సాఫ్ట్‌వేర్ వదిలి.. సాయానికి కదిలి!
‘నీకేమైనా పిచ్చా? బంగారం లాంటి ఉద్యోగం వదిలి.. పల్లెల వెంట పడ్డావ్’ అంజలి నిర్ణయం విన్నాక ప్రతి ఒక్కరూ అన్న మాట ఇదే! నేతన్నల కోసం తను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసింది మరి. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం.. వందలాది చేనేతకారులకు ఉపాధినే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో వారి ఉత్పత్తులకు ఆదరణా తెస్తోంది. ఇదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఆమె ‘ఇంప్రెసా’ ప్రయాణమేంటో చదివేయాల్సిందే.
బిట్స్ పిలానీ నుంచి కంప్యూటర్స్‌లో మాస్టర్స్.. ఆపై విప్రోలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. 2012 ముందు వరకూ ఇదీ అంజలి జీవితం. ప్రసవమయ్యాక పాపను చూసుకోడానికి సెలవు పెట్టింది. వీళ్లది కేరళలోని కోజికోడ్. చిన్నప్పటి నుంచీ ఇకత్ అంటే ఇష్టం. ఆ చుట్టు పక్కల గ్రామాల్లో నేతవారెక్కువ. ఎలాగూ సెలవే కదా అని తనకోసం కొన్ని వస్త్రాలు తెచ్చుకోవడానికెళ్లింది. ‘ఎంతో ఉత్సాహంతో వెళ్లా. చూసేకొద్దీ తీసుకోవాలనిపించింది. నచ్చినవన్నీ తీసుకున్నా. తీరా డబ్బులు చెల్లించేప్పటికి కొంత మొత్తం తగ్గింది. దగ్గర్లో ఏటీఎంలు లేవు. ఆన్‌లైన్ వీలుకాలేదు. ఇంటికెళ్లాక పంపిస్తానంటే ‘నువ్వు ఇవ్వకపోయినా బాధపడేదేమీ లేదులేమ్మా. ఇంతకంటే దీనస్థితికైతే దిగజారం’ అన్నాడు నేతన్న. ఆయనలో ఏదో బాధ గూడుకట్టుకుందని అర్థమైంది. అలా వదిలేయ బుద్ధి కాలేదు. ఏమైందనడిగా. ఏళ్ల నుంచి నమ్ముకున్న నేత పని కడుపు నింపకపోవడం, తగ్గుతున్న ఆదరణ, అంతరిస్తున్న తీరు చెప్పుకొచ్చాడు. విన్నాక మనసంతా భారమైంది. నేనెంతో ఇష్టపడే ఈ కళ కనుమరుగవుతోందంటే బాధేసింది. ఆయన దగ్గరున్న వస్త్రాల ఫొటోలు తీసుకొని వచ్చేశా’ అని గుర్తు చేసుకుంటుంది అంజలి.
అలా మాట్లాడేవారు :
తనలాగే ఇప్పటికీ చేనేతను ఆదరించే వారున్నారని ఆమె నమ్మకం. దాన్ని రూఢీ చేసుకోవడానికి 2012లో ‘ఇంప్రెసా’ పేరుతో ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో ఉంచింది. చాలామంది ఎక్కడ దొరుకుతాయంటూ మెసేజ్‌లు. ఆర్డర్ తీసుకొని పంపడం మొదలుపెట్టింది. కొద్దిరోజుల్లోనే ఆ నేతన్న సరకంతా అమ్ముడైంది. తన నమ్మకం నిజమైందన్న ఉత్సాహంతో ఒక్కొక్క నేతకారుణ్నీ చేర్చుకుంటూ వెళ్లింది. అమ్మకాలు పెరుగుతుండటంతో 2014లో కాలికట్‌లో ఒక దుకాణం, ఆన్‌లైన్ స్టోర్‌నీ తెరచింది. ఉద్యోగానికీ రాజీనామా చేసింది. దాన్ని చూసి చాలామంది హేళన చేసేవారు. ‘గతంలో కంప్యూటర్ కోర్సులపై సలహా కోసం తల్లిదండ్రులు పిల్లల్ని నా దగ్గరికి తీసుకొచ్చేవారు. తర్వాత నుంచి ‘నువ్వు మాత్రం ఇలా చేయకు’ అని నన్ను ఉదాహరణగా చూపడం మొదలుపెట్టారు. ఇతరుల సంతోషంలో సంతృప్తి, కళను బతికించుకోవడంలో ఉన్న ఆనందం నాకు వ్యక్తిగత ఎదుగుదలలో కనిపించలేదు. కాబట్టి, ఎవరేమన్నా పట్టించుకోలేదు’ అంటుందీమె.
అంతర్జాతీయ గుర్తింపు :
తన రాష్ట్రానికే పరిమితమవ్వాలనుకోలేదు అంజలి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్.. ఇలా పలు రాష్ట్రాల్లోని గ్రామాల నేతకారులను కలుపుకుంది. కేవలం ఆన్‌లైన్‌లోనే 50 వేలకుపైగా ఆర్డర్లు అందించింది. నాణ్యత పరిశీలన, కొత్త డిజైన్లు, మార్కెటింగ్ వంటివన్నీ తనే చూసుకునేది. ఉద్యోగ పరిచయాల ద్వారా విదేశీ క్లయింట్లను ఏర్పరచుకోగలిగింది. అలా మూడేళ్లలోనే అంతర్జాతీయ గుర్తింపునీ దక్కించుకుంది. పారిస్‌లోని కాప్‌జెమినీ 2017లో ఇంప్రెసాను ‘ఉత్తమ గ్లోబల్ సోషల్ స్టార్టప్’గా గుర్తించింది. ఆ మరుసటి ఏడాది అమెరికా నుంచి ‘ద ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్’లో ప్రసంగించే అవకాశం అందుకుంది. యూకేకు చెందిన గోల్డ్‌మాన్ శాక్స్ ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సాధికారత కల్పించడానికి 10,000 విమెన్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. దీనిలో అవసరమైన వ్యాపార విద్యతోపాటు నెట్‌వర్కింగ్, పెట్టుబడి వంటి వివిధ అంశాల్లో సాయం చేస్తుంది. దీనిలో అంజలి సభ్యురాలు. కొవిడ్ సమయంలోనూ అంజలి తన సాయం కొనసాగించింది. ఇప్పుడామె ద్వారా 300కుపైగా నేతకారులు ఉపాధి పొందుతున్నారు. ఆ సంఖ్యను మరింతగా పెంచే పనిలో ఉంది. లాభాల్లో కొంత శాతాన్ని తను తీసుకుంటోంది. అదీ తన గత ఉద్యోగానికి తీసిపోదంటుంది అంజలి. అంతేకాదు.. గతంలో పిచ్చి పని అన్నవారే ఇప్పుడామె సేవనీ, తెచ్చుకున్న గుర్తింపునీ పొగుడుతున్నారు.
‘ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు. మొదట్లో మధ్యవర్తులు సరకు కొనడానికి అడ్డుపడేవారు. బెదిరింపులూ వచ్చేవి. వాటన్నింటినీ తట్టుకుంటూ నేతకారులతో స్వయంగా మాట్లాడి నమ్మకం కలిగించేదాన్ని. నేనూ ఒక్కో అడుగూ జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్లా. అదే పడిపోకుండా కాపాడింది.
0 Comments