GET MORE DETAILS

ఆంక్షల నడుమ ఆడపిల్ల (నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం)

 ఆంక్షల నడుమ ఆడపిల్ల (నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం)



యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

ఆడపిల్లని మా ఇంటి మహాలక్ష్మి అని పిలుస్తారు.స్త్రీని దేవతతో పోల్చుతారు.కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఇందుకు భిన్నంగా ఉన్నాయి.నిత్యం వారిపై ఎదో ఒక రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి.వారిపై ఇంటా బయటా అనేక ఆంక్షలు ఉంటాయి.

పుట్టింది మొదలు.. అమ్మ, నాన్న మాటలు వినాలి. బయటికి వెళ్లాలంటే ఎవరైనా తోడు ఉండాలి. గట్టిగా నవ్వకూడదు.. ఎందుకంటే నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని అంటారు కాబట్టి.. ఈడొచ్చిందంటే పెళ్లి కోసం పక్కవారింటి మొదలు ప్రతీ ఒక్కరూ ఆరాటమే.. ఈ జీవిత పరీక్షలు ఉండగానే.. ఆమె విద్య పరీక్షలు కూడా ఉంటాయి. అయినా వీటన్నింటిని పట్టించుకోకుండానే వాటిని అధిగమిస్తుంది. అయినా.. అవేం పట్టవుగా అందరికీ.. చదువు ఎందుకు పనికొస్తుంది. ఎవరో ఓ అయ్య చేతిలో పెడితే సరిపోతుందనే మాటలు… వీటిని పట్టించుకోని పెద్దవారి కొంతమందైతే.. మరికొంతమంది అవే వేదమంత్రాల్లా గోచరించి వివాహ కార్యక్రమాలు మొదలుపెడతారు.

చాలా దేశాల్లో అమ్మాయిల చదువుకి ఎలాంటి ప్రయారిటీ లేదు. ఏ సమస్యా లేకపోతే అమ్మాయిని స్కూలుకి పంపిస్తారు. ఏ చిన్న సమస్య ఉన్నా ముందు మూల పడేది అమ్మాయి చదువే. ఇంట్లో చిన్న పిల్లలుంటే వారిని చూసే బాధ్యత పెద్ద ఆడపిల్లలదే, ఇంట్లో పనులు చేసేది వీరే.

ఆడపిల్లల జీవించే హక్కు మగపిల్లల జీవించే హక్కు లాగా గౌరవింపబడడం లేదు. చాలా దేశాల్లో అమ్మాయి పుట్టాలన్న కోరిక కంటే అబ్బాయి పుట్టాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. అంటే, అమ్మాయి పుడుతుందని తెలిసినప్పుడు అబార్షన్ చేయించుకోడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కొన్ని దేశాల్లో ఒక వేళ ముందు అమ్మాయో, అబ్బాయో తెలియకపోతే అబ్బాయి కావాలనుకున్నప్పుడు అమ్మాయి పుడితే అమ్మాయిని చంపేయడానికి కూడా వెనుకాడటం లేదు.

అమ్మాయిలకి సురక్షితం గా ఉండే వాతవరణం ఉండి, చక్కని చదువు ఉండి, ఆరోగ్యకరమైన జీవితం గడపగలిగే అవకాశం ఉంటే వారు తల్లులుగా, వ్యాపార వేత్తలుగా, గృహిణులుగా, రాజకీయ నేతలుగా ఎదిగి దిశానిర్దేశం చేయగలుగుతారు. కానీ, ప్రపంచవ్యాప్తం గా చాలా మంది ఆడపిల్లలకి అవన్నీ లభిచటం లేదు. వారి ఎన్నో హక్కులు వారు అనుభవించలేకపోతున్నారు.

ప్రతి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుతారు.మనదేశంలో జనవరి24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యత బాలికా దినోత్సవానికి కూడా ఇవ్వాలి. ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వాలు అన్ని వసతులు కల్పించాలి.



Post a Comment

0 Comments