GET MORE DETAILS

భక్తవశంకరుడు - శ్రీముఖలింగేశ్వరుడు

భక్తవశంకరుడు -  శ్రీముఖలింగేశ్వరుడుఈశ్వరుణ్ణి పూజించినవారికి తీరని కోరికలుండవు. బోళాశంకరుడుగా ప్రసిద్ధి చెందిన పరమశివుడు భక్తులు ఆర్తితో పిలిస్తే చాలు వారి కళ్లెదుట నిలుబడుతాడు. ఆ శివుడే ఓ సారి దేవసభలో ఆసీనుడయ్యాడు. రంభాది దేవకన్యలు నాట్యమాడసాగారు. అక్కడే వున్న చిత్ర సేనుడనే ఓ గంధర్వుడు ఆ నాట్యాన్ని చూచి మైమరిచి తన స్థితిని మరిచిపోయాడు. తన ఎదురుగా దేవతలున్నారన్న విషయాన్ని సైతం మరిచిపోయాడు.

ఆ కన్యలతో పాటు తాను నాట్యం చేయసాగాడు. ఆ గంధుర్వుని చేష్టలకు దేవతలకు విసుగు కలిగింది. పరమేశ్వరుడు కోపం తెచ్చుకున్నాడు. ఆ గంధర్వుని ఈ చపలచిత్తునిగా ప్రవర్తించినందుకు నీవు కిరాతకునివై జన్మించు అని ఆగ్రహంతో శపించాడు. శాపాన్ని విన్న గంధర్వునికి ఒక్కసారిగా తానున్న పరిస్థితి తాను చేస్తున్న పని ఏమిటా అని చూచుకుని తను చేసినదానికి సిగ్గిల్లాడు. తన తప్పును తెలుసుకొన్నాడు. పరమశివుని పట్ల తాను కనబర్చిన అమర్యాదను మన్నించమని వేడుకున్నాడు. నీవే గతి ఈ అజ్ఞానిని రక్షించుము అని పరిపరివిధాల వేడుకున్నాడు.

దయాళుడు, అపారకృపావత్సలుడు అయిన శివుడు గంధర్వుని దీనాలాపాలకు కరిగిపోయాడు. వెంటనే ‘‘ఓ గంధర్వా! నా శాపాన్ని ఉపసంహరించలేను కాని శాప ఉపశమాన్ని తెలియచేస్తాను’’ అన్నాడు. అదే పదివేలు తనపై దయచూపమని తాను కిరాతకుణ్ణి అయినా పరమశివుని భక్తిని మాత్రం తనకు దూరం కాకుండా చూడమని వేడుకున్నాడా గంధర్వుడు. శివుడు నేను విప్పచెట్టులో నివసిస్తాను. నీవు కిరాతరూపంలో వుండి విప్పచెట్టులోని నన్ను పూజిస్తావు. నీకు ఇద్దరు భార్యలుంటారు.వారిలో వారికి పడక విప్పచెట్టును నరికివేస్తారు. అపుడు ఏర్పడే లింగాకారాన్ని చూడగానే నీకు శాపవిమోచనం కలుగుతుంది అని పరమశివుడు గంధర్వునితో చెప్పాడు.

కాల క్రమంలో పరమశివుడు చెప్పినట్లుగానే గంధర్వుడు ఓ కిరాతకునిగా జన్మించాడు. జన్మసంస్కార బలం చేత మాత్రం సదా విప్పచెట్టును పూజిస్తూ ఉంటాడు.

 విప్పచెట్టును సంస్కృతంలో మధుకం అని అంటారు. ఆ మధుకంను మధుకేశ్వరుడుగా భావించి పూజిస్తుండేవాడు. ఈ కిరాతకునికి ఓ జంగమస్ర్తి, మరొక కిరాత స్ర్తిలతో వివాహం జరుగుతుంది. ఈ జంగమ స్ర్తి కిరాతకునితో కలసి మధుకేశ్వరునికి పూజలు చేస్తుండేది. ఈమె తో ఎక్కువ కాలం కిరాతుడు గడపడం కిరాత స్ర్తికి నచ్చక ఓ రోజు మధుకేశ్వరుని పూజ చేస్తున్న తన భర్తను, తన సవితి నిచూచి ఓర్వలేక ఆ మధుకం అంటే విప్పచెట్టు మొదలును నరికివేసిందట. ఆ సమయంలోనే కళ్లుతెరిచిన కిరాతకునికి పరమశివుడు మధుకేశ్వరుడుగా కనిపించాడు. ‘‘హరహర మహదేవ శంభో! పరమశివా కరుణామరుూ అపార కృపావత్సలా’’అంటూ పరమశివుడిని పొగడుతూ కిరాతకుడు తన కిరాత రూపంనుంచి గంధర్వరూపానికి మారిపోయాడట.

