GET MORE DETAILS

హోమియోపతి పిత గురించి కాస్తంత తెలుసుకుందాం (నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం)

హోమియోపతి పిత గురించి కాస్తంత తెలుసుకుందాం (నేడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం)


యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

ఆధునిక కాలంలో మనకు అనేక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి.ఇందులో హోమియోపతి ఒకటి.

హోమియోప‌తి పితామ‌హుడు, సృష్టికర్త అయిన డాక్ట‌ర్ శ్యాముల్ హనీమాన్ గౌర‌వార్థం ఆయ‌న జ‌న్మ‌ దినోత్స‌వాన్ని  ఏప్రిల్ 10 ప్ర‌పంచ హోమియోప‌తి దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నారు. 

ప్రపంచంలోని వైద్య విధానాలలో అల్లోపతి అనే ఆధునిక వైద్యం (ఇంగ్లీషు వైద్యం) మొదటి స్థానం ఆక్రమించింది. దాని తర్వాత ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, నేచురోపతి, ఆక్యుపంక్చర్ ఇలా అనేక వైద్య విధానాలున్నాయి. ప్రపంచంలో 66 దేశాలలో ఈ వైద్య విధానాన్ని అనుసరిస్తున్నారు.

హోమియోపతి వైద్యం ప్రపంచం మొత్తంమీద ఎక్కువగా భారతదేశంలోనే ఆదరించబడుతున్నది. వైద్య కళాశాలలు, ఫార్మసీలు, రీసెర్చ్ సెంటర్లు, హాస్పిటల్స్ భారత్‌లో ఎక్కువగా ఉన్నాయి.హోమియోపతి ఆస్పత్రి నిర్వహణ ఖర్చు తక్కువ. మందుల వెల స్వల్పం. హానికరం కావు. కఠిన, దీర్ఘకాలిక వ్యాధులకు ఈ వైద్యంలో మంచి ఫలితాలున్నాయి. 

మెదడువాపు వ్యాధి, చికున్‌గున్యా, డెంగ్యూ, చికెన్‌పాక్స్, స్వైన్‌ఫ్లూ, మద్రాస్ ఐ (కళ్ల కలక), గవదల వాపు, కలరా, అతిసార మొదలగు వ్యాధులకు హోమియోపతి లో చికిత్స ఉంది.

హోమియోపతి పితగా పేరు పొందిన క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యూల్ హానీమాన్ 1775 వ సం. ఏప్రిల్ 10వ తేదీన జర్మనీలోని మిస్సెల్ అను కుగ్రామంలో జన్మించారు. నిరుపేద కుటుంబం. తండ్రి పింగాణీ పాత్రలపై రంగులు వేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు 10 మంది సంతానం. బాల్యదశలోనే హానీమాన్ అసాధారణ ప్రతిభ కలవాడు. విద్యార్థి దశ నుండి వినయం, శ్రద్ధ, పట్టుదల మొదలగు సద్గుణాలు కలిగి ఉపాధ్యాయుల మన్నన పొందాడు. కాని హానీమాన్‌కు స్కూల్ ఫీజు కట్టలేక అతని తండ్రి స్కూల్ మానిపించాడు. కాని ఆయన ఉపాధ్యాయుడు హానీమాన్ ప్రతిభ చూసి ఫీజు లేకుండా చదువుకొనే ఏర్పాటు చేశాడు. అప్పటికీ కుటుంబం గడవడం కష్టమై విద్యార్థులకు పాఠాలు చెప్పి, ఇతర భాషలలో ఉన్న గ్రంథాలు తర్జుమా చేసి వచ్చిన డబ్బుతో కుటుంబానికి ఆర్థిక భారం లేకుండా జీవించే వాడు.

