GET MORE DETAILS

ఏ గుణానికి ఏది మందు ? ‘డిప్రెషన్’, ‘స్ట్రెస్’, 'టెన్షన్’ - ఈ మూడు మాటలూ ఇప్పుడు నిత్యజీవిత నినాదాలై పోయాయి. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి రంగంలోనూ మామూలై పోయాయి. వీటికి పరిష్కారాలేమిటి?

ఏ గుణానికి ఏది మందు ? ‘డిప్రెషన్’, ‘స్ట్రెస్’, 'టెన్షన్’ - ఈ మూడు మాటలూ ఇప్పుడు నిత్యజీవిత నినాదాలై పోయాయి. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి రంగంలోనూ మామూలై పోయాయి. వీటికి పరిష్కారాలేమిటి ?

          


భారతీయ తత్త్వశాస్త్రం పురాణాది ధార్మిక గ్రంథాల ద్వారా చక్కని సూచనలిచ్చింది. మనం గమనించలేక పోతున్నాం, అన్వయించుకోలేక పోతున్నాం.

ఒకప్పుడు భోగాలనిపించుకున్న వాటిని - ఇప్పుడు అవసరాలనుకుని, వాటిని ఎలాగైనా సాధించాలనే ఆశ ఒక ప్రధాన కారణం. అలాగని 'గొర్రెతోక' జీవితాలను సర్దిపుచ్చుకోమని కాదు కానీ, నిరంతరం ఏదో లోటును అనుభూతికి తెచ్చుకుంటూ, ఏదో కావాలనే ఆరాటాన్ని పెంచుకుంటూ సాగి పోవడం తగదు కదా!

ఒక నిదానం, ఒక క్రమశిక్షణ - లేకుండా అసంతృప్తి, అసహసం పెంచుకొని - కేవలం  ‘సంపాదనయే జీవితం' అనే లక్ష్యాన్ని మనకు మనమే నిబద్ధించుకుని, ఆ దిశగా పరుగులు పెట్టే యాంత్రికతకు అలవాటుపడ్డాం.

ఒక పరిధి, ఒక పరిమితి ప్రతిదానికీ ఉంటాయి. అర్థకామాల సంపాదన అవసరమే కానీ, ఆ అవసరం ఏ మేరకు? అని నిర్దేశించే 'ధర్మం' అనే  'రెగ్యులేటర్' ఉండాలి. అది జీవితాన్ని తీవ్రమైన పరుగు పెట్టించకుండా నియంత్రిస్తుంది.


ఈ డిప్రెషన్లో బోలెడు రకాలున్నాయి.

 అన్నిటినీ విశ్లేషించి, చికిత్స చేయడానికి ఎన్నో వైద్యశాలలున్నాయి. అవి పచ్చగా వర్ధిల్లుతున్నాయి.

అయితే మన ధార్మిక వాఙ్మయ చికిత్సా విధానం పద్ధతిని కూడా గమనించుకుంటే ముందు జాగ్రత్తలు, చికిత్సలు కూడా సాధ్యమౌతాయి.

శరీరంలో వాత, పిత్త, కఫ తత్వాలుంటాయి. ఒక్కొక్క దేహం ఒక్కో తత్త్వం. దానిననుసరించి చికిత్స జరపాలి - అంటుంది ఆయుర్వేదం. అలాగే మానసికంగా సత్వ రజస్తమో గుణాల తత్త్వాలుంటాయి. వాటిని విశ్లేషించగలగాలి. ఒక్కొక్కరి మనస్తత్వంలో ఈ గుణాల పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక్క గుణం మాత్రమే ఈ ప్రపంచంలో ఉండదు. మూడూ కలిసే ఉంటాయి. వేటిని ఎలా నియంత్రించాలో తెలిసి బ్రతకడమే తెలివితేటలు.

సాధారణంగా - మానవ జన్మ రజోగుణ ప్రధానమైనది. దేవతలు సత్యగుణ ప్రధానులు. భూతప్రేతాదులు తమోగుణ ప్రధానులు. మనలో ఏ గణాన్ని ఎక్కువ చేసుకుంటే ఏ వర్గంలోకి చేరవచ్చో పై విభజన బట్టీ మనమే ఎంపిక చేసుకోవచ్చు.

రజోగుణం వల్ల కామం, క్రోధం కలుగుతాయి. ఇవి తగిన మోతాదులో ఉండాలంటే సత్వగుణ సహాయం కావాలి. వివేకం, జ్ఞానం, సంతోషం, సంతృప్తి, సత్యం, నిగ్రహశక్తి, దయ, సామ్యం వంటి లక్షణాలు సత్వగుణ సంబంధాలు.  

రజోగుణం వల్ల కలిగే లక్షణాలతో ఒకదానితో తీవ్రమైన అనుబంధం పడుతుంది. అది రాగమైనా, ద్వేషమైనా కావచ్చు. ఏదైనా ఎక్కువ ఆశించడం, ఎక్కువ భావించడం, ఆ చింతనలో అంచనా లెక్కువగా వేసుకోవడం, ఆశలు పెంచుకోవడం వంటి స్వభావాలు రజోగుణ ప్రకోపాలు, దీనితో నిజ జీవితంలో అంచనా ఏ మాత్రం దెబ్బతిన్నా, ఆశించినదానికి విరుద్ధంగా జరిగినా అలజడి, ఒత్తిడి ఏర్పడతాయి.

