GET MORE DETAILS

కాశీనాధుని విశ్వనాధ్ (శ్రద్ధాంజలి)

కాశీనాధుని విశ్వనాధ్ (శ్రద్ధాంజలి)



శంకరాభరణం సినిమాలో చివరి పాట. సోమయాజులు చనిపోయే సీన్‌లో వచ్చే పాట అది. ఆ సీన్‌ గురించి వివరించి, వేటూరి సుందరరామ్మూర్తిని పాట రాయాల్సిందిగా కె.విశ్వనాథ్‌ చెప్పారు.

అది.. పోయేవాడు పాడేదేనండీ..!

శంకరాభరణం సినిమాలో చివరి పాట. సోమయాజులు చనిపోయే సీన్‌లో వచ్చే పాట అది. ఆ సీన్‌ గురించి వివరించి, వేటూరి సుందరరామ్మూర్తిని పాట రాయాల్సిందిగా కె.విశ్వనాథ్‌ చెప్పారు. సినిమాకు ప్రాణం లాంటి ఆ అద్భుత సీన్‌ అత్యద్భుతంగా వివరించడంతో.. వేటూరి అంతకంటే బ్రహ్మాండంగా పాటను రాశారు. దొరకునా ఇటువంటి సేవ అంటూ త్యాగరాజ కృతి మొదటి లైన్‌తో సాగే ఆ పాటలో రెండో లైను.. ‘నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ’.. అని వేటూరి రాశారు. అది చూసిన ఆత్రేయ.. ‘అంత పొడవున రాశారు. దాన్ని పాడేవాడు చచ్చిపోతాడు’ అని అంటే.. వేటూరి స్పందిస్తూ.. సినిమాలో ఈ పాట ‘పోయేవాడు పాడే పాటేనండి’ అని సందర్భోచితంగా బదులిచ్చారు. అనంతరం ఆ పాట పాడిన బాలు.. ‘మీరేమో పాడేవాడు పోతాడన్నారు. ఆయనేమో అది పోయేవాడు పాడే పాటేనన్నారు. చివరికి ఆ పాట పాడిన నాకు ప్రాణం పోయినంత పనైంది’ అని సరదా గా అన్నారు

దర్శకుడు అంటే దార్శనికుడు! విడుదలయ్యాక ప్రపంచమంతా వెండితెరపై వీక్షించే చిత్రాన్ని ముందుగా తన తలపుల్లోనే వీక్షించే స్రష్ట.. అందరినీ అలరించే చిత్రాలను సృష్టించే ద్రష్ట!! ఆ విద్యలో కె.విశ్వనాథ్‌ ఎవరెస్ట్‌. ఒకటి, రెండు అని చెప్పుకోవడం ఎందుకు.. ఆయన సినిమాలన్నీ ఆణిముత్యాలే. వాటిలోనూ.. చరిత్రలో నిలిచిపోయే మేలిముత్యాల్లాంటి సీన్లు ఎన్నో ఎన్నెన్నో!! ఏరుకోగలిగినవారికి ఏరుకున్నంత!! మచ్చుకు కొన్ని.

సాగరసంగమం

ఆలిండియా డాన్స్‌ ఫెస్టివల్స్‌ ఇన్విటేషన్‌లో తన పేరు చూసి బాలు (కమల్‌హాసన్‌) భావోద్వేగానికి గురయ్యే సీన్‌

ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు పాల్గొనే ఆ పోటీల్లో.. ప్రధాని స్థాయి వ్యక్తులు కూడా ప్రేక్షకులుగా హాజరయ్యే ఆ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వాలంటే అదృష్టం ఉండాలంటాడు కమల్‌. తనకు గతంలో ఒకసారి ఆ ప్రదర్శన చూసేందుకు ఇన్విటేషన్‌ వచ్చినా.. డబ్బుల్లేక వెళ్లలేకపోయినట్టు చెబుతాడు. అప్పుడు.. ఈసారి ఫెస్టివల్‌కి తన దగ్గర ఇన్విటేషన్‌ ఉన్నట్టు చెబుతుంది జయప్రద. ఆమె దగ్గర ఉన్న ఇన్విటేషన్‌ తీసుకుని.. ఒక్కొక్క పేజీ తిప్పుతూ.. ‘ఈసారి అందరూ పెద్దవాళ్లేనండీ’ అంటూ వారిని కీర్తిస్తుంటాడు కమల్‌. ఆ ఆహ్వాన పత్రిక చివరిపేజీలో ‘క్లాసికల్‌ డాన్సర్‌’గా తన పేరు చూసి.. ఆనందంతో, ఆశ్చర్యంతో, దుఃఖంతో.. కమల్‌హాసన్‌ గుండె గొంతులోకి వస్తుంది! వెంటనే జయప్రద చేతిని పట్టుకుని.. ఏడవటం ప్రారంభిస్తాడు. ఏమిటి చిన్నపిల్లాడిలాగా.. అంటూ జయప్రద ఊరడిస్తుంటుంది. ఈ సీన్‌లో కెమెరా రన్‌ అవుతుండగానే విశ్వనాథ్‌కు ఒక ఆలోచన వచ్చింది. అప్పటికే అద్భుతంగా నటిస్తున్న కమల్‌హాసన్‌ను ఉద్దేశించి.. ఏడుపులో ఆనందాన్ని కూడా మిళితం చేయాల్సిందిగా సూచించారు. ఆయన సూచన విన్న కమల్‌హాసన్‌.. తల కూడా తిప్పకుండానే ఆయన మనసులో మాటను అర్థం చేసుకుని తన ఏడుపును నవ్వుగా మారుస్తూ నవ్వుతూ.. నవ్వుతూనే ఏడుస్తూ.. సీన్‌ను ఎవరూ ఊహించనంత గొప్పగా పండించారు! అందుకే.. తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయే అద్భుత సన్నివేశాల్లో అది ఒకటిగా నిలిచిపోయింది. కమల్‌హాసన్‌కు కూడా నటుడుగా ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సన్నివేశంగా మిగిలిపోయింది.

