🪔🪔 కార్తీక మాసంలో పూజలు - జన్మ జన్మల పాపాల ప్రక్షాళన 🪔🪔
కార్తీకమాసం శివ,కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం, కార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారు ఝూముననే స్నానమాచరించవలెను, అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది.
నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలెను.
కార్తీకమాసమంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించాలి.
అలాగే సాయంత్ర సమయంలో శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపుర ద్వారం వద్దగానీ దేవుని సన్నిదానంలోగానీ ఆలయ ప్రాంగణంలో గానీ దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం.
ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడ పుణ్య ప్రదమే.
కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు గాని లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను వేసి దీపం వెలిగించడం శ్రేష్టం.
ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం, లేదంటే నువ్వుల నూనెతో గానీ, కొబ్బరి నూనెతో గానీ, నెయ్యితోగాని, అవిశ నూనెతో గానీ, ఇప్ప నూనెతో గానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపమును వెలిగించవలెను.
అంతే కాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం.
కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం.
ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.
కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు:
• కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను.నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది.వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమి రోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.
• శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
• ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.
• ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడు పువ్వులతోనూ పూజించవలెను.
• ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.
కార్తీకంలో దీపారాధనలకి ఈ క్రింది రకాల వత్తులను ఉపయోగించుట ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చును.
ఆదివారం: పారాణిలో తడిపి ఆరబెట్టిన వత్తులు...
సోమవారం: అరటి దూటతో నేసిన వత్తులు... (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి)
మంగళవారం: కుంకుమ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు...
బుధవారం: పసుపు, గంధం, పన్నీరు కలిపిన నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు...
గురువారం: కొబ్బరి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు...
శుక్రవారం: పసుపు నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు...
శనివారం: తామర తూడుతో నేసిన వత్తులు... (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి)
అవకాశం ఉన్నవారు పై విధంగా దీపారాధన ప్రక్రియను ప్రయత్నించగలరు.
కార్తీకమాసంలో చేయకూడనిపనులు:
✅ ఇంగువ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి, గుమ్మడికాయ, శనగపప్పు, పెసరపప్పు, నువ్వులు కార్తీకమాసంలో తినటం నిషేధం
✅ ఆదివారం రోజు కోబ్బరికాయ,ఉసిరికాయ తినరాదు. భోజన సమయంలో మౌనంగా వుండాలి.
0 Comments