అమ్మో మధ్యరాత్రిలో మెలకువ వస్తోంది...!
చాలామందికి పడుకున్న తరవాత అర్ధరాత్రి లేదా తెల్లవారు జాముననే మెలకువ వస్తుంది.. ముఖ్యంగా 45 ఏళ్ళపై బడిన వారిలో ఎక్కువగా ఉంటాది,. గుండెపోటు, పక్షవాతం లాంటివి తెల్లవారు జామున ఎక్కువగా వస్తాయి,, కొందరు నిద్రలోనే చనిపోతారు.
ఈ సమస్య గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందామా!
1. మొదట సాధారణ కారణం. రాత్రి ఆహారం చాలా లైట్ గా తీసుకోవడం,. కొందరు షుగర్ పేషెంట్ల కయితే మందులు, ఇన్సులిన్ తగినంత తీసుకున్నా అవి ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తించడం. మీకు తెల్లవారు జామున మెలకువ వచ్చి గుండెదడ, చెమటలు, విపరీతమైన ఆకలి వుందా? వెంటనే ఆ సమయంలో ఒన్ టచ్ మిషన్ ద్వారా షుగర్ చూసుకోండి. 70 లోపల పడిపోయింటే అది హైపో గ్లైసీమియా. వెంటనే కొంచెం కలకండ తినడమో, షుగర్ నీళ్ళు తీసుకోవడమో చేయండి. ఏదైనా పండుతినండి. షుగర్ 120 కన్నా ఎక్కువగా ఉందా అది హైపోగ్లైసీమియా కాదు. వేరొకటేమో చూద్దాం. కొందరికి షుగర్ కంట్రోలు లో లేకపోతే హైపర్ గ్లైసీమియా ఎక్కువగా తరచూ మూత్రం వచ్చి మెలకువ వస్తాది. ఎక్కువగా తిన్నా సమస్యే. తక్కువగా తిన్నా సమస్యే.
2. తెల్లవారుజాముననే మెలకువ వచ్చింది. ఆకలి, కడుపుమంట, తేపులు, గుండెదడ వుందా? అది హైపర్ అసిడిటీ, గ్యాస్ట్రబుల్, అల్సరు లాంటి సమస్య వుండచ్చు. ఓ పాన్ టాపు టాబ్లెట్ వేసుకుని పడుకోండి. గ్యాస్ట్రోఎంటిరాలజీ వైద్యనిపుణులు వారిని సంప్రదిస్తే ఎండోస్కోపు చేస్తారు. సమస్య సులువుగా తెలిసిపోతుంది. పరిష్కారం సులభమే.
3. అలా కాకుండా మెలకువ వచ్చి ఆయాసం, గుండెదడ వుండి బెడ్ మీదనుండి లేచి బయటకు నడిచి గాలి తీసుకొని అలా తిరిగితే కొంచెం సేపుటికి తగ్గిపోతుంది. మరలా మరసటిరోజు వస్తోందా దీనిని పారాక్జిసమల్ నాక్టుర్నల్ డిస్నియా. అంటే తరచూవచ్చే రాత్రిపూట ఆయాసం అంటారు. ఇది డేంజర్. హార్ట్ ఫెయిల్యూరు ముందు దశ. ఈ సమయంలో కనిపెట్టడం జరగకపోతే రెస్టింగ్ డిస్నియా, ఆర్ధోప్నియా అంటే ఆయాసం తగ్గేకి కూర్చోనే ఉండాల. అలా ఆయాసం తగ్గే పరిస్ధితిలో కెళ్ళి హార్ట్ ఫెయిల్యూరవతాది. గుండె జబ్బుల వైద్యుల దగ్గరకెళితే ECG, ఎకో తీసి కారణాలను విశ్లేషించి మందులు, తరుణోపాయం చెబుతారు. కొందరికి ఆయాసము వలన నిద్రచెడి దయ్యాల ఫిక్షన్ కలలు వస్తాయి. ఆయాసం తో మేల్కొంటారు. దయ్యం కాదు ఆరోగ్య సమస్య మొదలవుతోంది అని మన శరీరం మన కిచ్చే వార్నింగ్ సిగ్నల్.