క్లైమాక్స్‌లో నటరాజపాదాల తలవాల్చనా అంటూ శైలజ నర్తిస్తుండగా కమల్‌హాసన్‌ మరణించే సీన్‌.

తన నాట్యాన్ని విమర్శిస్తూ వ్యాసం రాసిన కమల్‌హాసన్‌నే తన గురువుగా పెట్టాలన్న తల్లి జయప్రదపై కోపం పెంచుకుంటుంది శైలజ. కానీ, క్రమంగా వారిద్దరి మధ్య ఉన్న అమలిన బంఽధం గురించి తెలుసుకుని పశ్చాత్తాపపడుతుంది. కథ క్లైమాక్స్‌కు చేరుతుంది. కమల్‌ను గురువుగా భావించి.. ‘ఆచార్య దేవోభవ’ అంటూ పాదాలకు నమస్కరించి.. ‘నటరాజ పాదాన తలవాల్చనా.. నయనాభిషేకాన తరియించనా’ అని పాట పాడుతూ నృత్యం చేస్తుంది! శైలజ దృష్టిలో నటరాజు.. తన గురువైన కమల్‌హాసన్‌. ఆమె నృత్యం చేస్తుండగానే.. కమల్‌ తానెంతగానో అభిమానించే నటరాజు పాదాల చెంతకు వె..ళ్లి..పో..తా..డు. నాట్య ప్రదర్శన జరుగుతుండగానే కన్నుమూసిన తన స్నేహితుణ్ని వీల్‌చెయిర్‌లో అలాగే కూర్చోబెట్టుకుని బయటకు వెళ్లిపోతాడు శరత్‌బాబు! నాట్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆ కళాకారుడి మృతితో.. ఆకాశం రోదిస్తోందా అన్నట్టు వర్షం కురవడం మొదలవుతుంది. వాన కమల్‌ హాసన్‌పై పడకుండా ముందుకు వంగి రెండు చేతులు అడ్డంపెడతాడు శరత్‌ బాబు. వెనగ్గా వచ్చిన జయప్రద.. గొడుగు పడుతుంది! ఒక్క మాట కూడా లేని ఆ సన్నివేశంలో ఉన్న ఆర్ద్రతను వర్ణించడానికి మాటలు సరిపోవు.

శంకరాభరణం

‘దొరకునా ఇటువంటి సేవ’ పాట చివరలో సోమయాజులు మరణించే సన్నివేశం.

కొడిగడుతున్న శాస్త్రీయ సంగీత ప్రభను తలచుకుని బాధపడే సంగీత కళాకారుడు శంకరశాస్త్రి (సోమయాజులు).. ఓ విధివంచితకు ఆశ్రయమివ్వడంతో సమాజం అనుమానిస్తుంది. దీంతో ఆమె ఆయన్నుంచి దూరంగా వెళ్లిపోయి.. మళ్లీ తన కొడుకుతో తిరిగొచ్చి ఆయన దగ్గర చేరుస్తుంది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటాడా చిన్నారి! చివర్లో ఆమె ఆయన సంగీత ప్రదర్శనను ఏర్పాటు చేస్తుంది. శుష్కించిపోతున్న సంప్రదాయాన్ని బతికించే ఆ దాతకు నమస్కరిస్తూ.. ‘దొరకునా ఇటువంటి సేవ..’ అంటూ పాడడం మొదలుపెడతాడు సోమయాజులు. దగ్గుతో పాట పాడలేకపోతుంటే ఆ చిన్నారి అందుకుంటాడు. శుష్కించిపోతున్న శాస్త్రీయ సంగీతమనే జీవకళను ఆయన్నంచి ఆ బాలుడు అందిపుచ్చుకున్నట్టు సింబాలిగ్గా చూపిస్తాడు దర్శకుడు! అంతేకాదు.. ఆ అబ్బాయి ‘దొరకునా ఇటువంటి సేవ..’ అని శంకరశాస్త్రిని ఉద్దేశించి పాడుతూ ఆయన పాదాలకు నమస్కారం చేశాక ప్రేమగా ఆలింగనం చేసుకుని నుదుటన ముద్దుపెట్టి.. ఆ చిన్నారి పాదానికి తన గండపెండేరం తీసి తొడుగుతాడు. పిల్లవాడి ముఖాన్ని రెండు చేతులతో ఆర్ద్రంగా తడుముతూ.. ఆనందాశ్రువులు రాలుస్తూ.. కన్నుమూస్తాడు!