ఆయన తన 24వ ఏట 1779లో వైద్యశాస్త్రంలో ఎంబిబిఎస్ పట్టా పుచ్చుకున్నాడు. 1782లో నవంబర్ 17వ తేదీన హెన్‌రియట్ అను వనితను పెళ్లాడాడు. హానీమాన్ వైద్యవృత్తిలో (అల్లోపతి) దాదాపు 10 సంవత్సరాలపాటు వివిధ పట్టణాలలో వైద్యం చేశాడు. ఆయన ప్రావీణ్యత గల వైద్యుడేగాక, గొప్ప శాస్తవ్రేత్తగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందాడు. చిన్న వయస్సులోనే డెస్టెన్ హాస్పిటల్‌లో ప్రధాన శస్తచ్రికిత్స అధికారి అయ్యాడు. కొంతకాలానికి తాను చేస్తున్న వైద్య విధానమందలి లోపాలను గమనించి, దీర్ఘవ్యాధులు నివారణ కాకపోవడం, పదేపదే వ్యాధులు తిరగబెట్టడం నచ్చక వైద్యవృత్తిని విడిచిపెట్టాడు.

వైద్యవృత్తి మానివేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు లేకుండుటకు, సంసారాన్ని పోషించుకొనేందుకు ఎన్నో గ్రంథాలను తర్జుమా చేశాడు. ఆయనకు ఇంగ్లీష్, ఇటలీ, ఫ్రెంచ్, గ్రీకు, లాటిన్, అరబిక్ భాషలలో ప్రావీణ్యం ఉంది. ఎందరో సైంటిఫిక్ పబ్లిషర్స్ ఆయన రచనలు, అనువాద గ్రంథాల కోసం ఎదురుచూసేవారు.

1790లో డా.కల్లెన్‌ చే వ్రాయబడిన మెటీరియా మెడికా తర్జుమా చేస్తూన్న సమయంలో అనుకోకుండా హోమియో వైద్య ముఖ్య సూత్రాలను కనుగొన్నాడు. సింకోనా అనే మందు గురించి డా.కల్లెన్ రాసిన వ్యాఖ్యానం ఆయనకు నచ్చలేదు. సింకోనా మందు తీసుకొన్నట్లయితే ఆ మందు చలిజ్వరాలను నివారణ చేయగలద? లేదా అనే విషయం తెలుసుకోవాలనుకున్నాడు.

వెంటనే ఆయనే కొన్ని రోజులు సింకోనా మందును ముడిరూపంలో తానే స్వయంగా తీసుకొన్నాడు. ఇలా తీసుకున్న తర్వాత ఆయనలో చలి జ్వర లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆయన అదే లక్షణాలున్న రోగికి సింకోనా మందు ఇవ్వడం వలన వ్యాధి నివారణ కలిగింది. 

విప్లవాత్మకమైన ఈ ప్రయోగం చికిత్సా రంగాన్ని మొత్తం ప్రక్షాళన చేసింది. ఈ విధంగా ఆయన తన మీద, తన శిష్యుల మీద, తన కుటుంబ సభ్యుల మీద వివిధ మందులను 40 సంవత్సరాలు పాటు ప్రయోగించి వాటి వలన కలుగు లక్షణాలు క్రోడీకరించి మెటీరియా మెడికా ప్యూరా అనే గ్రంథాన్ని రాశాడు. 

ఈ విధంగా అనేక సంవత్సరాలు రాత్రింబవళ్లు అకుంఠిత దీక్షతో నిర్విరామ కృషి ఫలితంగా హోమియో వైద్యం ఆవిర్భవించింది.

రోగి ఎన్ని లక్షణాలు ఏకరవు పెట్టినా వాటన్నిటికి ఒకే ఒక మూల కారణం ఉంటుందనేది వీరి సిద్ధాంతం. కనుక రోగి ఎన్ని లక్షణాలు ఏకరవు పెట్టినా వాటన్నిటికి ఒకే ఒక మందు (రేమిడీ) ఇస్తారు - సనాతన హోమియోపతీలో. మందుల ఖాతాలో ఉన్న ఏ మందు ఏ రోగికి నప్పుతుందో ఎంపిక చెయ్యటం చాల కష్టం. పది పుస్తకాలు చదివినంత మాత్రాన అబ్బే ప్రతిభ కాదు ఇది; అనుభవం ఉండాలి. అందుకనే హొమియోపతీ వైద్యం అందరి చేతిలోనూ రాణించదు. అందుకనే కాబోలు, అధునాతనులు ఈ సూత్రాన్ని సమయానుకూలంగా విస్మరిస్తారు.అలాగే మందును కూడా కొద్ది పాళ్లలోనే ఇస్తారు.

