GET MORE DETAILS

భీష్మ ఏకాదశి

భీష్మ ఏకాదశి  
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, మీరంతా ఆచరిస్తారనే ఆశిస్తున్నాను, నాకు తెలిసినవి, నాకు కనిపించే మంచి విషయాలు సేకరించి పోస్ట్ చేస్తున్నాను, మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ...

భీష్మ ఏకాదశి

మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈరోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి" అని పిలుస్తారు.

గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది. అంటే గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. అలా శంతనుడి చేత శాపవిముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడయినాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాదికాలం నుంచీ వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యాన్ని అది ధరించి ఉంటుంది.

భీష్మ పితామహుడు

శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు. మరి మీరు ఎవర్ని స్మరిస్తున్నారు నిరంతరం అని..ఆయ్నను చుసి అడిగిన ప్రశ్న కు శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానం ”తను ఒక పెద్ద ఆయ్నను తల్చుకుంటున్నాను అని” ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తలవబడుతున్న ఆ పుణ్యమూర్తి ఎవరు ?

”నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడు నామాన్ని…..ఆ భక్తుడే భీష్మపితామహుడు” అని కృష్ణ పరమాత్మ అసలు విషియాన్ని చెప్పాడు.

అవును. భగవంతుడు భక్త పరాధీనుడు. భక్తుదేంతగా తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటాడో.. అంత కంటే ఎక్కువగా ఆ సర్వాంతర్యామి తన భక్తుని యొగక్షేమాల పట్ల శ్రద్ధ తీస్కుంటు ఉంటాడు. అందుకే భక్తి ఎక్కడో భగవంతుడు అక్కడే అని అన్నారు.

భీష్ముడి జన్మ రహస్యం

శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా ?’ అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ’నేనెవరో తెలుసా ?’ అంది. “నువ్వెవరివైనా సరే , నన్ను వివాహమాడు. నా రాజ్యం , నా డబ్బు , నా ప్రాణం , సర్వస్వం నీ కిచ్చేస్తాను” అని మ్రతిమాలాడు.

అప్పుడు ఆ అమ్మాయి , ”మహారాజా ! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను. కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి ” అంది. ఆవేశంలో  “అలాగే !” అని మాట యిచ్చాడు శంతనుడు.

వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు – గంగాదేవి.

పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా , పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం , మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో  ”నువ్వెవరు ? ఎక్కడనుండి వచ్చావు ? ఇలా ఎందుకు చేస్తున్నావు ? ” అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. ఏడుగురు కొడుకులు పుట్టారు. ఏడుగురూ ఏటిపాలయ్యారు.

చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక ”నువ్వు తల్లివి కావు…ఎందుకింత పాపం చేస్తున్నావు ?” అని అడిగాడు.

వెంటనే ఆమె “మహారాజా ! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.

పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది ! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. ‘ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు’ అని చెప్పాడు భర్త.

ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను ‘సరే’ అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.

”వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో , ’ మీరంతా మానవులై పుట్టండి’ అని శపించాడు. అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు. కానీ వశిష్ట మహర్షి , ‘నా శాపానికి తిరుగులేదు పొండి !’ అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.’ నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు ! అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.

” ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి , ‘గంగాభవానీ ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు , అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి , మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ !’ అని మొరపెట్టుకున్నారు. అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను , అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.

ఆ పిల్లవాడే దేవవ్రతుడు. వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు. ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ , పాండవ , వంశాలకు పితామహుడు. అటువంటి భీష్మున్ని తలుచుకుని తరిద్దాం.

భీష్మ పితామహుడు నిర్యాణం చెందిన పవిత్ర తిథి అయిన “భీష్మాష్టమి” !! ఈ సందర్భంగా ఆ మహానుభావుడు అంపశయ్యపై చేసిన శ్రీకృష్ణ పరమాత్మ స్తుతిని (పోతన భాగవతం నుంచి) చదువుదాం.

మందాకినీ నందనుడైన భీష్ముడు సమస్త దోషాలను నిరస్తం చేసి నిష్కామభావం తో , నిర్మలధ్యానంతో పీతాంబరధురుడు , చతుర్భుజుడు , పురాణపురుషుడు , పరమేశ్వరుడు అయిన గోవిందుని యందు ఏకాగ్రబుద్ధి ని సంధానించి పరమానంద భరితుడై ప్రకృతిసిద్ధాలైన సంసార బంధాలను పరిహరిం చే ఉద్ధేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడు.