శ్రుతిలయలు

ప్రాపంచిక సుఖాల మోజులో దారితప్పిన ఓ సంగీత కళాకారుడు.. తనను మళ్లీ కళ వైపు మళ్లించిన భార్యలో తల్లిని చూసి చేతులు జోడించే సీన్‌.

భార్య గురించి చెప్పాల్సివచ్చినప్పుడు ‘కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాతా..’ అని చెబుతుంటారు. ఇందులో మిగతావాటి మాటెలా ఉన్నా.. భార్యలో తల్లిని చూపించడం కష్టం. కానీ, ‘శ్రుతిలయలు’ సినిమా క్లైమాక్స్‌లో దాన్ని అద్భుతంగా చూపించారు విశ్వనాథ్‌. ఆ సినిమాలో రాజశేఖర్‌ మంచి సంగీత కళాకారుడు. డబ్బు, అది అందించే సుఖాలకు బానిసై సంగీతానికి దూరమవుతాడు. రాజశేఖర్‌ భార్య సుమలత.. దారి తప్పిన తన భర్తను కుమారుడు షణ్ముఖ శ్రీనివాస్‌ సాయంతో మార్చుకుంటుంది. సంగీత, నాట్యాలతో తనను మెప్పించిన చిన్నారి షణ్ముఖశ్రీనివాస్‌ తన కుమారుడేనని రాజశేఖర్‌ చివర్లో తెలుసుకుంటాడు. ఆ సమయంలో వచ్చే పాటలో.. ‘మమతానురాగాల కల్పతరువై మంచిచెడు నేర్పించు మొదటి గురువై ముక్కోటి వేల్పులను ఒక్కరూపున జూపు మాతృపదపద్మములకిదె వందనం’ అంటూ చేతులు జోడించి భార్యకు దణ్నం పెడతాడు. ఆ సన్నివేశంలో ఆ పాట షణ్ముఖశ్రీనివాస్‌ను ఉద్దేశించి పాడిందే అయినా.. రాజశేఖర్‌ కూడా తనను దారిలో పెట్టిన మాతృమూర్తిగా భార్యను తలిచే తీరు చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయంటే అతిశయోక్తి కాదు!!

కళాతపస్వి సినిమాలు. వెండితెరపై సిరివెన్నెలలు

అచ్చమైన తెలుగుదనానికి అందమైన చిరునామా కాశీనాథుని విశ్వనాథ్‌ సినిమా. అనేక కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన కళాతపస్వి ఆయన. హీరోని గుడ్డివానిగా, హీరోయిన్‌ మూగ అమ్మాయిగా సినిమా (సిరివెన్నెల) తీసి ఒప్పించి విజయం సాధించడం ఆయనకే చెల్లింది. వరకట్న సమస్యపై ‘శుభలేఖ’, కుల వ్యవస్థపై ‘సప్తపది’, గంగిరెద్దువాళ్ల జీవితాలపై ‘సూత్రధారులు’ చిత్రాలను మలిచారు. ఇంకా సిరి సిరి మువ్వ, శ్రుతిలయలు, స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభలేఖ, శుభోదయం, శుభ సంకల్పం వంటి కళాత్మక సినిమాలు ఆయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఆణిముత్యాల్లాంటి ఆయన సినిమాల్లో కొన్నింటి విశేషాలు.