ఈ నూతన విద్యా విధానాన్ని ధృవపరచుటకు, నిలబెట్టుటకు ఆయనకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇతర వైద్యులు ఈ విధానాన్ని ఆధారరహితంగా ఉన్నదని విమర్శించారు. వారి చర్యల వలన ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి మారాల్సి వచ్చింది. ఈ నూతన విధానం వలన జర్మనీ దేశంలోని మందుల కంపెనీలకు నష్టం వాటిల్లటంతో వారు ఆయనను లీప్జిగ్ పట్టణం నుండి వెళ్లగొట్టారు. తర్వాత కోథెన్ అను పట్టణం చేరి డ్యూక్ ఫెడ్రిక్ సహాయంతో తన వైద్య విధానాన్ని ప్రారంభించాడు. ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. దీర్ఘవ్యాధుల నిజ స్వరూపం తెలుసుకొనేందుకు ఆయనకు 12 ఏళ్లు పట్టింది. అనేక దీర్ఘకాల వ్యాధుల వారు ఆయన చికిత్సచేయడంతో కోలుకున్నారు.

1830 సంవత్సరంలో ఆయన భార్య మరణించింది. ఆయనకు ఇద్దరు కుమారులు, 9 మంది కుమార్తెలు. 1835న మెలనీడి హెర్విల్లీ అనే 36 సంవత్సరాల విద్యావంతురాలు ఆయన ప్రతిభకు ఆకర్షింపబడి వివాహం చేసుకొంది. ఆమె పలుకుబడి వలన ఫ్రాన్స్ దేశ ముఖ్య పట్టణమైన పారిస్ నగరంలో వైద్యం చేసేందుకు ప్రభుత్వం నుండి అనుమతి లభించింది. వృద్ధాప్యంలో ఆయనకు ఆమెయే రోగులకు మందులిస్తూ సహాయపడింది. 

తన 88వ ఏట 2.7.1843 న ఆ మహనీయుడు దేహాన్ని చాలించాడు. ఆయనను తరిమికొట్టిన లీప్జిగ్ ప్రజలు ఆయన మరణానంతరం 20 సంవత్సరాల తర్వాత ఆయన శిలావిగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

అయితే అల్లోపతిలో కాకుండా మిగతా వైద్య విధానాల్లో రోగి యొక్క వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి వైద్యం జరుగుతుంది. అల్లోపతిలో రోగి చెప్పిన రోగ లక్షణాల ఆధారంగా కొంత కాలం మాత్రమే వైద్యం అందిస్తారు.ఆ తర్వాత రోగికి తగు పరీక్షలు నిర్వహించి మాత్రమే మందులు ఇస్తారు.వివిధ పరీక్షల ద్వారా రోగ నిర్ధారణ జరుగుతుంది కాబట్టి అల్లోపతి లో ఎక్కువ శాస్త్రీయత ఉంటుంది. ప్రతి వైద్య విధానానికి ఒక పరిమితి ఉంటుంది. ఇప్పటీకీ అల్లోపతి కే ఎక్కువ ప్రజాధారణ ఉన్నప్పటికీ,మిగతా వైద్య విధానాలు పూర్తిగా అవాస్తవమని  కొట్టి పార వేయలేము.ఏది ఏమైనా అంతిమంగా రోగి తీసుకునే నిర్ణయం పైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. వివిధ వైద్య విధానాలపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది. వాటి ఫలాలను ప్రజలకు అందాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

Post a Comment

0 Comments