GET MORE DETAILS

సందేహాలు - సమాధానాలు

సందేహాలు - సమాధానాలుసందేహం : గీసుకోవడం రోజూ చేయవచ్చా? క్షురకర్మ ఏఏ దినాల్లో చేయాలి? 

సమాధానం : ఈ రోజుల్లో మీకీ సందేహం కలగడం సంతోషమే. ఆచారాల్లో అంతరార్థాలు చాలా ఉంటాయి. ఒక రోజును తిథి దేవతలు, నక్షత్ర దేవతలు, గ్రహ దేవతలు పాలిస్తుంటారు. ఆయా దేవతలకు కొన్ని ప్రీతికర కర్మలు, కొన్ని అనిష్ట కర్మలు ఉంటాయి. వాటిని గమనించిన సూక్ష్మదర్శన శక్తిగల ఋషులీ ధర్మశాస్త్రాల ద్వారా అనేక ఆచారాలను అందజేశారు. 

క్షౌరంభూతే రతం ధర్మే

వర్ణయేచ్ఛ జిజీవిషుః ॥

క్షౌరం నకుర్యాదభక్త

భుక్తస్నాత విభూషితాః ॥

ప్రయాణ సమరారంభే

న రాత్రౌ నచ సంధ్యయోః ॥

శ్రాద్ధాహే ప్రతిపద్రిక్తా

వ్రతాహ్ని చ నవైధృతౌ ॥

వంటి నియమాలు ధర్మశాస్త్రాల్లో చెప్పారు. అన్నిటినీ పరిశీలిస్తే ఇవే ఆ నియమాలు: 

జన్మతిథి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, చవితి, షష్ఠి తిథులలో క్షౌరం కూడదు. ప్రయాణ దినాన, యుద్ధారంభాన, రాత్రిపూట, సంధ్యాసమయాలలోనూ, శ్రాద్ధ దినాలలోనూ, పాడ్యమి, శూన్యతిథులు, వ్రత దినాలలో క్షౌరం (క్షురకర్మ) పనికి రాదు. శుక్ర, మంగళవారాలు కూడా. అయితే కొన్ని కర్మలకు క్షురకర్మ చేసుకుంటేగానీ పనికిరాదు-అప్పుడు తిథి వారాలను చూడరాదు. యజ్ఞం, ప్రేతకర్మ-మొదలైన వేళల్లో క్షౌరం, ముండపం చేయవలసిందే. తండ్రి గలవారు తరచుగా ముండనం (గుండు గీయించుకోవడం) చేసుకోరాదు.

రాజకార్య నియుక్తానాం

నరాణాం భూపజీవినాం ।

శ్ముశ్రులోమనఖచ్ఛేదే

నాస్తికాల విశోధనమ్ ||

రాజకార్యంలో పనిచేసేవాడు, రాజు (ప్రభుత్వం) వద్ద పనిచేసి పోషింపబడేవాడు - శ్ముశ్రుకర్మ (గెడ్డం గీసుకోవడం), గోళ్ళు తీసుకోవడం విషయంలో పెద్దగా కాల నియమం పాటించవలసిన పనిలేదు. ఇలా చాలా విషయాలు ఈ అంశంలో చెప్పినా, కొన్ని ప్రధానమైనవి ఇక్కడ పేర్కొనడమయ్యింది. అయితే-ఎప్పుడు క్షురకర్మ, శ్మశ్రు కర్మ చేసుకున్నా - ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే, దానికి సంబంధించిన దోషాలు పరిహరింపబడతాయి. 

ఆనర్తో హిచ్ఛత్రః

ఆనర్తనో ఆహిచ్ఛత్రః

పాటలీపుత్రో, అదితిర్దితిః |

శ్రీశః క్షౌరౌ స్మరణాదేషాం

దోషాన్నశ్యంతి నిశ్శేషాః ।

"ఆనర్తదేశం, అహిచ్ఛత్రము (పాము గొడుగు), పాటలీపుత్రం, అదితి, దితి, విష్ణువు వీరిని క్షార (శ్మశ్రు) కాలంలో స్మరిస్తే సమస్త దోషాలు నశిస్తాయి". వేళాపాళా చూడకుండా క్షురకర్మాదులాచరిస్తే అరిష్ట శక్తులు ఆశ్రయిస్తాయి. అనాచారాలే వాటికి ఆశ్రయస్థానాలు.