అందుకే ఈ ముఖలింగేశ్వరాలయంలో మనకు కనిపించే శివలింగం విప్పచెట్టు మొదలుభాగంగా కనిపిస్తుంది. ఆ విప్పచెట్టుకు చేసే పూజాదికాలు లింగాభిషేకాల వల్ల నే లింగాకృతిలో మారిందని ఈ లింగంపైన పరమశివుని ముఖం కనిపిస్తుందని ఇక్కడి భక్తులు చెప్తారు.

మరోకథ ఇలా...

ఈ కథనం ప్రకారం అందరినీ పట్టి పీడించే శనిదేవుడు ఓ సారి కైలాసం వెళ్లాడు. అక్కడ చిరునవ్వులు చిందిస్తూ పార్వతీ దేవితో సరసాలాడే శివుని చూచి తన ప్రతాపం ఎంతటిదో నీకు తెలియదని శని శివునితో మాటల మధ్యలో అన్నాడట. అపుడు శివుడు అందరి సంగతి ఏమో కాని నీవు నా చెంతకుమాత్రం రాలేవని అన్నాడట. దానికి చిన్నబుచ్చుకున్న శని ఎందుకు రాలేను. రేపే నా ప్రభావం నీకు చూపిస్తాను. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడట.

శివుడు శని వచ్చేవేళకు ఆయనకు దొరకకూడదని కైలాసం నుంచి వచ్చి ఓ చెట్టు తొర్రలో దాక్కున్నాడట. ఆ శివుడు దాక్కొన చెట్టు తొర్ర దగ్గరకు శని వచ్చి ‘‘ఏమి పరమశివా!నా ప్రభావం ఎంతటిదో ఇప్పటికైనా తెలసిందా నీకు ? ’’ అన్నాడట. దానికి పరమశివుడు నేను నీకు ఇప్పుడే కదా కనిపిస్తున్నాను. నీ ప్రభావం నామీద ఏమీ లేదు అన్నాడట.

శని పగలబడి నవ్వి ‘‘ఓ అమాయక శివా! కైలాసం లో ఉండే నీవు నా ప్రభావం వల్లే కదా ఈ కళింగలో చెట్టుతొర్రలో తలదాచుకున్నావు. ఇది నా ప్రభావం కాక మరేమిటి?’’ అన్నాడట.

‘‘నిజమే శనీ నీవు నిజంగా ప్రభావవంతుడివే. ఒప్పుకుంటున్నాను. కాని ఈ విప్పచెట్టును నన్నుగా భావించి పూజించే వారి జోలికి వెళ్లకు ’’ అని శివుడు చెప్పాడట. దానికి శనిదేవుడు అట్లానే అని శివాజ్ఞనుపాటిస్తానని చెప్పాడు. ఆ చెట్టు తొర్రే నేటిముఖలింగంగా కళింగ దేశంలో దర్శనం ఇస్తోంది.

ఈ ఆలయ సమీపంలో కుమ్మరి వాడైన నాగప్ప అనే శివభక్తుడు ఉండేవాడు. అతడికి సంతాన భాగ్యం లేదు. అందుకని శివుణ్ణి తనకు సంతానం ప్రసాదించమని తనకు సంతానభాగ్యం కలిగితే రెండు గోలెలిస్తానని మొక్కుకున్నాడట. కొన్నాళ్లకు అతనికి సంతానం కలిగంది.

సంతోషంతో కుమ్మరి నాగన్న రెండు గోలాలు చేసుకొని ఈ ముఖలింగేశ్వరుని దగ్గరకు పోగా ఈ గోలాలు ఆలయ ద్వారంలో పట్టలేదట. దానితో మళ్లీ నాగన్న వెళ్లి మరో రెండు గోలెలు తయారు చేసుకొని వచ్చాడట. కాని ఇవి కూడా ఆలయ ముఖద్వారంలో పట్టలేదట.