సాత్విక సాధనలలో ముందుగానే మనసును సంస్కరించుకుంటే ఈ రజఃప్రభావాల నుండి జాగ్రత్త పడవచ్చు. అందుకే సాత్వికాహారం, సాత్వికమైన దైవచింతన, నియమబద్ధమైన జీవిత విధానం, శ్రమతో ధర్మబద్ధంగా సంపాదించుకున్న దానితో తృప్తి చెందడం, క్షమాగుణం వంటివి అలవరచుకుంటే మానసిక రుగ్మతలకు దూరంగా ఉండవచ్చు.  

రజోగుణ ప్రకోపం వల్ల ఒత్తిడికి, ఆందోళనకు గురైతే - కొందరు సత్వగుణంతో నియంత్రించుకోగలరు. ఆధ్యాత్మిక బోధలు, సాధన వంటివి ఈ విధమైన నియంత్రణలో భాగాలు. వేదాంత శాస్త్రం బోధించే 'వస్తు విచారం’ (ఏ విషయంలో ఎంతమేరకు సారం వుందో తేల్చే ఆలోచన) దీనికిసహకరిస్తుంది.

అయితే రజోగుణం తీవ్రస్థాయిలో దెబ్బతీసినప్పుడు, ఈ సత్వగుణంలో చికిత్స కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కొందరు ఆ విధమైన ప్రయత్నాన్ని చేయరు కూడా. దానికి బదులుగా తమోగుణ సహాయాన్ని తీసుకుంటారు. నిద్ర, కునుకుపాటు, సోమరితనం, జడత్వం వంటివి తమోగుణ లక్షణాలు. మందులతో నిద్రపుచ్చడం, దేనికీ స్పందించని స్థితికి మెదడును తీసుకువెళ్ళడం - ఈ తమోగుణ చికిత్సా విధానం. ఇప్పుడు ఎక్కువ భాగం ఈ విధానాన్నే అవలంబిస్తున్నారు.  

ఇది తాత్కాలికంగా రజోగుణ తీవ్రతని తగ్గించినా, తమోగుణం పాళ్ళు పెంచే ప్రమాదం ఉంది. జాడ్యం, మాంద్యం వంటివి సంక్రమించి బుద్ధిశక్తి క్షీణిస్తుంది. ఎన్నో సాధించగలిగిన ధీశక్తి మొద్దుబారుతుంది.

 ఇలా కాకుండా ఉండాలంటే ఆధ్యాత్మికమైన ధ్యాన యోగ, సంకీర్తనాది సాధనాలు సహకరిస్తాయి. మనం వేదాంతం పలికే జ్ఞాన వైరాగ్యాలే స్ఫూర్తినిస్తాయి.

 నిరాడంబర జీవితం, మితాహార, విహారాలు, ఉత్తమలక్ష్యమైన భగవచ్చింతన... ఈ మూడూ గొప్ప ఔషధాల్లా పని చేస్తాయి. ఎన్ని పనులు సాధించినా, ఎన్ని వ్యాపకాలున్నా 'మితి' అనే ధోరణిని ఈ మూడింటి ద్వారా సాధించవచ్చు.

సంయమనం గల చిత్తాన్ని, తొందరపాటులేని తనాన్ని బాల్యంనుంచే ఆధ్యాత్మిక జీవనసరళితో అలవాటు చేస్తే, ఆ పిల్లలు పెద్దయ్యాక మితిమీరిన రజోగుణానికి లోను కాకుండా, వాటి దుష్ప్రభాలకు గురికాకుండా ఉండగలరు.

లంకలోని సీతమ్మ ఈ సాత్విక సాధన వలననే, తన మహాదుఃఖతీవ్రతలో నిలదొక్కుకోగలిగింది. నిరంతరం రామచింతన, రామదీక్షపై విశ్వాసం, ధైర్యం, అశాభావం లాంటి సానుకూల సకారాత్మక భావాలు ఆమెకు ఆలంబనాలయ్యాయి.

హనుమంతుని ద్వారా రామవార్తను విన్నాక, అడిగి అడిగి రాముని వర్ణింపజేసి, ఆ రామకీర్తనతో పరవశించి సేదదీరింది.

అలాగే అరణ్యవాస కాలంలో ధర్మరాజాదులు సాత్విక సాధనలతో నిలబడగలిగారు. పురాణాల్లో - కష్టాలపాలైన దశలలో సావత్రి, దమయంతి, నలుడు వంటి వారు ఈ మార్గంలోనే స్వస్థులయ్యారు.

ఈ సాత్విక గుణ సమూహానికే 'దైవీ సంపద' అని పేరు పెట్టింది భగవద్గీత. 'దైవీ సంపద్విమోక్షాయ'. దైవీ సంపదవలననే దుఃఖం నుండి విడుదల  లభిస్తుందని గీతాచార్యుని మాట.

Post a Comment

0 Comments