సందేహం :  ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదంటారు. ఇక మిగిలిన దిక్కులు ఫరవాలేదా ? నిద్రకు కూడా నియమాలున్నాయా ?

సమాధానం :  మన స్మృతుల్లో నిద్రాసమయంలో, మేల్కొను  వేళలో కూడా నియమాలు చెప్పారు. ఎప్పుడూ ఉత్తరం వైపు తలపెట్టి  పడుకోకూడదు. స్వగృహంలో తూర్పు వైపు, మామగారి గృహంలో దక్షిణం వైపు,  ప్రవాసంలో పడమర వైపు తల పెట్టుకోవాలి... అని శాస్త్రం చెప్తున్న సదాచారం.

తడివస్త్రంతో నిద్రించరాదు. కాళ్లు కడుకుంటే, పొడిగా తుడుచుకొని నిద్రపోవాలి. తడి పాదాలతో నిద్రించరాదు. మోదుగ, మఱ్ఱి, నేరేడు, జువ్వి, రావి, మేడి - ఈ వృక్షాల కఱ్ఱతో చేసిన మంచంపై నిద్రించరాదు. జలమధ్యంలో, శత్రుమధ్యంలో, ధ్యానంలో నిద్రించరాదు. గోవులు, దేవతామూర్తులు, గురువులు వీరికి ఉన్నతంగా ఉన్న  స్థలంలో నిద్రించరాదు. ఏదైనా పదార్థాన్ని నోటిలో ఉంచుకొని  నిద్రించరాదు.


సందేహం : పాపానికి, పాతకానికి ఉన్న తేడా ఏమిటి ?

సమాధానం : పాపము అనారోగ్య రూపముగా బాధిస్తుంది. ఆ బాధను అనుభవిస్తే పాపం పోతుంది. పాపముతో పాటుగా పుణ్యం కూడా ఉంటే అనారోగ్యం ఉన్నప్పటికీ చేయవలసిన మంచి కార్యానికి ఆటంకం లేకుండా చేయగలుగుతాము. ఉదాహరణకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకున్న రోజు పాపం ఫలితంగా జ్వరం వచ్చినప్పటికీ, ఏ ఆటంకం లేకుండా వ్రతాన్ని పూర్తి చేయటం పుణ్యఫలితం. పాపం ఫలితంగా కష్టాలు, అడ్డంకులు వస్తాయే కానీ శరీరం పడిపోదు.

కానీ పాతకం ఫలితంగా శరీరం పడిపోతుంది.పంచ మహా పాతకాలు.. బ్రహ్మ హత్య, బంగారాన్ని దొంగిలించటం. కల్లు త్రాగటం , పరస్త్రీని వాన్చించటం, ఈ నాలుగు పాతకాలలో ఒకటి గాని,నాలుగు గాని చేసిన వారితో స్నేహం చేయటం లాంటివి చేస్తే పాతకం చుట్టుకుంటుంది. మరి తేరుకోవడం కష్టం. అందుకు జాగ్రత్త గా వుండాలి.


సందేహం :   కపిలగోవు  శ్రేష్టమైనది అంటారు. 'కపిల ' అంటే ఏమిటి? ఆ లక్షణాలను ఎలా గుర్తించాలి? ఒళ్ళంతా నల్లని రంగు ఉంటే కపిల గోవు అని గుర్తించాలా?

సమాధానం : ఆవులు ఏ రంగులో, ఏ రూపంలోనున్నా శ్రేష్టమైనవే. పూజ్యములే.