ఇదంతా తనకు శివుని పై వున్న భక్తిలోని లోపమే అని నాగన్న అనుకొన్నాడట.శివుడు మెచ్చని భక్తి లేని నేనుజీవించటమెందుకు అని నాగన్న ప్రాణ త్యాగం చేసుకోబోయాడట. చివరిసారిగా గోలాలు వెళ్లి చూస్తాను వెళ్లగా ఆ గోలాలే ద్వారంలో లోపలికి వెళ్లాయట. అవే కాక మొట్టమొదట చేసిన పెద్ద గోలాలు కూడా ద్వారబంధంలో పట్టాయట. శివుడు తన్ను పరీక్షించి మర మెచ్చుకున్నాడని నాగన్న ఎంతో సంతోషంగా తన పరివారంతో ఈ ముఖలింగేశ్వరునికి పూజలు చేసేవాడట. ఇప్పటికీ ఆ గోలాలు ఆలయంలో కనిపిస్తాయి.

ఇలా ఎన్నో స్థల పురాణాలు కథలు ఈ ముఖ లింగేశ్వర స్వామి కి ఉన్నాయి. ఇక్కడ జైన, బౌద్ధ మతాలు కూడా పరిఢవిల్లాయని చారిత్రికాధారాల వల్ల తెలుస్తోంది. పంచపీఠ క్షేత్రంగా ఈ ముఖలింగేశ్వరాలయ స్థలం ప్రసిద్ధి చెంది ఉండేది. అసలీ గ్రామాన్ని కళింగ దేశమని, కళింగ నగరమని అనేవారట. ఖారవేలుని రాజధానిగా కళింగనగరంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.

ఉత్తరాంధ్రలో అద్భుతక్షేత్రం శ్రీకాకుళం జిల్లాలో ముఖలింగం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అతి పురాతన దేవాలయం అయిన శ్రీముఖలింగం నిర్మాణంలోను, చెక్కడాలలోను, శిల్ప సౌందర్యంలోను అడుగడుగునా ఉత్కళ సంప్రదాయం కనపడుతుంది. చాలా అరుదుగా కనిపించే యమ, ఇంద్రాది దిక్పాలకుల ఆలయాలు ఇక్కడ ఉన్నాయ.

ఈ ముఖలింగేశ్వరాలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపులా ఎనిమిది శివలింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారిని వరాహిదేవిగా పిలుస్తారు. సప్తమాతృకలల్లో వరాహిదేవి ఒకరు. సప్తమాత్రుకలు పార్వతీ దేవి అవతార విశేషాలుగా చెప్తారు. వీరే కాక కుమారస్వామి, గణపతి, చతుర్ముఖుడు దక్షిణామూర్తి వార్ల దర్శనం కూడా కలుగుతుంది. ఈ ఆలయం లో వరాహ, వామనా వతార ఘట్టాలకు సంబంధించిన శిల్పసంపద కూడా గోచరిస్తుంది. ఈ శిల్పాల్లో సూర్యుని రూపుకూడా ఇక్కడ కనిపించడం విశేషం. ఈ ఆలయ ముఖ మండపం పై రాతితో కప్పువేసి ఉన్నారు. ఈ కప్పు అంతాకూడా ఏకశిలానిర్మితమైంది. ఓ సారి పిడుగు పడి ఈ కప్పు విరగగా ఒక రాతి శకలాన్ని తరలించడానికి సుమారుగా 50మంది కావాల్సి వచ్చారట. ఒక చిన్న ముక్కకే ఇంతమంది కావాల్సి ఉంటే దేవాలయమంతా కప్పిన రాతి కప్పు ఎంత బరువైనదో దాన్ని అంత పైకి ఎలా చేర్చారో అని ఆశ్చర్యం వేసే శిల్పసంపద నాటి వైభోగాన్ని కళ్లకు కడుతుంది.

ఇవేకాక ఇక్కడ ఏడు నాలికలున్న అగ్ని దేవుని విగ్రహం, కాశీఅన్నపూర్ణాదేవి, నటరాజు విగ్రహాలు కూడా కనువిందు చేస్తుంటాయి. ఇలా ప్రాచీన వైభవానికి నిలువెత్తు సాక్షంగా ఉన్న ఈ శ్రీముఖలింగేశ్వరాలయాన్ని దర్శించిన వారికి తీరని కోరికలుండవు. ఈ ఆలయ దర్శనం ఎన్నో పూర్వజన్మల పుణ్య ఫలమని ఇక్కడి యాత్రికుల భావన.

అతి ప్రాచీన పుణ్యక్షేత్రంగా ఒకప్పటి వైభవానికి చిహ్నంగా వున్న శ్రీ ముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో వుంది. శ్రీకాకుళంనుంచి శ్రీముఖలింగం బస్సులో చేరుకోవచ్చు.

సేకరణ/రఘురామ స్వామి

Post a Comment

0 Comments