GET MORE DETAILS

బుక్కపట్నం మల్లప్పకొండలో 1758 నాటి తెలుగుశాసనము.

 బుక్కపట్నం మల్లప్పకొండలో 1758 నాటి తెలుగుశాసనము.



కేంద్ర పురావస్తుశాఖకు చెందిన  డా॥ K. మునిరత్నంరెడ్డి గారు, శాసన పరిశోధనా విభాగపు డైరెక్టర్‌ ఇటీవల కాలములో విభిన్నకాలాలకు, భాషలకు చెందిన  మూడు శాసనాలను పరిష్కరించి పాఠకులకు అందించారు.

(1) వాటిల్లో ప్రథమంగా చెప్పుకోతగ్గది శాతవాహన మహరాజు రెండవ వాసిష్టపుత్ర పులోమావి కొడుకైన శివశ్రీశాతకర్ణిమహరాజుకు సంబంధించినది. తెలంగాణలోని తిరుమలగిరి మండలములోని ఫణిగిరి వద్ద లభించిన బ్రాహ్మిలిపిలోవున్న సంస్కృతభాషా శాసనము 2 వ ACE (శతాబ్దానికి) చెందినది.ఈ శాసనం దుష్టులచేతిలో పూర్తిగా పగిలిపోయి ఒక చిన్నముక్కగా (Fragment) మిగిలిపోయిం.ది. వాయుపురాణం ప్రకారం శాతవాహన వంశములో   శివశ్రీశాతకర్ణి 25 రాజని డా॥ మునిరత్నంరెడ్డిగారు తెలియచేశారు.శాసనంలో

 "రాజ్ఞో  వాసిష్టిపుత్రస్య శివసిరియన్ ఆదివావాసస్య --- --- వర్ష శత'' 

అని మాత్రమే వుందని కాని చరిత్రపరంగా భాషపరంగా ఈ శాసనానికి ఎంతో ప్రాముఖ్యత వుందని, దక్షిణభారతదేశములో దొరికిన అత్యంత ప్రాచీనసంస్కృత శాసనాలలో ఇదొక్కటని ఆయన తెలియచేశారు.అంతకు ముందు బ్రాహ్మిలిపిలో ప్రాకృతభాషలో  వెలువడుతున్న శాసనాల స్థానములో సంస్కృతం ప్రవేశించడము గమనార్హము.

(2) రెండోది కన్నడభాషలోనున్న తామ్ర (రాగి ) పలకశాసనము. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని లక్కినకొప్ప గ్రామంలో దొరికిన ఈ తామ్రశాసనము 8 వ శతాబ్దానికి చెందిన ఆలుప రాజైన రెండవ అలువరస కాలానికి చెందినదని డా॥ K. మునిరత్నంరెడ్డిగారు తెలియచేశారు.చొక్కపాడి గ్రామంలో వున్న పురసభ వారికి అనగా అక్కడున్న పండితజన రక్షణ కొరకు శివవల్లి అనే గ్రామాన్ని మాన్యంగా  ఇచ్చి, కాపు బోయవమ్మ(బహుశా కాపు అనేది ఓ ఊరుకావచ్చు), బేల గ్రామానికి చెందిన నంద, కులోనొర కు చెందిన నంద, సాంతౌరకు చెందిన ఉర్పణ అనే వారికి మాన్యవ్యవహారాలను నిర్వహించే పని మరియు మాన్య రక్షణను అప్పగించడం జరిగింది.

(3) పూర్వపు అనంతపురం జిల్లా ప్రస్తుతము శ్రీసత్యసాయి జిల్లాలో బుక్కపట్నం వద్దగల మల్లప్పకొండ (మల్లమ్మపల్లి కాదు) పాదము వద్ద నవీన తెలుగుశాసనమొకటి వెలుగుచూసినట్లు డా॥ రెడ్డి తెలిపారు. శాలివాహన శకము 1680(*)బహుధాన్యనామ సంవత్సరం భాద్రపద సోమవారానికి అనగా 3.7.1758 ACE కాలానికి చెందిన ఈ శాసనము పారుపయ్య కుమారుడైన శివన్న అనే వ్యక్తి తన పితామహి(అవ్వ - నాయనమ్మ) అయిన ఎరమ (ఎర్రమ్మ) కు పుణ్యం కలగాలని శివుడు, ఆంజనేయుడి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించినట్లు ఈ శాసనము తెలియచేస్తోందని డా॥ రెడ్డి తెలిపారు. ఎరమ భర్తపేరు రామప్పనయ్య.

(*) శాలివాహనశకానికి ACE లేదా AD శకానికి 78 సంవత్సరాల తేడా వుంటుంది. శాలివాహనశకానికి 78 సంవత్సరాలు కలిపితే ప్రస్తుతమున్న శతాబ్దము ఏమిటో తెలుస్తుంది.

౹౹ అనువాదం - వివరాలు ౹౹ జి.బి.విశ్వనాథ ౹౹ 9441245857 ౹౹ అనంతపురం ౹౹

Post a Comment

0 Comments