కపిల శబ్దానికి  - నలుపు అని ప్రధానార్థం. నల్లని గోవుల్ని కపిల గోవులు అంటారు. అవి మరింత శ్రేష్ఠములని శాస్త్రోక్తి.

 గోవు అమృతశక్తితో దివ్యలోకాలలో ఉద్భవించినది. తొలి గోమాత సురభి. ఆమె అంశలే  విశ్వములో గోవులుగా వ్యాపించాయి. ఒకసారి  కొన్ని  గోవులు హిమగిరి పరిసరాలలో సంచరిస్తుండగా, ఒక గోవు పాలను లేగ తాగుతున్నది. ఆ సమయంలో పొదుగునుండి స్రవిస్తున్న పాలనురగ గాలికి చింది, సమీపంలో తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరునిపై పడింది. దానితో కన్నులు తెరిచిన ధూర్జటి పాలనేత్రం నుండి ఎగసిన సెగ తగిలి అక్కడి గోవులు నలుపెక్కాయి. అవి శివుని శరణు వేడి ప్రార్థించాయి. శివదృష్టి శక్తిని పొందడం చేత ఆ గోవులకు  ప్రత్యేక  శ్రేష్ఠత లభించింది. శివుడు వాటికి ప్రత్యేక పూజ్యతను వరంగా అందించాడు.

కపిలగోవు శరీరమంతా నలుపు రంగుతో ఉండనవసరం లేదు. చెవులు, కొమ్ములు, కన్నులు, గిట్టలు,  నాసికా పుటములు,  గొంతు,  ముష్కములు కపిలవర్ణంతో ఉన్నా కపిలత్వ గుణానికి చాలు. ముఖ్యంగా మూపురం,  గంగడోలు ఉన్న భారతీయ గోసంతతి  - మన శాస్త్రాల్లో వర్ణించిన ఉత్తమ గోవులుగా నిర్ణయింపబడుతున్నాయి.


సందేహం : స్తోత్ర పారాయణం లో తప్పులు పలకడం అంటే ఉచ్చారణ దోషం ఉంటే ఏమవుతుంది ?

సమాధానం : కెనడా దేశంలో జరిగిన ఒక పరిశోధనలో సహస్రనామస్తోత్రం పఠిస్తూ ఉంటే ఆ ప్రకంపనల నుండి కాంతి రేఖలు ఉత్పన్నమయ్యాయి. అక్కడున్న భారతీయ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు దానికి సంబంధించిన ఒకానొక యంత్రాన్ని(టోనోస్కోపీ)

కంప్యూటరుకి జతపర్చి సహస్రనామస్తోత్రాన్ని పఠించారు. ఆ శబ్దప్రకంపనలు కాంతిరేఖలుగా తీసుకున్న ఆ యంత్రం ద్వారా మొత్తం లలితాసహస్రనామాన్ని పఠించగా కాంతిరేఖారూపం 'శ్రీచక్రం'గా రూపొందింది. సహస్రనామస్తోత్రం పఠిస్తూ ఉంటే మనకు తెలియకుండా శ్రీచక్రం తయారవుతుంది. శబ్దప్రకంపనలో తేడా వస్తే కాంతిరేఖ సరిగ్గా రాదు. రాను రాను విజ్ఞానశాస్త్రం పెరుగుతున్నకొద్దీ భారతీయ ఋషులు ఇచ్చిన ఆధ్యాత్మిక విజ్ఞానమే గొప్ప విజ్ఞానం అని ఋజువు అవుతోంది. ఇది మనం ఆనందించవలసిన, గర్వించవలసిన ప్రధానమైన అంశం. లలితాసహస్రనామస్తోత్రం ఉచ్చారణలో వచ్చే ప్రకంపనాలలో అద్భుతమైన దేవతామూర్తులు, దేవతాచైతన్యాలు, యంత్రవిజ్ఞానాలు అన్నీ ఉన్నాయి. ఉచ్చారణ చాలా అవసరం. అప్పుడే మనం అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలము .అంతేకాక అర్థస్ఫురణతో చదివినపుడే నిజమైన పారాయణ అవుతుంది.