“ముల్లోకాలకు సమ్మోహనమై న నీలవర్ణ కాంతులతో నిగ నిగలాడే మనోహరమైన దేహం గలవాడు ; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు ; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు ; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు ; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు ; అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నామదిలో నిరంతరం నిలిచిపోవాలి.”

గుర్రాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా ; ముంగురులు చెదిరి పోతున్నా ; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లుకారుతున్నా ; ముచ్చటైన ముఖమంతా ఎర్రగా అవుతున్నా ; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.

ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తు , పగవారి కళ్ళెదురు గానే రథాన్ని తీసుకెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశం లో నిలబెట్టాడో ; చిరునవ్వులు చిందిస్తూనే కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తు ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో ; ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయపద్మం లో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.

రణరంగంలో తన బంధు మిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనుంజయునికి మహా మహిమాన్వితమైన గీతోపదేశం చేసి , సందేహాలు పోగొట్టి , యుద్ధంలో ముందంజ వేయించిన వాని ; మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక.

ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది ; కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి ; ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది ; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది ; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా ! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను”* అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష.

“ఇతడు నా నమ్మినబంటు , ఇతణ్ణి కాపాడటం నా కర్తవ్యం సుమా.“అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చుండి , ఒక చేతిలో ఒయ్యారంగా పగ్గాలు పట్టుకొని , మరొక చేతిలో కొరడా ధరించి, పరమోత్సాహంగా అశ్వాలను అదలిస్తు చూచేవాళ్లను ఆశ్చర్యచకితులను చేస్తున్న పార్థసారథిని ప్రశంసిస్తున్నాను.

తియ్యని మాటలతో మందహాసాలతో , ప్రవర్తనలతో , ప్రణయకోపాలతో , వాల్చూపులతో వ్రజవధూమణుల వలపులు దోచుకొనే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను.

మునీంద్రులు , నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభా మందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు.

ఉన్న సూర్యుడు ఒక్కడు సకల జీవరాసులలో ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను.”

ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా , వాక్కుల ద్వారా , దృక్కుల ద్వారా శ్రీకృష్ణపరమాత్మను హృదయం లో పదిలపరచుకొని ; నిశ్వాసాన్ని నిరోధించి ; నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునిలో ఐక్యమైయ్యాడు. అప్పుడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ సంధ్యా సమయం లో పక్షుల్లా మౌనం వహించారు ; దేవలోకంలోను , మానవ లోకంలోను దుందుభులు ధ్వనించాయి ; సాధుసంకీర్తనలువినిపించాయి పూలవానలు కురిశాయి ; తనువు చాలించిన దేవనదీ పుత్రునికి దహన సంస్కారాలు జరిపించి ; ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు. అక్కడి మునులందరు శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో నిలుపుకొని ; ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషిత స్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలిపోయారు. అనంతరం ధర్మనందనుడు నందనందనునితో కలిసిక్ హస్తినాపురానికి వెళ్లాడు. అక్కడ గాంధారీ సహితుడైన ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి అతని అంగీకారంతో , శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాత తండ్రులు పరిపాలించిన రాజ్యాన్ని స్వీకరించినవాడైక్ ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించసాగాడు.”

సీ. కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి

గగన భాగంబెల్లఁ గప్పి కొన నుఱికిన నోర్వక యుదరంబులోనున్న

జగముల వ్రేగున జగతి గదల

జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున

బైనున్న పచ్చని పటము జాఱ

నమ్మితి నాలావు నగుబాటు సేయక

మన్నింపు మనిక్రీడి మఱల దిగువ

తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి

నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు

విడువు మర్జున ! యనుచు మద్విశిఖ వృష్టి

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.

భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి , ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడ్కొని పాండవులు వస్తారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుని చూసి భీష్ముడు చేసిన స్తుతిలో భాగం ఈ పద్యం. శ్రీకృష్ణ పురస్సరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులూ , దేవర్షులూ, బ్రహ్మర్షులూ శిష్యసమేతంగా వచ్చారట. ఆ సందర్భమే ఒక చిత్రమైన సన్నివేశం.

అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆయన “మహోగ్రశిఖర ఘన తాళతరువగు సిడము వాడు” – అంటే ఆయన ధ్వజం గుర్తు తాటిచెట్టు. దానిలాగే వందలాది భారత పాత్రలలో అండరికంటే ఎత్తుగా కనిపిస్తాడు భీష్ముడు. శీలంలోనేమి , శౌర్యంలోనేమి , నీతిలోనేమి , నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచీ ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్నీ , రాజ్యాన్నీ అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు. యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి , కొంత కాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. కాని , భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కయిన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమో అన్న అనుమానం వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు. తన తమ్ములు చనిపోయిన తర్వాత గూడా , తన భీషణ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీ దేవి స్వయంగా ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు.

శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని , ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులలో ఎరుక గల్గిన అతికొద్దిమందిలో భీష్ముడు ముఖ్యుడు. తన భక్తిని ఎక్కువగా ప్రదర్శించక పోయినా మహాభక్తుడు భీష్ముడు ముఖ్యుడు. అందుకే ఆయనను మహాభక్తుల కోవలో పరిగణించారు విజ్ఞులు , *“ప్రహ్లాద , నారద , పరాశర , పుండరీక , వ్యాస , అంబరీశ , శుక , శౌనక , భీష్మ దాల్భ్యాన్”* అంటూ. అంతే కాదు , ఆయన మహా విజ్ఞాని. ఎన్నో ధర్మాలు తెలుసు ఆయనకు ! రాచకార్యాల్లో తలమునకలు కాని సమయమంతా అధ్యయనం లోనే గడిపి ఉంటాడు. తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మజునకు బోధించాడు. భారతంలో శాంతిపర్వం , అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. ఇక పద్యంలోకి వద్దాం.

అటువంటి పరిపూర్ణ పురుషుడైన భీష్ముడు తన ఆఖరు క్షణాలలో పాండవులతో కలిసి తనను పరామర్శించడానికి వచ్చినపుడు, ఎంతో పారవశ్యంతో శ్రీకృష్ణుని స్తుతిస్తూ యుద్ధంలో జరిగిన ఒక సన్నివేశాన్ని నెమరు వేసుకుంటాడు. మామూలు సన్నివేశమా అది ! కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మొదటి రోజు ఏమీ విశేషం లేకుండానే గడిచిపోయింది. రెండో రోజు కొంచెం సేపు భీష్మార్జునులు తలపడ్డారు. మూడోరోజు భీష్ముని యుద్ధ పరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. సారధి అయిన కృష్ణుడిని కూడా ముప్పుతిప్పలుపెడుతున్నాడుఅర్జునుడు అలసిపోవడం కృష్ణుడు గమనించాడు. కేవలం అర్జునుని ఉత్సాహ పరచడానికే కాక, భీష్ముడూ తనకూ ఊపిరాడకుండా చేస్తున్నందున కృష్ణునికి నిజంగానే కోపం వచ్చింది. భీష్మద్రోణాదులనండర్నీ చంపి పారేస్తానని లేచాడు. రథం పగ్గాలు నొగలకు కట్టాడు. స్మరించగానే చక్రం చేతిలోకి వచ్చింది. రథం మీద నుంచి చెంగున దూకాడు. భీష్ముని చంపడానికి ముందుకు కాలు సారించాడు. మామూలు సైనికులందరూ దూకబోయే పులిని చూసిన లేళ్ళలాగా చెల్లా చెదరైనారు. కౌరవులందరూ నిలుగు గుడ్లేసుకుని చూస్తున్నారు. భీష్ముడు ఏమాత్రమూ తొట్రుపాటు లేకుండా , మిక్కిలి ప్రియంగా , రావయ్యా , వేగంగా వచ్చి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యవయ్యా అని వేడుకున్నాడట  పోతనగారి భీష్ముడు ఆ దృశ్యాన్ని ఒక్కసారి కనుల ముందుకు తెచ్చుకున్నాడు పైపద్యంలో.

నొగల మీదనుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండ లాన్నంతటినీ కప్పుకున్నదట. ఒక్కసారిగా ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో భూమి అదిరిపోయిందట. ఆయన భుజాల మీద వున్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. కృష్ణుని యొక్క ఈ ఊహింపని చర్యను చూసి అర్జునుడికి గొప్ప రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును (పాదాన్ని కాదు) పట్టుకుని నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ కాలుక్కరుచుకున్న అర్జునుణ్ణి పది అడుగుల దూరం లాక్కునిపోయాడు కృష్ణుడు. అర్జునుడు రోషంతోనూ , తన చాలిమిని ఎత్తి చూపినందువల్ల కలిగిన అవమానంతోనూ , నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘీంచే సింహంలా ఉరకలు వేస్తూ ‘ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను , నన్ను ఒదిలిపెట్టు అర్జునా అని అంటూ’ ముందుకొస్తున్న ఆ మహానుభావుడు నా బాణాల దెబ్బకు వడలి , ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు నాకు దిక్కగుగాక ! అని స్తుతించిన సందర్భం లోనిది ఈపై పద్యం. ఒక గొప్ప సన్నివేశానికి ఎంతో చక్కని రూపకల్పన ఈ పద్యం. పద్యం చదివిన, తలచుకున్న ప్రతివారికీ ఆ కుండలాల కాంతీ, ఆ చేలాంచలం జారడం లోని సొగసూ , ఆ చక్రమూ, కాలుక్కరచుకున్న అర్జునుడూ , అతన్ని లాగుతూ ముందుకు వస్తున్న కృష్ణుడు , ఈ గొప్ప సందర్భాన్ని చిరునవ్వుతో , పారవశ్యంతో చూస్తూ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్న భీష్ముడు – ఇవన్ని కండ్లలో మెదలక మానవు. అంత గొప్ప పద్యమిది , ఎవరికి నచ్చదు !

