GET MORE DETAILS

ఈ రోజు యమద్వితీయ : భగినీ హస్త భోజనం.

 ఈ రోజు యమద్వితీయ : భగినీ హస్త భోజనం.



'భగిని' అంటే తోబుట్టువు అయిన సోదరి అనీ, భాగ్యవంతురాలు అనీ అర్థం. సోదరి చేతివంటను తినడం భగినీహస్త భోజనం. ఈ సంప్రదాయానికి ఎంతో విశిష్టత ఉంది. యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె పూర్వం తన అన్న అయిన యమధర్మరాజు దగ్గరకు ప్రతి నిత్యం వెళ్లి, తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరేదట. నరకలోక పాలనలోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి ఎన్నాళ్లకూ తీరిక దొరకలేదు. ఎలాగైనా ఒక దినాన చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేసి రావాలని సంకల్పించుకున్నాడు. చివరికి అతనికి కార్తికమాసం, శుక్లపక్షం, ద్వితీయాతిథినాడు విరామం దొరికింది. ఆ దినాన యమున ఇంటికి వెళ్లాడు. ఎన్నాళ్లో ఎదురు చూడగా అనుకోకుండా వచ్చి, తన ప్రార్థనను మన్నించిన అన్నకు యమున షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వడ్డించింది. యముడు సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగినంత ఆనందం కలిగింది. అప్పుడు యముడు తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని, ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడామె 'అగ్రజా! నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతివంటను తినివెళ్లాలి. అంతేగాక, ప్రతి సంవత్సరం కార్తిక శుక్లద్వితీయనాడు లోకంలో ఏ అన్నలు చెల్లెళ్లు వండిన పదార్థాలను భోజనం చేస్తారో, అలాంటి వాళ్లకు నరకబాధ ఉండరాదు. ఇదే నేను కోరే వరం' అని పలికింది. యముడు 'తథాస్తు' అన్నాడంటారు. నాటి నుంచి ఈ వేడుక యమద్వితీయ (యముడు తన సోదరి చేతివంటను తిన్న దినం) అనీ, 'భ్రాతృద్వితీయ' (అన్న చెల్లెలి చేతివంట తిన్న పవిత్ర దినం) అనీ ప్రసిద్ధిలోకి వచ్చింది.

Post a Comment

0 Comments