4. కొందరికి ఒంటికి మూత్రం పోసుకోవలసి రావడం వలన మెలకువ వస్తాది. వీరు సాధారణంగా పడుకునే ముందు నీరు తాగకుండా భయపడి మూత్రవిసర్జన చేసి పడుకుంటారు. అయినా 4-5 గంటల తరువాత మెలకువ వస్తాది. భయపడి నీరు తాగరు. అదే తప్పు కొంపముంచుతాది. మన రక్తంలో 45% రక్తకణాలు, అంటే ఎర్రరక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్సు, ఉంటాయి. మిగతాదంతా 55% ద్రవం దీనినే ప్లాస్మా అంటాము. మెజారిటీ నీరే వుంటాది. కొంచెం ప్రోటీన్లు, ఫాట్సు,అమైనో ఆమ్లాలు, క్లాటింగ్ ఫాక్టరులు వుంటాయి.
మనం పగలు తిరిగే టపుడు రక్తం గుండెనుండి ఆర్టరీల ద్వారా వెళ్ళి వీన్సు ద్వారా గుండెకు రావాల. శరీరం పైనుంచి రావడం సులభం. కింద కాళ్ళనుంచి వెళ్ళాలంటే గ్రావిటీకి ఆపోజిట్ గా వెళ్ళాల. దీనికి వీన్సులోని వాల్వ్సు, కాఫ్ పంపు లేదా రెండవ గుండె అన బడే పిక్క కండరాలు సహాయం చేస్తాయి. అలా చేయాలంటే నడవాల.
కాని కంప్యూటర్ లు పని చేసుకుంటూ నడవకపోవడం, ఎక్కువగా నిలబడి వుండడం వెయిటర్ లు, పెట్రోలుపంపులలో పనివారు, లేదా వీనస్ టోను తక్కువ వలన వీన్సులో ప్రెజర్ పెరిగి కొంచం రక్తంలోని నీరు కాళ్ళలో మెడమల దగ్గర బయటకు వచ్చి కాళ్ళు వాస్తాయి. మనం ఎక్కువగా ప్రయాణం చేసినపుడు చూసింటాము. దీనినే ఎడీమా అంటారు. అందుకే గంటకోసారి లేచి నడవాల. ఓ గంట మధ్యాహ్నం రెస్టు తీసుకోవాల. లాంగ్ జర్నీ విమానప్రయాణాలు అంటే అమెరికా ప్రయాణాలలో ఊరికే కూలబడక లేచి నడవమంటారు. దూరప్రయాణం చేసేవారు ఓ క్లోపిటాబ్ A టాబ్లెట్ వారం రోజుల ముందునుండి వాడడము మంచిది.
సరే ఈ కాళ్ళలో చేరిన నీరు రాత్రి పడుకోగానే గ్రావిటీ ప్రెజర్ లేకపోవడం వలన మరలా రక్తనాళాలలోకి వచ్చి చేరతాది. అలా చేరగానే రక్తం పరిమాణం ఓ అరలీటర్ పెరగతాది... మామూలుగా గుండె, కిడ్నీలు బాగా వుంటే ఇదేం పెద్ద సమస్య కాదు,,, దానిని అవి బయటకు విసర్జిస్తాయి. అందువలన మూత్రం తయారయి మెలకువ వస్తాది. ఇక్కడ నీరు తాగడం వలన మూత్రం రాలేదు. శరీరంలోని కాళ్ళలో చేరినది మరలా పీల్చుకోవడం సమస్య. కావున నీరు చేరకుండా మధ్యలో నడవాల. మధ్యాహ్నం 4-6 గంటల సమయంలో రెస్టు తీసుకోవాల.