ఇంకొక చిత్రం ఉన్నది ఈ సందర్భంలో. అంపశయ్య మీద ఉన్న భీష్ముని దగ్గరకు పాండవులూ , కృష్ణుడూ వచ్చినప్పుడు ఇతరులకు మామూలుగా కనిపించిన కృష్ణుడు భీష్మునికి మాత్రం , “సర్వేశ్వరుండఖిల దేవోత్తంసుడెవ్వేళ ప్రాణంబు లేను విడుతు నందాక నిదె మంధాసుడై , వికసిత వదనార విందుడై వచ్చి నేడు నాల్గు భుజములు కమలాభనయన యుగము నొప్ప కన్నుల ముందటనున్నవాడు, మానవేశ్వర నా భాగ్యమహిమ జూడు మేమి జేసితినొ పుణ్యమితని గూర్చి” అని అంటాడు. ఆ మహాత్ముని కంటే ధన్యులెవరుంటారు చెప్పండి.

భీష్మ ప్రతిజ్ఞ

గంగాదేవి తనను వీడి వెళ్ళినప్పటినుండి శంతన మహారాజు వైరాగ్యంతో ఉన్నాడు. కాని ఒక రోజు యమునాతీరానికి వాహ్యాళికని వెళ్ళి అక్కడ జగన్మోహినినా ఉన్న ఓ అమ్మాయిని చూసి ఆ పిల్లను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు.తనను పెళ్ళి చేసుకోమని ఆ అమ్మాయిని అడిగాడు. " నా తండ్రి దాశరాజు. బెస్త్ల్లందరికీ నాయకడు. మీరు ఆయనతో మాట్లాడి ఆయన అనుమతి తీసుకోండి. అది మీకూ నాకూ మంచిది " అని బదులు చెప్పిందాపిల్ల. శంతనుడు వెళ్ళి దాశరాజును కలిశాడు. ఆయన నవ్వుతూ " మా అమ్మాయిని మీ చేతుల్ల్లో పెడతాను కాని నా కూతురి వల్ల మీకు కలగబోయే పిల్లవాడే మీ తరువాత రాజు కావాలి " అన్నాడు. శంతనుడు ఒప్పుకోలేదు. దేవవ్రతుణ్ణి తోసేసి మరొకరికి పట్టాభిషేకం చేయడం కుదరదన్నాడు.

అయితే ఈ పెళ్ళే జరగదన్నాడు దాశరాజు.

దిగులుతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు శంతనుడు. దేవవ్రతుడు తండ్రి మనసులోని విచారాన్ని ఆయన రధసారధి ద్వారా తెలుసుకొని వెంటనే దాశరాజు దగ్గరకు వెళ్ళి " నీ కూతురుకు పుట్టబోయే బిడ్డే రాజవుతాడు. నాకు రాజ్యం అక్కర్లేదు. నా పట్టాభిషేకాన్ని ఇప్పుడే పరిత్యాగం చేస్తున్నాను " అని శపధం చేశాడు. అయినా దాశరాజు భయం పోలేదు. దేవవ్రతుడు కాకపోయినా అతని సంతతివారెవరైనా ముందు ముందు అవరోధాలు కలిగించవచ్చు కదా అని సందేహించాడు. దేవవ్రతుడు అది గ్రహించి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు. దీనినే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. అప్పుడాపల్లెరాజు సంతోషించి తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్ళిచేసాడు. ఆ అమ్మాయి పేరు సత్యవతి.

శంతనుని వల్ల ఆమెకు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు.

అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ సాయి సంకల్పం

అందరికీ దర్శనభాగ్యం కలగాలి , ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " సంభవామి యుగే యుగే "ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.

అందరం భక్తితో " ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼

Post a Comment

0 Comments