ఓ సీత కథ (1974) : ఈ చిత్ర కథాంశం అప్పట్లో ఓ సంచలనం. తాను ప్రేమించిన ఓ అమ్మాయి తనకు దక్కలేదనే కోపంతో ఆమె ప్రేమిస్తున్న వాడిని చంపిస్తాడు విలన్‌. తాను ప్రేమించినవాడి హఠాన్మరణానికి కారకుడైనవాడికి బుద్ధి వచ్చేలా చేయాలని ఆ అమ్మాయి విలన్‌ తండ్రిని పెళ్లి చేసుకుంటుంది. వినడానికే చాలా కఠినంగా ఉన్న ఈ చిత్రాన్ని విశ్వనాథ్‌ అత్యద్భుతంగా తెరకెక్కించారు. తాను కోరుకున్న అమ్మాయి.. తనకు తల్లిగా ఇంటికి వచ్చినప్పుడు ఆ విలన్‌ పడే వ్యధను తెరకెక్కించిన విధానం ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.

సిరిసిరిమువ్వ (1976) : సంగీత నృత్య ప్రధాన సినిమా. నాట్యమంటే ఎనలేని మక్కువ ఉన్న హైమ (జయప్రద) అనే ఓ పల్లెటూరి మూగపిల్ల కథ. ఆమెను సవతి తల్లి కష్టాల నుంచి కాపాడి పట్టణం తీసుకెళ్లి మంచి నర్తకిగా పేరు తెచ్చుకునేందుకు సాయపడే సాంబయ్య పాత్రలో చంద్రమోహన్‌ నటించారు. వీరిద్దరి నటన ఇప్పటికీ, ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి, కనిపిస్తాయి. ఈ చిత్రానికి వేటూరి సుందరామ్మూర్తి రాసిన పాటలు ప్రత్యేక ఆకర్షణ. ‘ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం’ పాట సూపర్‌ హిట్‌. ఈ సినిమాను హిందీలో ‘సర్‌గమ్‌’గా పునర్నిర్మించారు. హిందీలో కూడా కథానాయికగా జయప్రద నటించారు. ఆమె బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి ఈ సినిమా మార్గం సుగమం చేసింది.

శుభలేఖ (1982) : అప్పటికి నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న చాలామంది యువతకు ఓ మార్గం చూపించిన సినిమా ఇది. టాలెంట్‌ ఉండాలే కానీ ఎలాంటి ఉద్యోగమైనా చేయొచ్చు అని చిరంజీవి పాత్ర ద్వారా తెలియజేశాడు విశ్వనాథ్‌. అలాగే స్వచ్ఛమైన ప్రేమ ముందు కులం, జాతి, ఐశ్వర్యం అనేవి అడ్డంకి కాదని మరోసారి తెలియజేశారు. ఈ చిత్రంలో చిరంజీవి నటనకు ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డ్‌ రావడం విశేషం. ఈ సినిమాతో నటుడు సుధాకర్‌ ఇంటిపేరు ‘శుభలేఖ’గా మారింది.

సిరివెన్నెల (1986) : గేయ రచయిత సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గా మార్చిన చిత్రమిది. హీరో అంధుడు, అతడ్ని ఇష్టపడే అమ్మాయి మూగ. వీరిద్దరి ప్రేమకు మధ్యలో ఓ గైడ్‌. ఒక అద్భుతమైన ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఇది. సినిమా ఎండింగ్‌ చూసి కన్నీరు పెట్టని ప్రేక్షకుడు ఉండడు.

శ్రుతిలయలు (1987) : మన మూలాలను ఎప్పటికీ మరువకూడదు అనే బేసిక్‌ లైన్‌తో తెరకెక్కిన అద్భుతమైన చిత్రమిది. అప్పటివరకూ యాంగ్రీ యంగ్‌ మేన్‌ గా జనాలని అలరిస్తున్న రాజశేఖర్‌ సాఫ్ట్‌ రోల్స్‌ కూడా ప్లే చేయగలడు అని ప్రూవ్‌ చేసిన సినిమా ఇది. సుమలత పాత్రను అంత సహజంగా ఎలా రాయగలిగారో తెలియదు కానీ.. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కు సరైన ఉదాహరణ ఆమె పాత్ర.

స్వయంకృషి (1987) : అప్పటికే కిరాతకుడు, కొండవీటిరాజా, వేట, చంటబ్బాయి, పసివాడి ప్రాణం లాంటి సినిమాల్లో నటించి సూపర్‌ మాస్‌ ఇమేజ్‌ సొంతం చేసుకోవడమే కాక మెగాస్టార్‌గా చిరంజీవి ఎదుగుతున్న తరుణమది. ఆ సమయంలో చెప్పులు కుట్టే వ్యక్తిగా నటించడం అంటే సాహసమే. చిరంజీవి రిస్క్‌ చేసి మరీ నటించిన చిత్రమిది. ఒక చెప్పులు కుట్టే వ్యక్తి స్వయంకృషితో అందలాన్ని అధిరోహించడమే కథాంశం. అలాగే పిల్లలకి బాధ్యత తెలియకుండా పెంచడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయనేది కూడా ఈ చిత్రంలో చూపించారు విశ్వనాథ్.

Post a Comment

0 Comments