ఆంగ్ల విద్యకు ఆద్యుడు మెకాలే (డిసెంబర్ 28 మెకాలే వర్థంతి)
యం.రాం ప్రదీప్
తిరువూరు
9492712836
బ్రిటిష్ వారు భారత దేశం నుండి వెళ్తూ, వెళ్తూ రెండు వదిలి పెట్టి వెళ్ళారు.ఒకటి ఇంగ్లీష్,రెండు క్రికెట్. ప్రస్తుతం ఈ రెండింటిలో మన దేశం అగ్రగామిగా వుంది.లార్డ్ మెకాలే భారత దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టారు.
లార్డ్ మెకాలే భారతదేశంలో కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉన్నా విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేసాడు. అదే సమయంలో అతను మొదటి లా కమిషన్ ఛైర్మన్ గా ఉన్నాడు. అపుడే నాటి ఫ్రెంచి పీనల్ కోడ్, లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా వంటి ప్రామాణిక గ్రంథాలను అధ్యయనం చేసాడు. అలాగే భారతీయుల ప్రామాణిక గ్రంథాలైన మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతిని కూడా పరిగణనలోకి తీసుకున్నాడు. జైలు శిక్షల విషయంలో కూడా తన అభిప్రాయాలకంటే, నాటి దేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువ ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్సు తో ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతిని తయారు చేశాడు. 1835లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ ప్రతిని సమర్పించాడు. అతను చేసిన కృషి ఫలితంగానే ఇండియన్ పీనల్ కోడ్ 1860 అక్టోబరు 6 నాడు చట్టసభలో ఆమోదం పొందింది. 1862 సంవత్సరంలో ఐపిసి అమలులోకి వచ్చింది. లార్డ్ మెకాలే యుద్ద కార్యదర్శిగా 1839 - 1841 మధ్య పనిచేశాడు. పేమాస్టర్-జనరల్ గా 1846 - 1848 మధ్య లార్డ్ మెకాలే విధులు నిర్వర్తించాడు.
థామస్ బాబింగ్టన్ మెకాలే 1800 అక్టోబరు 25 న జన్మించారు. 1859 డిసెంబరు 28న తుదిశ్వాస విడిచారు.భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్) సృష్టికర్తగా పేరు పొందారు.మొదటి లా కమిషన్ ఛైర్మన్ గాపనిచేశారు. భారత దేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టడం వెనుక మెకాలే ఉద్దేశం ఏదైనప్పటికీ, భారతీయులు మాత్రం ఆంగ్లం ద్వారా అనేక అవకాశాలని అంది పుచ్చుకున్నారు.
గమనిక: 1862 లో అమలు ప్రారంభం అయిన IPC 2023 డిసెంబర్ వరకు అంటే దాదాపు 161 సంవత్సరాల పాటు అమలులో ఉంది.ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం IPC స్థానే భారత్ న్యాయ సంహిత ను ప్రవేశపెట్టింది.
0 Comments