అయితే అర్థం తెలియదు అని చదవడం మొత్తంగా మానివేయరాదు. దానికి తగ్గ ఫలితం దానికి ఉంటుంది. ప్రామాణిక మైనవాటి నుండి చదవడం నేర్చుకోవాలి.

జిజ్ఞాసువులకు చిన్న సమాచారం :

తప్పులు లేకుండా చదవాలి అంటే ముందుగా తప్పులు లేని పుస్తకం కావాలి అది మనకు మన గురువైన సామవేదం షణ్ముఖ శర్మ గారి ఋషిపీఠం ద్వారా పాకెట్ బుక్కు రూపంలో లభ్యమవుతుంది.


సందేహం : విష్ణు భార్య అయిన భూదేవి పుత్రిక సీతాదేవిని ,విష్ణు అవతారమైన శ్రీ రాముడు వివాహమాడాడు . ఈ వరస ఎబ్బెట్టుగా లేదా ?

సమాధానం : శ్రీ మహావిష్ణువు మానవుడు కాదు . విశ్వవ్యాపకమైన చైతన్యం . ఆయన ఈ పృధివిని భరించి తన శక్తితో దీనిని పాలించడం చేత భూమిని విష్ణు పత్ని అన్నారు . దేవతా బాంధవ్యాలు మానవుని వంటివి కావు . వారు తేజ స్వరూపులు . పాంచ భౌతిక దేహ బంధుత్వాలు వారికి వర్తించవు . ఆయన మానవునిగా శ్రీ రామ స్వరూపంలో అవతరించారు . భూ శక్తి అయిన లక్ష్మి సీతమ్మగా వచ్చింది . భూగర్భంలో నుంచి వచ్చిన కారణముగా ఆమెను భూ దేవికి పుత్రిక అన్నారు . విష్ణువుగా కాక రామునిగా భూపుత్రికను వివాహమాడారు . లౌకికంగా చూసినా గత జన్మలో జీవునికి ఒక బంధంగా ఉన్న వ్యక్తి తర్వాత జన్మలో ఇంకొక బంధంగా రావచ్చు . ఈ బంధాలు ఈ జన్మ వరకే . గత జన్మలతో గాని , రానున్న జన్మలతో గాని కలిపి చూడకూడదు.


సందేహం : ధ్వజస్తంభాన్ని తాక వచ్చునా ? లేదా ?

సమాధానం : దేవాలయంలో ప్రదక్షిణలు చేసిన తర్వాత ధ్వజస్తంభానికి నమస్కరించుకుని, ఆలయంలోకి వెళ్లాలి. అంతేకానీ దానిని తాకకూడదు. 

మనకు వెన్నుముక ఎటువంటిదో ఆలయానికి ధ్వజస్తంభం అటువంటిది.పరమాత్మ స్థానం గుండె. వెన్నుముక ఈ గుండెను దాటి అంటే విశుద్ధిచక్రం వరకు ఉంటుంది. సహస్రార చక్రంతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. అలాగే దేవాలయంలోని ధ్వజస్తంభం గర్భగుడిని అంటే దైవవిగ్రహాన్ని దాటి ఉంటుంది. వెన్నుముక ఒకే ఒక్క ఎముక. అలాగే ధ్వజస్తంభం ఏకాండి కొయ్య. ప్రత్యేక అర్హతలు ఉన్న కొయ్యనే ధ్వజస్తంభంగా వాడతారు.


సందేహం : 'మానసాదేవి ' - అన్న దేవత ఎవరు? ఆమె ప్రసక్తి ఏ పురాణంలో ఉంది?

సమాధానం : జగదంబ యొక్క ప్రధానాంశరూపాలలో ఈమె ఒకరు. కస్యపుని కుమార్తె. నాగులకు మాత.నాగరాజైన అనంతునికి సోదరి. శివునికి శిష్యురాలు. తపఃస్వరూపిణి. మంత్ర స్వరూపిణి. ఈమె భర్త పేరు జరత్కారు ముని. తనయుడు ఆస్తీకుడు.


