GET MORE DETAILS

రేపటి నుండి మహాలయ పక్షం ప్రారంభం , మహాలయ పక్షం అంటే ఏమిటి ? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది ?

రేపటి నుండి మహాలయ పక్షం ప్రారంభం , మహాలయ పక్షం అంటే ఏమిటి ? మహాలయ అమావాస్య ఎప్పుడొస్తుంది ?



మహాలయ పక్షం సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 25 తేదీ మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి , మీ పితృదేవతలను స్మరించి , వారికి నమస్కారము చేస్తూ ,  నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి , మీ దీవెనలు అందచేయండి’* అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు. 

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో , ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

తండ్రి జీవించి , తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ , శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య (సెప్టెంబర్ 25 న) నైనా చేసి తీరాలి. 

దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. 

ఆ చెట్టుకున్న పండ్లే కాదు , మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి , తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా *‘‘కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’* అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. 

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా , ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. 

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది , ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

Post a Comment

0 Comments