Mobile Phone|మొబైల్ మైకం - కండ్లకు శాపం. సెల్‌ఫోన్ బానిసల్లో 11-18 ఏండ్ల మధ్యవారే అధికం
నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు ప్రతి దానికీ మారాం చేయడం. వారికి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు ఇచ్చి బుజ్జగించడం నిత్యకృత్యంగా మారింది.
ఏ ఇంట్లో చూసినా పసిపిల్లలు మొదలుకొని పదేండ్ల పిల్లల వరకు మొబైల్ ఇవ్వకపోతే ముద్ద ముట్టడం లేదు. కానీ, ఇది మంచి పద్ధతి కాదని 'వన్ లైఫ్' స్వచ్ఛంద సంస్థ స్పష్టం చేసింది. సమాజంలో ఎక్కువగా 11-18 ఏండ్ల వయస్కులు ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు బానిసలుగా మారుతున్నట్టు వెల్లడించింది. అతిగా మొబైల్ మైకంలో పడితే కండ్లకు లేని సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనని హెచ్చరించింది. తల్లిదండ్రులు చిన్న చిన్న చిట్కాలతో చిన్నారులను మొబైల్ నుంచి దూరం చేయాలని సూచించింది.
దూరం చేద్దామిలా...
రెండేండ్ల లోపు చిన్నారులకు ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర గ్యాడ్జెట్లు ఇవ్వకూడదు. వారు తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల సంరక్షణలోనే ఉండాలి. 5-17 ఏండ్లలోపు పిల్లలు రోజులో 2 గంటలకు మించి ఫోన్ ఉపయోగించకుండా చూడాలి. మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయిన పిల్లలపై తల్లిదండ్రులు కేకలు వేయడం, అరవడం సమస్యకు పరిష్కారం కాదు. ముందు వారికి సెల్‌ఫోన్‌ను దూరం చేయడంపై దృష్టి సారించాలి.
అందులో భాగంగా ఇంట్లో పిల్లలతో చిన్నపాటి చర్చలు, ఇతర కార్యక్రమాలు చేపట్టాలి. వారు ఆటలకు అంకితమయ్యేలా చూడాలి. కొత్త అభిరుచులను అలవాటు చేయాలి. వారిలోని సృజనాత్మక ఆలోచనలను వెలికితీసి, వాటికి కార్యరూపమిచ్చేలా ప్రోత్సహించాలి. పడుకునే ముందు పిల్లలకు ఫోన్లు ఇవ్వరాదు. వారంలో ఒక రోజు ఫోన్ లేకుండా తినే రోజుగా (నో ఫోన్‌డేగా) పాటించాలి. స్టడీ అవర్స్‌లో సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి. రంగులు వేయడం, పెయింటింగ్, చెట్లు ఎక్కడం, సైక్లింగ్, గార్డెనింగ్, పార్కులకు తీసుకెళ్లడం, ఫ్రెండ్స్‌తో నిత్యం కలవడం, సైన్స్ ప్రయోగాలు నిర్వహించడం ద్వారా ఫోన్ల వాడకాన్ని తగ్గించవచ్చు.
అనర్థాలు అనేకం:
పిల్లలున్నదే డిజిటల్ ప్రపంచంలో... నేటి తరం పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్నారు. మొబైల్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగంతో చిన్నారుల కండ్లు, మొదడు పనితీరు దెబ్బతింటున్నది. దీంతో ఒబేసిటీ (ఊబకాయం), నిద్రలేమి, మానసిక సమస్యలు తలెత్తి చదువుల్లో వెనకబడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఆరిస్తే లాభముండదు. ఆలోచనలకు పదునుపెట్టి వారి నుంచి స్మార్ట్‌ఫోన్లను దూరంచేయాలి. ఇతర అలవాట్ల పట్ల ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించాలి.
- రెబెకా మారియా, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్.
0 Comments