జెండా వెంకయ్యను స్మరిద్దాం - ఆగస్ట్ 2 పింగళి వెంకయ్య జయంతి
యం.రాంప్రదీప్
జనవిజ్ఞాన వేదిక,
తిరువూరు
సెల్ : 9492712836
2018-2019మధ్య కాలంలో అప్పటి కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర సాంప్రదాయాలను ప్రతిబింబించేవిధంగా ఒక పతాకాన్ని రూపొందింస్తుందని వార్తలు వచ్చిన నేపధ్యంలో రాష్ట్రాలకు ప్రత్యేకించి పతాకాలు అన్నవి ఏమి ఉండవని కేంద్రహోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకాశ్మీర్ కు మాత్రమే రాష్ట్ర పతాకం ఉన్నది. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోయింది. అమెరికా లాగా మన దేశంలో ద్విపౌరసత్వం లేదు.
పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నారు. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అతను బెంగుళూరు, మద్రాసులలో రైల్వే గార్డుగా పనిచేశారు. ఆ తరువాత కొంత కాలం బళ్లారిలో ప్లేగు అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. వెంకయ్యలో ఉన్న దేశభక్తి అతనిని ఎంతో కాలం ఉద్యోగం చేయనివ్వలేదు. జ్ఞానసముపార్జనాశయంతో లాహోరు లోని ఆంగ్లో - వేదిక్ కళాశాలలో చేరి ఉర్దూ, జపనీస్ భాషలను నేర్చుకున్నారు. అతను "ప్రొఫెసర్ గోటే" ఆధ్వర్యంలో జపనీస్, చరిత్రలను అభ్యసించారు.
వెంకయ్య బందరు లోని జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు. అప్పట్లో చైనా జాతీయ నాయకుడైన 'సన్ యత్ సేన్ ' జీవిత చరిత్ర వ్రాశారు.
మన మువ్వన్నెల జెండా మనమంతా భారతీయులమని చెప్పటానికి దోహదపడుతుంది. స్వాతంత్ర్య పోరాటకాలంలో సహాయనిరాకరణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మహాత్మగాంధీ విజయవాడ వచ్చిన సందర్భంగా జాతీయ జెండాను రూపొందించమని పింగళి వెంకయ్యను కోరగా వెంటనే గాంధీజీ సూచనతో వెంకయ్య ఒక జెండాను తయారుచేశారని, ఆ జెండాకే కొన్ని స్వల్ప మార్పులు చేసి 1947 జులై 22న మన జాతీయ నాయకులు జాతీయజెండాగా అమోదించారని మనం చరిత్ర పుస్తకాలలో చదువుకుంటున్నాము. పింగళి వెంకయ్య రూపొందించిన జెండాను "స్వరాజ్య జెండాగా" పిలుస్తారు. హిందూ, ముస్లిం ఐక్యతకు చిహ్నంగా ఈ జెండాను భావిస్తారు. పింగళి వెంకయ్య “జెండా వెంకయ్యగా" కూడా పేరు పొందారు. జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించగా, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కళాకారిణి సూరయ్య త్యాబ్లీ జెండాకు తుది రూపం ఇచ్చిందని కొందరు చరిత్ర కారులు తెలియజేస్తున్నారు. తెలుగు వాడయిన పింగళి వెంకయ్య స్వాతంత్ర్య ఉద్యమకాలంలో గాంధీజీ స్ఫూర్తితో దేశానికి ఎనలేని సేవలు అందించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వం వెంకయ్య సేవలను గుర్తించి 2009లో ఆయన స్మారకార్ధం ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ప్రధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. పింగళి జయంతి, వర్ధంతి వేడుకలను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు జరపాలని పలువురు విజ్ఞప్తి చేశారు. దేశసమగ్రతకు, భారతీయుల ఆత్మగౌరవానికి మన మువ్వన్నెల జెండా ప్రతీక. జాతీయజెండాను గౌరవించటానికి కేంద్రప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించింది. కేంద్రప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ జెండాలను వాడరాదు. జాతీయజెండాను అగౌరవపరచరాదు. జాతీయజెండాకు అత్యుత్తమ స్థానం ఇవ్వాలి. చిరిగిన జెండాలను వినియోగించరాదు. అయితే వాస్తవ పరిస్థితులను చూసినట్లయితే స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం నాడు విద్యార్ధులు మరియు సాధారణ పౌరులు ప్లాస్టిక్ జెండాలను అలంకరణకు ఉపయోగిస్తున్నారు. జెండావందనం అనంతరం ఈ ప్లాస్టిక్ జెండాలు రహదారులపై దర్శనమిస్తున్నాయి. జాతీయజెండాను గౌరవించే విషయంలో పలు నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని పెద్దగా ఎవరూ ప్రచారం చేయటం లేదు. కొందరు రాజకీయ నాయకులు సైతం అవగాహనలేమితో జాతీయజెండాను అగౌరవపరుస్తున్నారు. పత్రికలలో జాతీయజెండాతో కూడి ఉన్న వాణిజ్య ప్రకటనలు ముద్రించరాదు. వాణిజ్య పరంగా జాతీయ జెండాను వినియోగించరాదు. కానీ కొన్ని బహుళజాతి కంపెనీలు పరోక్షంగా దేశభక్తి పేరుతో జాతీయ జెండాను వాణిజ్య ప్రకటనలలో వినియోగించటం మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. దేశభక్తిని కూడా వారు వ్యాపారమయం చేస్తున్నారు. సెలవు రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు వచ్చినట్లయితే అనేక కార్పోరేట్ కళాశాలలు, మరికొన్ని ప్రయివేట్ విద్యాలయాలు తమ సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి. అందుబాటులో ఉన్న కొద్ది మంది సిబ్బంది మరియు విద్యార్థులతో నామమాత్రంగానే జెండావందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలని కూడా స్వల్ప వ్యవధిలోనే ముగిస్తున్నారు. మన జాతీయ జెండా ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద భావాలకు ప్రతిరూపం. భారతదేశంలో నివశించే అన్ని వర్గాల ప్రజల యొక్క మనోభావాలను మన జెండా ప్రతిబింబింప చేస్తుంది. విద్యాలయాలు, కళాశాలలు జాతీయజెండా పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలి. విద్యార్ధులకు మన దేశనాయకులు చేసినటువంటి త్యాగాలు వివరించేందుకు కొన్ని ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయ్యాలి. ప్రతి నిభందనను చట్టం ద్వారానే అమలు చేయాలంటే ఆచరణ సాధ్యం కాదు. భవిష్యత్ లో విద్యార్థులకు దేశం పట్ల ప్రేమ, ప్రజల పట్ల సోదరభావం కలగాలంటే అధ్యాపకులు, ఉపాధ్యాయులు కొంత సమయం కేటాయించి స్వాతంత్ర్య పోరాట నేపధ్యం గురించి వివరించాలి. అప్పుడే జాతీయజెండాను అందించిన పింగళి వెంకయ్యకు మనం నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది.
0 Comments