పాలపుంత గెలాక్సీ (Milky Way Galaxy) కేంద్రంలో సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ను కనుగొన్న ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత రైన్ హార్డ్ గెంజెల్ పుట్టిన రోజు
రైన్ హార్డ్ గెంజెల్ ( Reinhard Genzel ForMemRS ) ( జననం 24 మార్చి, 1952 ) ఒక జర్మన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన పాలపుంత గెలాక్సీ కేంద్రంలో ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ను కనుగొన్నందుకు 2020 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.
2020 సంవత్సరపు భౌతిక శాస్త్ర నోబెల్ విజేతలు రోజర్ పెన్ రోజ్ ( Roger Penrose ), రైన్ హార్డ్ గెంజెల్ (Reinhard Gengel ), ఆండ్రియా ఘెజ్ ( Andrea Ghez ) లు విశ్వంలో కంటికి కనిపించని బ్లాక్ హోల్ దృగ్విషయం గురించి అద్భుతమైన పరిశోధనలు చేశారు. బ్లాక్ హోల్ అనేది చాలా ఎక్కువ గురుత్వాకర్షణ శక్తితో కూడిన సూపర్ మాసివ్ కాంపాక్ట్ వస్తువు. దాని నుండి కాంతి కూడా తప్పించుకోలేదు. అయితే వాటిని రేడియేషన్ మరియు సమీపంలోని వస్తువుల కదలికల ద్వారా మాత్రమే గమనించవచ్చు.
రైన్‌హార్డ్ గెంజెల్ ఇన్‌ఫ్రారెడ్- మరియు సబ్‌మిల్లీమీటర్ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. ఆయన, ఆయన బృందం ఖగోళ శాస్త్రం కోసం భూమి- మరియు అంతరిక్ష-ఆధారిత పరికరాలను అభివృద్ధి చేయడంలో పని చేశారు. వీటిని ఉపయోగించి మిల్కీ వే గెలాక్సీ సెంటర్ ( Galactic Centre) చుట్టూ గల నక్షత్రాల కక్ష్యలను అధ్యయనం చేశారు. రైన్ హార్డ్ గెంజెల్ తో పాటు ఆండ్రియా ఘెజ్ తమ బృందాలతో 1990 ల తొలి సంవత్సరాల నుండి వీటిని పరిశీలించారు. ఈ నక్షత్రాల కక్ష్యలను ఒక అత్యంత బరువైన వస్తువు నియంత్రిస్తున్నదని వారు కనుగొన్నారు. ఆ వస్తువు ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ( supermassive black hole ) అనేది ప్రస్తుతం తెలిసిన ఏకైక వివరణ. ఆ బ్లాక్ హోల్ సాజిటారియస్ ఎ ( Sagittarius A / Sgr A) గా గుర్తించారు. అది సుమారు నాలుగు మిలియన్ల సూర్యుల ద్రవ్యరాశి ( Solar masses ) కలిగి ఉంది. కానీ అది సూర్యుని పరిమాణం కన్నా చిన్నది.
పాలపుంత మధ్యలో ఉన్న నక్షత్రాల కక్ష్యలను ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ నియంత్రిస్తుందని, ఫలితంగా ఆ నక్షత్రాలు విపరీతమైన వేగంతో బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్నాయని ఘెజ్ మరియు గెంజెల్‌లు కనుగొన్నారు. ఈ పరిశీలనలతో పాలపుంత కేంద్రంలో సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉనికిని ఘెజ్, గెంజెల్ బృందాలు నిర్ధారించాయి.
అవార్డులు:
• ఒట్టో హాన్ మెడల్ (1980)
• బల్జాన్ ప్రైజ్ (2003)
• షా ప్రైజ్ (2008)
• క్రాఫోర్డ్ ప్రైజ్ (2012)
• టైకో బ్రాహి ప్రైజ్ (2012)
• రాయల్ సొసైటీ ఫెలో
• హార్వే ప్రైజ్ (2014)
• భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (2020)
0 Comments