వీధి బాలలకు దిక్కేది...? నేడు అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం
యం.రాం ప్రదీప్
జేవివి, తిరువూరు
9492712836
కరోనా కాలంలో అనేక మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు.యూనిసెఫ్ అంచనా ప్రకారం దేశ వ్యాప్తంగా సుమారు 4కోట్ల మంది వీధి బాలలు ఉన్నారని అంచనా.దేశ రాజధాని ఢిల్లీలో నే 70 వేల మంది వీధి బాలలు ఉన్నారని అంచనా.వీరిలో కొంతమందికి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, వివిధ ఆర్ధిక, సామాజిక పరిస్థితుల కారణంగా వీధి బాలలుగా మారుతున్నారు.
సాధారణంగా ఏప్రిల్ 12న అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం జరుపుతారు. కానీ ఆస్ట్రియా దేశానికి చెందిన జుజెండ్ అయిన్ వెల్ట్ అనే సంస్థ 2009 జనవరి 31న అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవాన్ని నిర్వహించింది.వీధి బాలలను రక్షించేందుకు విద్యావంతులు, యువకులు ముందుకు రావాలని ఈ సంస్థ పిలుపు నిచ్చింది.
రోడ్లపై బతుకులు వెళ్ళదీస్తున్న పిల్లల్ని గణించి సహాయ సహకారాలు అందించేందుకు విద్య, వైద్య, పోలీసు, రెవెన్యూ, సాంఘీక సంక్షేమం, శిశు అభివృద్ధి వంటి వివిధ శాఖల సేవల వినియోగం అత్యంత కీలకమైంది. బాలల హక్కుల పరిరక్షణ సంస్థలు, పాఠశాల విద్యార్ధుల తల్లిదండ్రుల సంఘాలు, ఉపాధ్యాయ, యువజన సంఘాల సేవల్ని ఊరూవాడా పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా వీధి బాలలను రక్షించవచ్చు.
సమగ్ర శిశు అభివృద్ధి పధకంలో తగినన్ని మార్పుచేర్పులు చేయడం ద్వారా, వీధి బాలల సంఖ్య అధికంగా ఉన్న చోట్ల వెంటనే అంగన్ వాడీ కేంద్రాల వంటివి ప్రారంభించాల్సి ఉంటుంది. పేద కుటుంబాల పిల్లలే ఇళ్ళను వదిలివచ్చి వీధి బాలలుగా మారతారన్న దురభిప్రాయం నేటికీ అనేకమందిలో ఉంది. ఇంట్లో చదువు సంబంధమైన ఒత్తిళ్ళు తట్టుకోలేక, పలువిధాలయిన గృహహింసను భరించలేక, స్నేహాల ప్రభావం వలన కూడా వీధుల్లోకి వచ్చి ఉంటున్నవారు చాలా మంది ఉన్నారు. సమస్యకు మూలాలను గుర్తించిన కొన్ని ప్రభుత్వాలు, నివారణ చర్యలు చేపట్టి ముందుకు సాగుతున్నాయి. పిల్లల్లో ముందుగా విద్యావికాసాల విస్తరణకు మునుపెన్నడూ లేని స్థాయిలో నడుంకట్టిన బ్రిటన్ వీధి బాలల దత్తన విధానాన్ని పెద్దయెత్తున పునర్ వ్యవస్థీకరించి, విస్తృతపరచి, ముమ్మరంగా అమలు చేస్తోంది. ఈ సంస్కరణలు ప్రైవేటు సంస్థలతో నిరంతర భాగస్వామ్యం వల్ల తప్పక ఫలిస్తాయంటోంది. భారీగా నిధులు ఎలా సమీకరిస్తాయన్న ప్రశ్నకు వదాన్య సంపన్నులు, నిస్వార్ధ సేవాతత్పరుల అండదండలతో ఏదైనా సాధ్యమేనని అక్కడి ప్రభుత్వం బదులిస్తోంది. వీధి బాలల సమస్యకు పరిష్కారం ముఖ్యంగా ఆ ప్రాంతీయ ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుందని నమ్మిన ఫ్రాన్స్, క్షేత్రస్థాయి ప్రణాళికల్ని ప్రోత్సహిస్తోంది. విద్యాప్రచారకులు, సంఘసేవకులు, ఉద్యోగ విరమణ చేసినవారి స్వచ్చంద సహకారంతో ప్రాంతాల వారీగా జనచైతన్య శిబిరాలను ఏర్పాటుచేస్తోంది. 1993 వరకు దేశవ్యాప్తంగా అదే పరిస్థితి ఉండేది. అనంతరం మార్పు వచ్చిందంటే, అది ఆయా ప్రభుత్వేతర సామాజిక సేవాసంస్థల అలుపెరుగని పోరు వల్లనే! శాశ్వత శాంతిని కోరుకొనే ఏ దేశమైనా, దాన్ని సాధించే పనిని బాలలతోనే మొదలు పెట్టాలనేవారు జాతిపిత గాంధీజీ. ఆ ప్రయత్నం మూడు అడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి అన్నట్లు సాగడం వల్లనే, ఇతర దేశాలతో పాటు భారత్ ఇప్పటికీ వీధి బాలల సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. పేదరికం, నిరక్షరాస్యత వంటి అత్యంత ప్రధాన అంశాలతో ముడివడింది ఇది.
వీధి బాలల బతుకుదెరువు, భద్రత, సామాజిక ఎదుగుదల, వారిలో దాగి ఉన్న, సృజనాత్మకత వెలికితీతకు పౌరసమాజం చేయాల్సిందీ చాలా ఉన్నది. బాలల రక్షణకు విధివిధానాల రూపకల్పనలో నిస్వార్ధ సేవాసంస్థల తోడ్పాటు, క్షేత్రస్థాయి నుంచి పనులకు అనువుగా ఎటువంటి లోటూ లేకుండా బడ్జెట్ నిధుల సమధిక కేటాయింపులు అన్నింటికంటే ముఖ్యమైనవి. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తగినన్ని విద్యావకాశాలు కల్పిస్తే, వ్యక్తిత్వ వికాస నిపుణులతో శిక్షణ నిర్వహింపజేస్తే, అంతకు మించిన సేవ మరొకటి ఉండదు.
పశ్చిమ ఢిల్లీలో 2017 -18మధ్య కాలంలో 511 మంది చిన్నారులను ‘చేతన’ చేరదీసింది. వారందరూ బిక్షాటన చేస్తూ, టీ స్టాళ్లు, రోడ్డు సైడ్ హోటళ్లలో పనిచేస్తూ.. దుర్భర జీవితం గడిపారు. చేతన కృషితో వారిలో చాలా మందికి మంచి కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే మహదవకాశం లభించింది. ఆ చిన్నారుల బాధ్యత తీసుకోడానికి అనేక మంది మానవతావాదులు ముందుకొచ్చారు.
తమ చిన్నారులు ఇంగ్లిష్‌లో గలగలా మాట్లాడుతుంటే.. చదువుసంధ్యల్లో రాణిస్తుంటే ఆ పేద తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ పిల్లల విజయం మరింత మందిలో ఉత్సాహాన్ని నింపుతోంది.ఇటువంటి సంఘటలను స్ఫూర్తిగా తీసుకుని మనమంతా వీధి బాలలను రక్షించే ప్రయత్నం చేయాలి.
0 Comments