళనకరమ‌‌ని అనిల్ పూరీ అన్నారు. ‘‘సైన్యం నుంచి బయటికొచ్చాక వారేం చేస్తున్నారు? గతంతో పోల్చితే ఇప్పుడు సైన్యానికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం. యువతలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం. యువతలో సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంది. యువ సైనికులైతే సైన్యంలో టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తారని భావించాం. సెల్ ఫోన్లు, డ్రోన్లతో యువకులు అద్భుతాలు చేస్తున్నారు. అందుకే యువత సైన్యంలోకి రావటానికి, వెళ్లిపోవటానికి అవకాశాలు పెంచాం. ఈ క్రమంలో అనుభవం ఉన్నవారికి , యువశక్తికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాం’’ అని వివరించారు.

దేశ సేవలో అమరులైతే కోటి ప‌‌రిహారం :

అగ్నివీరులకు సాధారణ సైన్యంతో సమానంగా అలవెన్సులు ఉంటాయని త్రివిధ ద‌‌ళాల ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. ఏ విషయంలోనూ అగ్నివీరులు సాధారణ సైనికులకు తక్కువ కాద‌‌న్నారు. దేశ సేవలో ప్రాణత్యాగం చేస్తే కోటి రూపాయల పరిహారం లభిస్తుందని చెప్పారు. అలాగే సేవా నిధి ప్యాకేజీ ద్వారా నాలుగేళ్ల తర్వాత డబ్బులు అందుతాయన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న సాధారణ సైనికులకు సియాచిన్, ఇతర ప్రాంతాల్లో వర్తించే గౌర‌‌వ వేత‌‌నం అగ్నివీరులకు కూడా లభిస్తుంద‌‌న్నారు. ఈ విష‌‌యంలో అపోహ‌‌లు వ‌‌ద్దన్నారు. మూడు విభాగాల్లో ఏటా 17,600 మంది ముందస్తు రిటైర్‌మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. రెండేళ్లుగా కరోనా వల్ల సైనిక నియామకాలు జరగలేద‌‌ని, అందుకే ఈసారి ఎక్కువ మందిని నియమించుకోవాలని భావిస్తున్నామ‌‌ని చెప్పారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా మార్పులు, సంస్కరణలు చేయాల్సిన అవసరం ఏర్పడింద‌‌న్నారు. అగ్నివీరుల రిజర్వేషన్లకు సంబంధించి వివిధ మినిస్ట్రీలు, డిపార్ట్‌‌మెంట్లు చేసిన ప్రకటనలు ముందస్తు ప్రణాళికతో రూపొందించినవేనని, నిరసనల నేపథ్యంలో ప్రకటించలేదని తెలిపారు.

ఆర్మీలో 22 నుంచి ప్రక్రియ :

ఎయిర్‌ఫోర్స్‌‌లో అగ్నివీరుల కోసం రిజిస్ట్రేష‌‌న్ ప్రక్రియ ఈనెల 25 నుంచి ప్రారంభ‌‌మ‌‌వుతుంద‌‌ని ఎయిర్ మార్షల్ ఎస్‌‌కే ఝా తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేష‌‌న్ 24న విడుద‌‌ల‌‌వుతుంద‌‌ని చెప్పారు. జులై 24న తొలి దశ రాత పరీక్ష ఉంటుందని, డిసెంబర్ 30లోపు శిక్షణ ప్రారంభం అవుతుంద‌‌ని వివరించారు. అగ్నిపథ్ స్కీమ్‌‌ను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని ఝా చెప్పారు. అగ్నిపథ్‌‌కు సంబంధించి అర్హత, ప్యాకేజీ, మెడికల్, క్యాంటీన్ ఫెసిలిటీస్, పరిహారం, లీవ్, శిక్షణ తదితర 29 పాయింట్లతో కూడిన నోట్‌‌ను ఎయిర్‌ఫోర్స్ రిలీజ్ చేసింది. నేవీలో అగ్నివీరుల రిక్రూట్‌‌మెంట్ కోసం 25వ తేదీ లోగా ప్రకటన జారీ చేయ‌‌నున్నట్లు వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. నెల రోజుల్లోపు నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంద‌‌ని చెప్పారు. నవంబర్ 21 నాటికి తొలి అగ్నివీర్ శిక్షణ మొదలవుతుందన్నారు. ఐఎన్ఎస్ -ఒడిశాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని వివరించారు. నేవీలో అగ్నివీరుల విషయంలో లింగబేధం లేదని, యవతీయువకులకు అవకాశం ఉంటుందన్నారు. ఆర్మీలో ఈ నెల 22 నుంచి ప్రక్రియ ప్రారంభ‌‌మ‌‌వుతుంద‌‌ని లెఫ్టినెంట్ జ‌‌న‌‌ర‌‌ల్ అనిల్ పురీ తెలిపారు. ఆర్మీలో నియామకాలు అగ్నిపథ్ స్కీమ్ ద్వారా మాత్రమే జరుగుతాయన్నారు. తొలి బ్యాచ్‌‌లో 25 వేల మందిని డిసెంబర్‌ తొలివారంలో చేర్చుకుంటామని, రెండో బ్యాచ్‌‌ను 2023 ఫిబ్రవరిలో చర్చుకుంటామని, మొత్తం 40 వేల మంది అగ్నివీరులు చేరుతారని లెఫ్టినెంట్ జనరల్ పోనప్ప చెప్పారు.

పోలీస్ వెరిఫికేషన్ లేకుండా జాయిన్ కాలేరు :

నిరసనలు చేసిన వాళ్లు, విధ్వంసానికి పాల్పడిన వాళ్లకు ఆర్మీలో చోటు లేదని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ అన్నారు. ‘‘ఆర్మీ పునాది క్రమశిక్షణపైనే ఏర్పడింది. విధ్వంసానికి ఇక్కడ తావు లేదు. నిరసనలు, విధ్వంసాల్లో పాల్గొనలేదని ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్ ఇవ్వాలి. పోలీస్ వెరిఫికేషన్ 100 శాతం జరుగుతుంది. అది లేకుండా ఎవరూ జాయిన్ కాలేరు. ఎవరిపైనైనా ఎఫ్‌‌ఐఆర్ నమోదై ఉంటే మాత్రం.. జాయిన్ కాలేరు. నిరసనలు, దహనాల్లో పాల్గొనలేదని ఎన్‌‌రోల్‌‌మెంట్‌‌ ఫారమ్‌‌లో రాయాలి. దానిపై పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది’’ అని వివరించారు.

అగ్నిపథ్​పై కాంగ్రెస్​ సత్యాగ్రహం :

అగ్నిపథ్​పై నిరసన తెలుపుతున్న యువతకు సంఘీభావంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’ చేపట్టింది. ఈ దీక్షలో కాంగ్రెస్​ జనరల్​ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ వాద్రా, రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు.

త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌‌నాథ్ భేటీ :

అగ్నిపథ్ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌‌లతో రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ వరుసగా రెండో రోజూ భేటీ అయ్యారు. అయితే మీటింగ్‌‌కు సంబంధించిన ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. నిరసనకారులను శాంతింపజేయ డంపై చర్చించినట్లు సమాచారం.

Post a Comment

0 Comments