సందేహం : శివపరివారమూర్తి పటం ఇంట్లో ఉండడం మంచిదని ఒకటి సంపాదించి పెట్టుకున్నాను. అయితే అందులో అన్నీ ఉన్నాయి కానీ, అమ్మవారి వాహనమైన సింహం లేదు. అందుకే ఆ పటం ఇంట ఉండరాదని ఒకరు హెచ్చరిస్తున్నారు. వృషభం, నెమలి, ఎలుక - అన్నీ ఉన్నాయి గానీ, సింహం లేదు కదా! మరొక చిన్న సందేహం - అయ్యవారి వృషభ వాహనానికి 'నంది' అని పేరు. మరి అమ్మవారి సింహానికి పేరేమిటి ?

సమాధానం : అమ్మవారు సింహవాహిని. అందులో సందేహం లేదు, కానీ ఆమె శివునితో కలిసి వృషభంపై కూర్చొని ఉంటుందని కూడా ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ప్రదోషార్చనలో వృషభ వాహనంపై ఉన్న పార్వతీ పరమేశ్వరులనే ఆరాధిస్తారు.

"నమశ్శివాభ్యాం వృషవాహనభ్యాం

నమో నమశ్శంకర పార్వతీ భ్యాం" 

అనీ పార్వతీ పరమేశ్వరులుభయులూ వృషభ వాహనులని ఆదిశంకరులు స్తోత్రించారు.

 అమ్మవారు విడిగా రాక్షస సంహారాదులు చేసేటప్పుడు సింహవాహినిగా ప్రకాశించిన ఘట్టాలను పురాణాలు వర్ణించాయి. కానీ శివునితో ఉన్నప్పుడు వృషభ వాహినిగానే ప్రసిద్ధి. దక్షిణ భారతంలో కొన్ని దేవీ ఆలయాలలో అమ్మవారి ఎదురుగా వృషభ వాహనమే (శివాలయంలో వలె )ఉన్నది.  కనుక పరివారమూర్తిలో మాత్రం ఒక్క వృషభము (నందీశ్వరుడు) ఉన్నా సరిపోతుంది.

ఇక అమ్మవారి వాహనమైన సింహం పేరు- 'సోమనంది '. ఈ నందికీ,  ఆ నందీశునికీ  అవినాభావ సంబంధం కూడా ఉంది. రెండింటిలో  'నంది' నామ సామ్యమే దీనికి తార్కాణం, రెండింటి 'నంద' తత్త్వాలు ఒక్కటే.


సందేహం : నాకు రుద్రనమకం వంటివి రావు. రోజూ ఓ వెండి శివలింగాన్ని పూజించుకుంటుంటాను. అయితే రుద్రంతో తప్ప శివుని పూజించకూడదని, శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని కొందరంటున్నారు. నిజమేనా?

సమాధానం : మీరు విన్నవి సరైనవి కావు. శివలింగాన్ని ఇంట్లో ఉంచి పూజించడం సర్వైస్వర్యకరం. రుద్ర నమకాదులతోనే అభిషేకించనవసరం లేదు. శివనామాలు చెప్తూ అభిషేకించవచ్చు, అష్టోత్తరశత నామాలతోనూ అభిషేకించవచ్చు . ఏదీ రానప్పుడు  " శివాయ నమః " అని చెప్తూ అభిషేకించినా చాలు. నిత్యం ఇంట్లో శివార్చన జరగడం మంచిది. శివపూజ అందరూ చేయవచ్చు.

అయితే బాణలింగం, స్ఫటిక లింగం, సాలగ్రామం వంటివి వాటికే ఎక్కువ నియమాలు, విధులూ ఉన్నాయి. అవి యోగ్యులైన గురువుల సహాయంతోనే స్వీకరించాలి. అవి లేకున్నా, వెండిలింగాన్ని అర్చించడం  మంచిదే.

Post a Comment

0 Comments