ఒక వేళ గుండె లో సమస్య వుంటే ఫెయిల్యూర్ అయే ముందు దశలో ఉంటే ఈ కాళ్ళనుంచి వచ్చి చేరే నీరు సమస్య అవతాది. పండుకున్నపుడు గుండె వేగం తక్కువగా బేస్ లైన్లో ఉంటాది. ఈ పెరిగిన అరలీటరు రక్తంలో చేరిన నీరు వలన పంపింగ్ సమస్య వస్తాది. ఈ నీరు ఊపిరితిత్తులు లో చేరి ఆయాసం వస్తాది. మరలా మనం లేచి తిరగగానే గుండె వేగం పెరిగి ఆ నీరును కిడ్నీలకు పంపు చేయడం వలన ఊపిరితిత్తులు లో చేరిన నీరు తగ్గి ఆయాసం తగ్గుతుంది. మూత్రము వస్తాది. నిద్రాభంగం తరచు జరగతాది.
సమస్య మూత్రంది కాదు గుండెది. భయపడి మనం నీరు తాగము. అక్కడే కాలిక్యులేషన్ దెబ్బపడతాది. మనం మూత్రం పోయడం వలన రక్తంలో నీటి శాతం పరిణామం బాగా పడిపోతాది. రక్తం లో విస్కాసిటీ సాంద్రత పెరగతాది. అపుడు అది రక్తనాళాలలో పోయేటపుడు సులభంగా పోలేదు. మనకు రక్తనాళాలు లో కొవ్వు చేరి ప్లాక్సు కనుక ఉంటే (మనకు తెలియకుండానే చేరింటాయి) ఈ పెరిగిన సాంద్రత వలన క్లాటింగ్ ప్రాసెస్ మొదలయి కొందరకు తెల్లవారు జామున హార్ట్ అటాకు, లేదా పక్షవాతం వస్తాది. గుండె లోని మూడు నాళాలులో కొవ్వు చేరి క్రిటికల్ రక్తం సరఫరా ఉండే వారిలో వెంటనే 60% కు వెంట్రికిలార్ ఫిబ్రిలేషన్ వస్తే నిద్రలోనే చనిపోతారు. కొందరు వెంటనే ఛాతీ నొప్పి వస్తే ఆసుపత్రి కి పోతే ICU లో ఉంచి చికిత్స చేసి ఆంజియోగ్రాము, స్టెంటు లేదా బైపాసు అడ్వయిజ్ చేస్తారు.
ఇపుడు లేటెస్టుగాహార్టు పెయిన్ వస్తే ప్రైమరీ ఆంజియోప్లాస్టీ అని అత్యవసరంగా రాత్రే చేసి స్టెంటు వేస్తారు. కాకపోతే ఓ గంట రెండు గంటల లోనే ఆసుపత్రి కి పోవాల. అలాగే పక్షవాతానికి త్రాంబోలైసిస్ చేసే రక్తం కరిగించే ఆల్టిప్లేజ్ లాంటి ఇంజక్షన్ వేస్తారు. కొన్ని చోట్ల కెరాటిడ్ క్లాట్ సక్షన్ మరియు స్టెంటు వేస్తారు. ఇవన్నీ మహానగరాలలో వుండే వారికే దొరికే మెడికల్ వసతులు.
కావున మనం పడుకునే ముంది ఓ గ్లాసు నీరు తాగదాం. ఒక వేళ అర్ధరాత్రి మెలకువ వస్తే మరలా మూత్రవిసర్జన తరువాత ఓ గ్లాసు నీరు తాగదాం. పాత కాలంలో మంచం పక్కలో నీటి చెంబు గ్లాసు పెట్టేది అందుకేనేమో... ఇపుడంతా ఫ్రిజ్ లు వచ్చాయి. చల్ల నీరే తాగాలనా మీరు నా మాదిరి ఓ ఫ్లాస్కు లో వాటర్ బెడ్ పక్కలో ఉంచుకోండి. ఒక వేల మెలకువ వస్తే తాగండి. లేకపోతే లేదు.
★ కాని కారణాలు మీరే విశ్లేషణ చేసుకొని వైద్యసహాయం పొందండి.
Dr.C.ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.
0 Comments